జాతీయోద్యమ మహోజ్వల వారసత్వం

Nov 28 2021 @ 02:36AM

పరాయి పాలనలో, పీడనలో కునారిల్లుతున్న భారతీయులను విముక్తం చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించిన సుదీర్ఘ జాతీయోద్యమ వారసత్వం ఏమిటి? ఆ వారసత్వానికి 75 సంవత్సరాల తర్వాత నేడు ప్రాసంగికత ఉందా?


ఆంగ్ల పాలనకు వ్యతిరేకంగా జరిగిన అనేకానేక పోరాటాల్లో తొలుత చెప్పుకోదగ్గది 1857 తిరుగుబాటు. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా ప్రసిద్ధి పొందిన ఈ తిరుగుబాటు హిందూ- ముస్లిం సమైక్య నాయకత్వంలో జరిగింది. ఆ తిరుగుబాటు విఫలమైనా, దేశవిముక్తి దిశలో వేసిన తొలి అడుగు అది. ఆ తర్వాత ప్రవేశపెట్టిన పాలనా పరమైన మార్పులు – కంపెనీ పాలన రద్దు, ఆంగ్ల ప్రభుత్వ ప్రత్యక్ష పాలన. ఆంగ్లప్రభుత్వ విధానాలు, ప్రత్యేకించి ఆర్థికపరమైనవి, దేశాన్ని ఎలా పేదరికం పాలు చేస్తున్నాయో దాదాభాయి నౌరోజీ రచించిన ‘Poverty and Un-British Rule as India’ విపులంగా వివరించింది. 


స్వాతంత్ర్యోద్యమం సుదీర్ఘంగా సాగింది (1885–1947). స్వాతంత్ర్యానంతర దేశాభివృద్ధి గురించిన ఆలోచనలు జాతీయోద్యమంలో భాగంగా కాంగ్రెస్‌ వార్షిక సభల్లో చేసిన తీర్మానాల్లో స్పష్టంగా ఉన్నాయి. స్వాతంత్ర్యానంతర దేశప్రగతి, జాతీయోద్యమ వారసత్వం నుండి వచ్చినదే! స్వతంత్ర భారతావని భవిష్యత్‌ను నిర్దేశించింది, జాతీయోద్యమ భావజాలమే!


ప్రపంచ చరిత్రలో ఒక అపూర్వ అధ్యాయంగా వర్ణించబడిన భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య ఘట్టాలు – చంపారన్‌, బార్దోలీ రైతు పోరాటాలు, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా. ఇవి ప్రజాఉద్యమాలు. లక్షల సంఖ్యలో ఆబాలగోపాలం వాటిలో పాల్గొన్నారు. నాయకులు నిర్వహించిన పాత్ర ముఖ్యమైనా, సామాన్య ప్రజానీకమే వాటికి ప్రాణవాయువు. అందుకే, ప్రజలే ఉద్యమ నిర్మాతలు అనేది జాతీయోద్యమ వారసత్వంలో గ్రహించాల్సిన ప్రధాన అంశం. ఈ వ్యాఖ్య నాయకుల ప్రాముఖ్యాన్ని తగ్గించడానికి కాదు. వాస్తవంలో నాయకులు, ఆంగ్ల పాలనను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, విశ్లేషించి, దానికనుగుణంగా ఉద్యమ ఆశయాల్ని, పాటించాల్సిన ఎత్తుగడల్నీ నిర్ణయించారు. జాతీయోద్యమం సాధించిన గొప్ప విజయం దేశ స్వాతంత్ర్యం. రాజకీయ ప్రజాస్వామ్యం, పౌరహక్కుల పరిరక్షణకు నిబద్ధత ఆ మహోన్నత పోరాటం వారసత్వాలే. ఇటీవలి కాలంలో ఈ రెండూ రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నా, ప్రజాఉద్యమాలు, వార్తాసాధనాలు వాటిని కాపాడుకుంటూ వస్తున్నాయి.


భారతదేశ చరిత్రను నిశితంగా పరిశీలించినప్పుడు ఆదిమ సమాజాలను మినహాయిస్తే స్వేచ్ఛా, స్వాతంత్ర్య భావాలు అరుదు. ప్రాజ్ఞ పరిపాలన (Enlightened Rule) అన్ని చారిత్రక దశల్లో పొడచూపినా, అది అంతంతమాత్రమేనన్న అభిప్రాయాన్ని బిపన్‌చంద్ర లాంటి ప్రముఖ చరిత్రకారులు వెలిబుచ్చారు. ప్రజాశ్రేయస్సు అటుంచి, ప్రజాభిప్రాయానికి మన్నన, ఆదరణ, విలువ లుప్తమైనాయి.


జాతీయోద్యమం, ప్రారంభదశ నుంచి పౌరహక్కుల కోసం పోరాడుతూ వచ్చింది. పరాయి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు – స్వదేశీ (1905), సహాయ నిరాకరణ, విదేశీ వస్తుబహిష్కరణ మొదలైనవెన్నో – భారతీయుల్లో స్వేచ్ఛా, స్వాతంత్ర్య భావాలను ప్రోదిచేసి పెంపొందించాయి.


ఆధునికత (Modernity)ను ఆహ్వానించడం, ప్రజాస్వామిక పద్ధతులపై ఉద్యమాల్ని నిర్వహించడం జాతీయోద్యమ ప్రత్యేకతలు. ఈ వ్యాఖ్యకు మినహాయింపులు ఉండొచ్చు. వాటికి సహేతుక కారణాలు ఉండవచ్చు. దీనికి ఉదాహరణగా చరిత్రకారుడు బిపన్‌చంద్ర ఒక ఉదంతాన్ని ఉటంకించాడు. సహాయనిరాకరణ ఉద్యమంపై చేసిన తీర్మానానికి అనుకూలంగా 1886, వ్యతిరేకంగా 884 ఓట్లు వచ్చాయి. ఈ తీర్మానం గాంధీ స్వయంగా ప్రవేశపెట్టారు! ఇదే క్రమంలో పౌరహక్కుల పరిరక్షణ జాతీయోద్యమ ఎజెండాలో ఒక ప్రధాన భాగం. గాంధీ ఈ సందర్భంలో ఇలా అన్నారు. “Civil liberty in the first step towards swaraj... It is the foundation of freedom... It is water of life. I have never heard of water being diluted”. పౌరహక్కులను, ప్రజాస్వామిక భావాలను, పార్లమెంటరీ వ్యవస్థను నిర్ద్వంద్వంగా బలపరిచి, పదిలపరిచి, భారత రాజ్యాంగంలో పొందుపరచగలిగింది జాతీయోద్యమ వారసత్వమే!


జాతీయోద్యమం కేవలం రాజకీయ స్వాతంత్ర్యం, వ్యక్తిగత ప్రాథమిక హక్కుల కోసమే పాటుపడలేదు. పైపెచ్చు ఆర్థికాభివృద్ధి వైపు దృష్టి సారించింది. ఇంగ్లండ్‌ ఒకవైపు పారిశ్రామికంగా బలపడుతూ, మరో పార్శ్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను తన ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకుంది. దీన్నే ‘సంపద తరలింపు’గా సిద్ధాంతీకరించాడు దాదాభాయి నౌరోజి. 19వ శతాబ్ది నాటికే, వలస పాలనలోని ఆర్థిక, రాజకీయ అంశాల్ని గుర్తించి, అవి భారతదేశానికి చేస్తున్న కీడును గుర్తించి ప్రజలకు ఎరుకపర్చారు. దీంతో ఆంగ్లపాలకుల కపటత్వం – భారతీయుల అభ్యున్నతి కోసమే తమ పాలన పాటుపడుతున్నదన్న బూటకం- బయల్పడింది. నిజానికి వలస పాలనలోని ఆర్థిక దోపిడీని బట్టబయలు చేసింది తొలితరం జాతీయ నాయకులే!


ఆధునిక పారిశ్రామికాభివృద్ధికి జాతీయవాదులు వ్యతిరేకులు కాదు. కొందరు భావించినట్లుగా యంత్ర పరిశ్రమలకు గాంధీజీ వ్యతిరేకి కాదు. ఆధునిక పరిశ్రమలు, అసంఖ్యాకంగా ఉన్న భారతీయులకు ఉద్యోగావకాశాలు తగ్గిస్తాయనీ, కుటీర పరిశ్రమలు కునారిల్లి, దేశీయులను నిరుద్యోగులుగా చేస్తాయని అప్పట్లో భావించారు. అందుకే, భారీ పరిశ్రమలను రాజ్య వ్యవస్థ ఆధ్వర్యంలో నెలకొల్పి, నిర్వహించారు.


జాతీయోద్యమ ప్రధాన లక్ష్యాలలో స్వతంత్ర ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైంది. విదేశీ పెట్టుబడులు దేశీయ పరిశ్రమలను దెబ్బతీయకూడదు. అవి, భారతదేశ స్వతంత్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడవనీ, దేశ పాలనా వ్యవస్థపై పట్టు సాధిస్తాయని భావించారు.


జాతీయోద్యమ స్వప్నం ఏమిటి? ఆ మహోన్నత ఉద్యమం భావితరాలకు అందించిన సందేశం, చూపిన దారి ఏమిటి? ఉద్యమ ఆశయాలు, కన్నకలలు భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఇవి చట్టపర హక్కులు. వీటితో పాటు, రాజ్యాంగంలో మరో ముఖ్య అధికరణం, రాజ్యం అనుసరింపదగ్గ ఆదేశిక సూత్రాలు. ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా వాటిని అమలుచేయాలి. జాతీయోద్యమ స్వప్నం వాస్తవరూపం దాల్చుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం విశాల భారతీయ సమాజం చేపట్టే కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది.


జాతీయోద్యమానికి ఒక దార్శనికత (Vision) ఉందా? ఉన్నది. అది పేదల సంక్షేమం, శాస్త్రీయత, పౌరహక్కుల పరిరక్షణ, చట్టం ముందు సమానత్వం, ఆర్థికంగా సమసమాజం, రాజకీయంగా లౌకికత్వం, స్వతంత్ర విదేశాంగ విధానం- వాంఛనీయమైన, ఆచరణయోగ్యమైన ఈ దృష్టి ఉన్నందువల్లనే, జాతీయోద్యమం దీర్ఘకాలికంగా కొనసాగినా, తుదకు వలస పాలనకు స్వస్తి పలికింది.


చరిత్ర నిర్మాతలు ప్రజలే అన్న విశ్వాసంతో జాతీయోద్యమం అన్ని దశల్లోనూ పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఎనలేని త్యాగాలు చేసి స్వరాజ్యం సాధించారు. గమనించాల్సిన అంశం, అప్పట్లో సామాన్య ప్రజలు నిరక్షరాస్యులు. ప్రాంత, మత, కుల, పేద, ధనిక తారతమ్యాలు విస్మరించి వారు త్యాగబుద్ధితో చేసిన ఉమ్మడి కార్యాచరణ ఫలితమే దేశ స్వాతంత్ర్యం.


జాతిపిత గాంధీజీ పదే, పదే చెప్పినట్లు, భారతదేశం ఒక సమ్మేళన రాజ్యం. మత, కుల, ప్రాంతీయ, ధనిక, పేద విభేదాలు విస్మరించి, సమానత్వమే ప్రాతిపదికగా భావి భారతదేశాన్ని ఆవిష్కరించడమే జాతీయోద్యమ వారసత్వం.

వకుళాభరణం రామకృష్ణ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.