Advertisement

కొడుకు నేర్పిన గుణపాఠం

Jan 22 2021 @ 00:15AM

కుటుంబ బంధాల నుంచి వేరు పడిన భిక్షువులు కూడా వృద్ధ తల్లితండ్రుల ఆలనా పాలనా చూడడం తప్పు కాదని బుద్ధుడే ప్రకటించాడు. వయోధికులైన తల్లితండ్రుల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తికి అతని కొడుకు ఎలా బుద్ధి చెప్పాడో తెలియజేసే తక్కళ జాతక కథ ఇది.


బౌద్ధంలో ‘సిగాలోవాదసుత్త’ అనేది మానవ సంబంధాలకు సంబంధించినది. సమాజంలో మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, పెద్దల పట్ల ప్రేమానురాగాలు, వారి పట్ల చూపాల్సిన బాధ్యతలు ఎంత ఆరోగ్యకరంగా, ఉన్నతంగా ఉండాలో ఆ సుత్తం చెబుతుంది. అలాంటి ఉత్తమ సామాజిక సంబంధాలు బౌద్ధ సాహిత్యంలో అనేక చోట్ల కనిపిస్తాయి. అందుకే మానవ సంబంధాల మణిమకుటం బౌద్ధం. ప్రపంచీకరణ కాలంలో వయోధికులు తమ ఇళ్ళలోనే శరణార్థులుగా జీవించాల్సి వస్తోంది. వృద్ధుల పట్ల చిన్న చూపు ఇప్పుడే కాదు, కుటుంబ వ్యవస్థ పుట్టినప్పటి నుంచీ అంతో ఇంతో ఉంది. ఈ సమస్య బుద్ధుని కాలంలో కూడా ప్రధానంగా ఉన్నట్టు బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తోంది.


కుటుంబ బంధాల నుంచి వేరు పడిన భిక్షువులు కూడా వృద్ధ తల్లితండ్రుల ఆలనా పాలనా చూడడం తప్పు కాదని బుద్ధుడే ప్రకటించాడు. వయోధికులైన తల్లితండ్రుల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తికి అతని కొడుకు ఎలా బుద్ధి చెప్పాడో తెలియజేసే తక్కళ జాతక కథ ఇది.


పూర్వం కాశీ నగరంలో సుదత్తుడు అనే రైతు ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క కుమారుడు పేరు వశిష్ఠకుడు. వశిష్ఠకుని చిన్నతనంలోనే అతని తల్లి మరణించింది. అప్పటి నుంచి అతణ్ణి సుదత్తుడే తల్లిలా సాకి పెద్ద చేశాడు. కొడుక్కి యుక్తవయసు రాగానే ‘‘నాయనా! నీవు పెళ్ళి చేసుకో’’ అని అడిగాడు తండ్రి.


‘‘వద్దు నాయనా! ఆ వచ్చిన కోడలు నిన్ను సరిగ్గా చూస్తుందో, లేదో?’’ అన్నాడు వశిష్ఠకుడు.


అయినా ఆ తండ్రి అనేక చోట్ల తిరిగి, ఉత్తమురాలు అనిపించిన ఒక యువతితో వశిష్ఠకుడికి వివాహం జరిపించాడు. వారికి ఒక మగ సంతానం కలిగింది. ఆ బిడ్డకు సుజాతుడు అని పేరు పెట్టారు.


సుజాతుడు పెరిగి పెద్దవాడవుతూ ఉండగా, సుదత్తుడు మంచం పట్టాడు. ఇక, సేవలు చేయడం వ్యర్థం అని అతని కోడలికి అనిపించింది. ఆయన ఒకటి చేయమంటే మరొకటి చేసేది. మామా కోడళ్ళ తగవులు పెరిగిపోయాయి. చివరకు వశిష్ఠకుడు కూడా భార్య చెప్పుడు మాటలు విని... తండ్రిని దూషించడం మొదలుపెట్టాడు. కానీ సుజాతుడు మాత్రం తాత పట్ల ప్రేమతో ఉండేవాడు మనవణ్ణి చూసుకొని కొడుకు కోడళ్ళ తిట్లను సుదత్తుడు భరించేవాడు.


అతని కోడలు ఒక రోజున భర్తతో ‘‘మీ నాన్నగారి పీడను వదిలించుకోవాలి’’ అని చెప్పింది.


‘‘ఎలా?’’ అని అడిగాడు వశిష్ఠకుడు. 

‘‘మీ నాన్నను ఏదో పని మీద పొరుగు ఊరికి తీసుకువెళ్ళండి. దారిలో అడవి సమీపంలోని శ్మశానానికి రాగానే ‘దొంగలు దొంగలు’ అని అరచి, రాతితో మీ నాన్న తలపై కొట్టండి. ఆ శ్మశానంలోనే పాతేసి వచ్చేయండి’’ అని తన పథకం చెప్పింది. ధైర్యం నూరి పోసింది.


భార్య చెప్పినట్టే వశిష్ఠకుడు మర్నాడు తెల్లవారకముందే బండి కట్టి, తండ్రిని తీసుకుపోవడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో సుజాతుడు కూడా లేచి వచ్చి బండి ఎక్కాడు. ‘నేనూ వస్తా’నని మారాం చేశాడు. చేసేది లేక సుజాతకుణ్ణి కూడా వెంట తీసుకొని, బండి ముందున్న తొట్టెలో పడుకోబెట్టాడు. బండి ప్రయాణం సాగించి, శ్మశానం దగ్గరకు చేరింది. బండి వెనుక గూడులో తండ్రి, బండి ముందున్న తొట్టెలో కొడుకూ నిద్రపోతున్నట్టు గ్రహించిన వశిష్ఠకుడు బండి దిగాడు. పలుగూ, పారా తీసుకొని శ్మశానంలో గొయ్యి తీయడం మొదలుపెట్టాడు. 


ముందు రోజు రాత్రి తన తల్లితండ్రులు మాట్లాడుకున్న మాటలన్నీ సుజాతుడు విన్నాడు. అతను లేచి తండ్రి దగ్గరకు వచ్చి - ‘‘అయ్యా! అయ్యా! ఎందుకు ఈ గొయ్యి? ఇక్కడ కంద దుంపలు లేవు కదా! తేగలు లేవు కదా! ఆలు గడ్డలు లేవు కదా! ఎందుకు గొయ్యి తవ్వుతున్నావు?’’ అని అడిగాడు.


‘‘నాయనా! మీ తాత నాకు పీడగా తయారయ్యాడు. రోగిష్టివాడయ్యాడు. కాబట్టి మీ తాతను చంపి పాతెయ్యడానికే ఈ గొయ్యి’’ అన్నాడు వశిష్ఠకుడు.


వెంటనే ఆ పిల్లవాడు ఆ పక్కనే ఉన్న కర్ర తీసుకొని తానూ గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. అది చూసి వశిష్ఠకుడు- ‘‘బాబూ! నీకెందుకు ఈ గొయ్యి?’’ అని అడిగాడు.

‘‘నాన్నా! నేను మన వంశాచారం పాటించాలి కదా! కులగౌరవాన్ని కాపాడాలి కదా! ఈరోజు నువ్వు నీ తండ్రికి చేసే మర్యాద రేపు నీకు నేను చేయాలి కదా!’’ అన్నాడు సుజాతుడు.

ఆ మాటలు ఆ తండ్రి హృదయాన్ని తాకాయి. అతను వలవలా ఏడ్చాడు. తాను చేస్తున్న తప్పు తెలుసుకున్నాడు. బిడ్డను క్షమాపణ కోరాడు. తండ్రిని తీసుకొని క్షేమంగా ఇంటికి చేరాడు. భార్యను మందలించి, బుద్ధి చెప్పాడు. తండ్రిని బిడ్డలా చూసుకున్నాడు.


తాతా మనవళ్ళు ఎంతో హాయిగా కాలం గడిపారు. తాత తన అనుభవాల్ని మనవడికి అందించి, చివరకు సుఖంగా కాలం చేశాడు.

 బొర్రా గోవర్ధన్‌

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.