ఇక కాన్వాయ్‌కు వాహనాలు కష్టం

ABN , First Publish Date - 2022-05-17T06:40:04+05:30 IST

సర్కారుకు రవాణా శాఖ ఊహించని ఝలక్‌ ఇచ్చింది. వీఐపీల పర్యటనలకు కాన్వాయ్‌ సమకూర్చా లంటే కష్టమని తేల్చేసింది.

ఇక కాన్వాయ్‌కు వాహనాలు కష్టం

చేతులెత్తేసిన రవాణా శాఖ 

పాత బకాయిలు చెల్లించాలంటూ మొర

ఒంగోలు (క్రైం), మే 16 : సర్కారుకు రవాణా శాఖ ఊహించని ఝలక్‌ ఇచ్చింది. వీఐపీల పర్యటనలకు కాన్వాయ్‌ సమకూర్చా లంటే కష్టమని తేల్చేసింది. పాత బకాయిలు తీర్చాలంటూ కమిషనర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు.  రాష్ట్రవ్యాప్తంగా రూ.17.5కోట్లు కాన్వాయ్‌ వాహనాలకు డీజిల్‌, అద్దె బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. గత నెలలో సీఎం ఒంగోలు పర్యటనకు వచ్చినప్పుడు జరిగిన సంఘటన కూడా లేఖలో ఉటంకించినట్లు సమాచారం. వాహన యజమానులకు గత మూడేళ్లుగా కాన్వాయ్‌ బకాయిలు చెల్లించని కారణంగా వారు వాహనాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని ఆ శాఖ అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. 


మూడేళ్లుగా నిలిచిన బకాయిలు

మూడేళ్లుగా జిల్లాలో అధికారికంగా రూ.19.60లక్షల బకాయిలు ఉన్నాయి. అనధికారికంగా ఇంకా ఎంతో ఉంటుంది. దీంతో జిల్లాలో వాహనదారులను రవాణా శాఖ అడగలేక, ఇతర జిల్లాల వాహనాలను బలవంతంగా తీసుకోవడంతో సమస్య మరింత జఠిలమైంది. వినుకొండ నుంచి తిరుపతికి స్వామి దర్శనానికి బయల్దేరిన ఓ కుటుంబం ఇన్నోవా వాహనాన్ని ఒంగోలులో ఆపేసి ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసం రవాణా శాఖ అధికారులు బలవంతంగా లాగేసుకున్నారు. వారు ఎంత బతిమలాడినా వినలేదు. దీంతో వారు బస్టాండ్‌కు చేరుకుని బిక్కుబిక్కుమం టూ గడిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన ప్రకంపనలు పుట్టించింది. అంతటా వైరలై సీఎం వరకు చేరింది. ఆయన ఆగ్రహించడం తో సంబంధిత బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌, హోంగార్డుపై అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్రంలో ఏడాదికి రూ.4.5కోట్లు కాన్వాయ్‌ కోసం నిధులు ముందస్తుగా విడుదల చేయాలని రవాణా శాఖ లేఖలో పేర్కొంది. అంతేకాకుండా రానున్న రెండేళ్లలో ముఖ్యమంత్రితో పాటుగా వీఐపీలు పర్యటనలు అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో రవాణా శాఖ ముందస్తుగా అప్రమత్తమైంది.


Updated Date - 2022-05-17T06:40:04+05:30 IST