ఇక సమరమే

ABN , First Publish Date - 2022-05-28T07:31:25+05:30 IST

ఇక సమరమే

ఇక సమరమే

జగన్‌ పాలన రాష్ట్రానికి తీరని శాపం

రైతులూ రోడ్డెక్కండి.. అండగా ఉంటాం: బాబు

బాదుడే బాదుడులో నంబర్‌వన్‌.. మోటార్లకు మీటర్లు పెడతారా?

ఎన్టీఆర్‌ మీటర్లు తీసేస్తే జగన్‌ పెడుతున్నారు.. మోసకారి సంక్షేమం

ఏ రైతూ ఆనందంగా లేడు.. దిక్కుతోచక ఆత్మహత్యలు

బలవన్మరణాలకు పాల్పడొద్దు.. మీ పోరుకు అండగా ఉంటాం

దళితుల్లో వ్యతిరేకత వచ్చిందనే అమలాపురంలో జగన్‌ చిచ్చు

8 లక్షల కోట్లకు చేరిన అప్పు.. అభివృద్ధి మాత్రం శూన్యం

అబద్ధాలు చెప్పడంలో ఈ సీఎం దిట్ట.. ప్రశ్నిస్తే జైల్లో పెట్టడమే

పోలీసులూ.. తప్పుచేయొద్దు.. మేమొచ్చాక వదిలిపెట్టం: బాబు


పార్టీలో కొత్తరక్తం ఎక్కిస్తాం

40 శాతం టికెట్లు యువతకే

చంద్రబాబు ప్రకటన

ఘనంగా ప్రారంభమైన మహానాడు 


అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డిది చేతకాని దద్దమ్మ పాలన అని.. ఆయన నిర్వాకంతో రాష్ట్రం పరువుపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆయన అబద్ధాలకోరు అని విరుచుకుపడ్డారు. బాబాయి హత్య నుంచి ప్రత్యేక హోదా వరకు అసత్యాలు ప్రచారం చేశారన్నారు. ఒక ఉన్మాది పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని ధ్వజమెత్తారు. ఒకే ఒక్క చాన్స్‌ అంటే.. కరెంటు తీగను ముట్టుకున్నట్లే అయిందని చెప్పారు. ఈ మూడేళ్లలో ప్రతి ఒక్కరికీ.. ప్రతి వర్గానికీకష్టాలేనని.. అందుకే ‘క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని నినదిస్తున్నానని.. ఇది ప్రజలందరి గుండెలకు చేరాలని పిలుపిచ్చారు. ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. గత మూడే ళ్లలో జరిగిందేంటి? బాదుడే బాదుడు. మహాఘోరమైన బాదుడు. విద్యుత్‌ చార్జీల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరల వరకూ అన్నీ బాదుడే. మరోవైపు మన హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ఉన్నాయా? బీసీలకు ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చిన పథకం ఉందా? పెళ్లికానుక ఉందా? సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుక, రంజాన్‌ తోఫా ఉన్నాయా’ అని నిలదీశారు. రాష్ట్రంలో ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా అని ప్రశ్నించారు. ‘రైతులు పూర్తిగా చితికిపోయారు. కింతమంది రైతులు దిక్కతోచని పరిస్తితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారందరినీ కోరుతున్నా.. ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మీ కుటుంబాలను అనాథలను చేయొద్దు.. రోడ్లపైకి రండి.. మీకు మేం అండగా ఉంటాం.. మిమ్మల్ని తిరిగి బాగుచేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంద. నాడు రైతులకు మేం ఒకే దఫా రూ.50 వేల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తే.. ఇప్పుడు కేవలం ఏడాదికి రూ.7,000 ఇస్తున్నారు. పైగా రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తామంటున్నారు. అసలే కుదేలైపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలోకి వారిని నెట్టేశారు. ఎన్టీఆర్‌ మోటార్లకు మీటర్లు తీసేస్తే జగన్‌రెడ్డి ఇప్పుడు మళ్లీ పెడుతున్నాడు. మీటర్లు ఎలా పెడతారో చూద్దాం’ అని స్పష్టం చేశారు. మహానాడు తెలుగువాడి పండగన్నారు. తెలుగుజాతి ఉన్నంతవరకూ ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశమేనని తెలిపారు. ‘మన నాయకుడు ఎన్టీఆర్‌ పెట్టిన పసుపు గుర్తు శుభసూచికం. రైతు నాగలి, పేదోడి గుడిసె, కార్మిక చక్రం చిహ్నాలతో ఎన్టీఆర్‌ రూపొందించిన పసుపు పతాకం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అనేక మహానాడులు చూశా. ఈ మహానాడులో ఉన్నంత ఉత్సాహం, అభిమానం ఎప్పుడూ చూడలేదు’ అని చంద్రబాబు అన్నారు. మహానాడుకు ప్రజా వెల్లువ ప్రభంజనం మాదిరిగా ఉంటే మంత్రుల బస్సు యాత్రలో స్పందన లేక ఈగలు తోలుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మహానాడుకు పోటీగా బస్సు యాత్ర పెట్టి చతికిలబడ్డారని వ్యాఖ్యానించారు. ఇంకా ఏమన్నారంటే.. 


తెలుగుదేశం హయాంలో ధరలు పెరిగాయా?

దేశంలోనే మహా భయంకర బాదుడే బాదుడు రాష్ట్రంలోనే. తెలుగుదేశం హయాంలో విద్యుత్‌ చార్జీలు ఒక్క పైసా అయినా పెరిగాయా..? ఇప్పుడు కోతలు కోసేసి.. ఇచ్చే విద్యుత్‌కూ వాతలు పెట్టేశారు. పేదలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అందరిపైనా బాదుడే బాదుడు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇటీవలే కేంద్రం కొంత తగ్గించింది. కొన్ని రాష్ట్రాలూ తగ్గించాయి. కానీ మన రాష్ట్రంలో తగ్గించలేదు. 


అమరావతినీ హైదరాబాద్‌లా..

నిన్న ప్రధాని మోదీ హైదరాబాద్‌ వచ్చి ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌(ఐఎ్‌సబీ)20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆయన నా పేరు చెప్పకున్నా.. అది నా హయాంలోనే వచ్చిందన్న సంగతి ప్రస్తావించకున్నా ఫర్వాలేదు. ఈ సందర్భంగా నాటి సంగతులు గుర్తొస్తున్నాయి. ఐఎ్‌సబీని దేశంలోని టాప్‌-500 పారిశ్రామికవేత్తలు కలిసి పెట్టాలనుకున్నారు. లాభాపేక్ష లేకుండా వ్యాపారదక్షులైన ఉన్నత విద్యావంతులను తయారుచేయడం దాని లక్ష్యం. ముంబై, చెన్నై, బెంగళూరుల్లో ఎక్కడో ఒకచోట పెట్టాలనుకున్నారు. నా కార్యదర్శి రజత్‌గుప్తా ఈ విషయం చెప్పారు. వెంటనే వారికి ఫోన్‌చేసి హైదరాబాద్‌లో పెట్టాలని అడిగాను. అసలు హైదరాబాద్‌ మా పరిశీలనలోనే లేదన్నారు. సరే.. లేకున్నా పర్లేదు. ఒకసారి హైదరాబాద్‌ వచ్చి వెళ్లండని అడిగా. సీఎంగా పిలవడంతో వచ్చారు. విమానాశ్రయానికి మంత్రులను పంపించా. ఇంటి బయటికెళ్లి నేనే స్వాగతం చెప్పా. స్వయంగా ఆహ్వానించి భోజనం వడ్డించా. ఆ తర్వాత వారితో మాట్లాడా. అన్ని రాష్ట్రాలూ తిరగండి.. వారిచ్చిన దానికి ఒకటి కలిపి నాకు పంపించండి. నేను సౌకర్యాలు కల్పిస్తానని చెప్పా. అన్నీ తిరిగి వెంటనే ఫోన్‌చేశారు. మిగతా రాష్ట్రాల్లో అనుభవం, మీ రాష్ట్రంలో అనుభవం వేరుగా ఉన్నాయి.. ఐఎ్‌సబీ హైదరాబాద్‌లోనే పెడతామని చెప్పి పెట్టారు. జినోమ్‌ వ్యాలీ తెచ్చా. అందులోనే ఇప్పుడు మానవాళిని రక్షించిన కొవిడ్‌ టీకా తయారైంది. ఇలాంటి ఆణిముత్యాలను అనేకం హైదరాబాద్‌ తెచ్చా. అమరావతిని కూడా అలాగే చేయాలని సంకల్పించా. అన్నీ సిద్ధమయ్యాయి. కానీ జగన్‌రెడ్డి నాశనం చేశారు. 


తెలుగుదేశం అంటేనే బీసీలు..

తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు. బీసీలను ఆదరించిన పార్టీ టీడీపీ ఒక్కటే. ఈ వేదికపై ఉన్న నాయకులే దానికి నిదర్శనం. బీసీల గురించి వైసీపీ వాళ్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేస్తే.. వారు టీడీపీ వైపు ఉన్నారన్న కక్షతో వివక్ష చూపించింది వైసీపీయే. బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ఆపేసింది. రాష్ట్రంలో దళితుల దమనకాండపై ఒక పుస్తకం ప్రచురించాం. దానికి సమాధానం చెప్పే శక్తి జగన్‌రెడ్డికి ఉందా? మూడో నంబర్‌ జీవో తెచ్చి గిరిజనులకు ద్రోహం చేశారు. మైనారిటీలను ముంచేశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. అందుకే వారికి ప్రజల్లో స్పందన లేదు. వారి పార్టీలో బీసీ నేతలు లేక టీడీపీ నుంచి తీసుకుని రాజ్యసభ టికెట్లు ఇచ్చారు. ఒక సీటును తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ నేతకు ఇచ్చారు. 


ప్రత్యేక హోదా ఏమైంది? మద్యనిషేధం అని చెప్పలేదా?

అబద్ధాలు చెప్పడంలో జగన్‌రెడ్డి దిట్ట. ఎన్నికల ముందు బాబాయ్‌ హత్య ఎలా జరిగిందన్నాడు. గుండెపోటు అని చెప్పాడు. గుండెపోటేనా? గొడ్డలిపోటును గుండెపోటు చేసి సానుభూతి కొట్టేసే రాజకీయం చేశారు. కోడికత్తి వ్యవహారం కూడా అదే. కోడికత్తితో గుచ్చితే ఎవరికైనా ఏమైనా అవుతుందా అని అప్పుడే అడిగా. దానినీ రాజకీయం చేసి అబద్ధాలు చెప్పి సానుభూతి కోసం జిమ్మిక్కులు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాకా అదే తరహా కుట్రలు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల ముందు చెప్పారు. మరిప్పుడు ఆ హోదా ఏమైంది? మద్యనిషేధం అని ఎన్నికల ముందు చెప్పలేదా? మరి చేసిందేంటి? నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నారు. ధరలు పెంచి భారం మోపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపేసి ఇంటికే తెస్తే.. ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేశారు. అయితే అన్నిరకాలుగా ఇరుక్కుపోవడం, వ్యతిరేకత రావడంతో అరెస్టుచేశారు. ఈలోపు దళితుల్లో వ్యతిరేకత వచ్చిందని సీఎంకు నిఘా వర్గాలు చెప్పాయి. దీంతో అమలాపురంలో కోనసీమ జిల్లా వ్యవహారంతో చిచ్చుపెట్టారు. 


బీసీ నేతలను అరెస్టు చేస్తే నిద్రపోలేదు..

టీడీపీకి 60 లక్షల మంది కుటుంబసభ్యులున్నారు. పార్టీకి ఉన్న బలం వీరే. కార్యకర్తల సంక్షేమం కోసం ఏదైనా చేస్తా. వారి ఆరోగ్యం, విద్య కోసం పథకాలు పెట్టాం. మరిన్ని పెడతాం. ఈ వేదికపైన ఉన్న అచ్చెన్నాయుడితోపాటు పలువురు బీసీ నేతలను అరెస్టుచేశారు. కుటుంబసభ్యులను అరెస్టు చేస్తే నిద్రెలా పడుతుంది? అనేక రోజులు నిద్రపోలేదు. అరెస్టుచేసినవారిని బయటకు తీసుకురావడం, ఆ వ్యవహారాన్ని అధిగమించడం ఎలాగనే ఆలోచించేవాడిని. తెలుగుదేశంలో ఎవరికి కష్టం వచ్చినా మొత్తం కుటుంబానికి వచ్చినట్లే. వారికోసం ఇంకా ఎంతవరకైనా చేసేందుకు సిద్ధం. పార్టీలో ఇంకో 45 ఏళ్లకు సరిపడా నాయకత్వం ఉండాలి. అందుకే 40 శాతం యువతకు సీట్లిస్తాం. పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తాం. 


చప్పట్లే చప్పట్లు.. విజయ సంకేతాలు

భారీగా తరలివచ్చిన టీడీపీ ప్రతినిధులు, కార్యకర్తలు చంద్రబాబు ప్రసంగానికి లేచి నిలబడి చప్పట్లుకొట్టారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే.. భారీ ఎత్తున కార్యకర్తలు, మహిళలు లేచి నిలబడి నినాదాలు చేశారు. కాబోయే సీఎం చంద్రబాబు అని నినదించారు. 


 టీడీపీ రాజకీయ తీర్మానం 

అధికారం కోసం కులం, మతం, ప్రాంతం, భాష వంటి అంశాలను రెచ్చగొట్టి ప్రజలను చీల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న స్వార్థ రాజకీయ శక్తుల అవకాశవాదాన్ని ప్రజలకు వివరించాలి. జగన్‌ ప్రభుత్వ అసమర్థ, ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేస్తూనే.. మరోవైపు వివిధ కారణాల వల్ల పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరగా చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.





Updated Date - 2022-05-28T07:31:25+05:30 IST