‘సెల్లార్‌’లో కూలీల సజీవ సమాధి

ABN , First Publish Date - 2022-06-26T09:51:38+05:30 IST

వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు.. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ పనులు సాగుతున్నాయి.

‘సెల్లార్‌’లో కూలీల సజీవ సమాధి

  • రిటైనింగ్‌ వాల్‌ కోసం భారీ తవ్వకాలు.. 
  • మట్టిపెళ్లలు కూలి ఇద్దరి మృతి.. 
  • కనీస జాగ్రత్తలు తీసుకోని నిర్మాణ సంస్థ
  • హెచ్‌ఎండీఏ, మణికొండ మునిసిపల్‌ అధికారుల నిర్లక్ష్యం
  • పక్కనే తాగునీటి పైపులైన్‌ లీకేజీ..
  • పనులు చేస్తుండగా కూలిన మట్టి  
  • మృతులిద్దరూ శ్రీకాకాళం వాసులు


నార్సింగ్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు.. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ పనులు సాగుతున్నాయి.. సెల్లార్‌ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. హఠాత్తుగా మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి.. అంతే ఇద్దరు కూలీలు సజీవ సమాధి అయ్యారు. అక్కడే పనిచేస్తున్న మరికొందరు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పుప్పాల్‌గూడలో చోటుచేసుకుంది. నిర్ణీత స్థాయిలో సెట్‌ బ్యాక్‌లు వదలకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేయడం వల్లే ఘటన జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. పుప్పాల్‌గూడ కల్లు కాంపౌండ్‌ స్థలంలో ఈఐపీఎల్‌ కంపెనీ బహుళ అంతస్తుల టవర్లు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా సెల్లార్‌ కోసం దాదాపు 30 అడుగుల మేర గుంత తవ్వారు. రిటైనింగ్‌ వాల్‌ కోసం అదనంగా మరో 20 అడుగులు.. మొత్తం 50 అడుగుల మేర తవ్వకాలు జరిగాయి. శనివారం 13 మంది కార్మికులు పనులు చేస్తున్నారు. మట్టిని ఆనుకొని ఐదుగురు పని చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. ముగ్గురు పరుగులు తీయగా.. ప్రసాద్‌ (40), వెంకటరమణ (45)లు మట్టి కింద కూరుకుపోయారు. ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ పోలీసు బృందం, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వచ్చి మట్టిని తొలగించి చూడగా రెండు మృతదేహాలు బయట పడ్డాయి. ముం దు జాగ్రతలు తీసుకోకుండా పనులు చేయడంవల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని పోలీసులు చెప్పారు. మృతులిద్దరూ శ్రీకాకుళంవాసులని, ప్రస్తుతం జగద్గిరిగుట్టలో ఉంటున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 


నోటీసులిచ్చినా నిర్లక్ష్యమే..

వర్షాకాలం నేపథ్యంలో సెల్లార్‌ తవ్వకాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవాలని మణికొండ మునిసిపాలిటీ పరిధిలో భవనాలు నిర్మిస్తున్న బిల్డర్లకు ఇటీవల అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈఐపీఎల్‌కూ నోటీసులిచ్చినట్లు చెబుతున్నారు. కానీ, నిర్మాణ సంస్థ ఇవేమీ పట్టించుకోలేదు. కనీస జాగ్రత్తలు తీసుకోని సంస్థకు పనులు నిలిపివేయాలంటూ నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ విషయంలో హెచ్‌ఎండీఏ, మణికొండ మునిసిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 10 ఎకరాల్లో ఈఐపీఎల్‌ సంస్థ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సెల్లార్‌ పనులు చేపట్టారు. స్థలం విలువే  రూ. 700 కోట్ల వరకు ఉంటుంది. మరో రూ.500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణం చేపడుతున్నట్టు తెలిసింది. 


భయంతో పరుగులు..

‘మట్టిపెళ్లలు మా కళ్ల ముందే విరిగి పడుతుంటే చాలా భయమేసింది. అప్రమత్తం చేసే లోపే వారిపై మట్టి పెళ్లలు పడ్డాయి. మేం అదృష్టవశాత్తు బయటపడ్డాం’ అని కొందరు కార్మికులు తెలిపారు. ఇతర రాష్ట్రాల కార్మికులూ అక్కడ పని చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 100 అడుగుల లోతు, 500 అడుగుల వెడల్పుతో సెల్లార్‌ త వ్వారు. అయితే మట్టికూలిన ప్రాంతంలో రోడ్డుకు ఆనుకుని తాగునీటి పైప్‌లైన్‌ ఉంది. దానికి లీకేజీ ఏర్పడి నీరు భూమిలోకి ఇంకుతూ కనిపించింది. కనీస జాగ్రతలు తీసుకోకపోవడంతో పాటు అక్కడ పైపులైన్‌ లీకవుతున్నా కంపెనీ వారు పట్టించుకోలేదు. 

Updated Date - 2022-06-26T09:51:38+05:30 IST