ఓ రొయ్యో!చెరువులో ధాన్యమా!

ABN , First Publish Date - 2021-11-09T06:45:45+05:30 IST

రొయ్యల చెరువుల్లో ధాన్యం పండుతుందా? ఏమో మిల్లర్లు తలుచుకుంటే ఏమైనా జరగొచ్చు.

ఓ రొయ్యో!చెరువులో ధాన్యమా!

ధాన్యం కొనుగోళ్లలో అధికారుల మాయాజాలం

రొయ్యల చెరువుల్లో వరిసాగు చేశారట 

తొమ్మిది మంది రైతుల పేరిట రూ.92 లక్షల చెల్లింపులు

సహకరించిన గరాలదిబ్బ ఆర్‌బీకే ఉద్యోగి, వీఆర్వో

అక్రమాలపైౖ ఎస్పీ, కలెక్టర్లకు ఓ వ్యాపారి ఫిర్యాదు


రొయ్యల చెరువుల్లో ధాన్యం పండుతుందా? ఏమో మిల్లర్లు తలుచుకుంటే ఏమైనా జరగొచ్చు. అధికారులు తలుచుకుంటే అన్నీ నిజమవ్వొచ్చు. బందరు మండలం గరాలదిబ్బ గ్రామంలోని రొయ్యల చెరువులను కౌలుకు తీసుకుని తొమ్మిది మంది రైతులు వరిసాగు చేశారట. అధికారులు వారి మాటలను నమ్మారట. ఆ ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రైతు భరోసా కేంద్రం బిల్లులను కూడా మంజూరు చేసిందట.


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : బందరు మండలం గరాలదిబ్బ గ్రామంలోని రొయ్యల చెరువుల్లో గూడూరు మండలం తరకటూరుకు చెందిన తొమ్మిదిమంది రైతులు భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేసినట్టు రికార్డుల్లో చూపారు. స్థానిక వీఆర్వో ఈ మేరకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. గరాలదిబ్బ రైతు భరోసా కేంద్రం నుంచి ఈ తొమ్మిది మంది రైతులకూ ఒక్కొక్కరికీ రూ.10.80, రూ.11.50 లక్షలు చొప్పున బిల్లులు కూడా మంజూరు చేశారు. ఈ తతంగం మొత్తం మచిలీపట్నంకు చెందిన ఇరువురు మిల్లర్లు, మధ్యవర్తుల కనుసన్నల్లో నడిచింది. దీనికి రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ, వ్యవసాయశాఖ అధికారుల సహకారం తోడయింది. మిల్లర్లు, మధ్యవర్తులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి, ధాన్యం బిల్లులు మంజూరు చేయించుకున్న సంఘటనపై ఎస్పీకి, కలెక్టర్‌కు ఓ కమీషన్‌ వ్యాపారి ఫిర్యాదు చేశారు. మరో వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానుండగా, ఈ లొసుగులు బయటపడటం గమనార్హం. 


విషయం వెలుగు చూసిందిలా.. 

గుడ్ల్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన పొలగాని వాసు ధాన్యం కమీషన్‌ వ్యాపారి. ధాన్యం కొనుగోళ్లలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై ఆయన నెలరోజుల క్రితం ఎస్పీకి, సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి...

తరకటూరుకు చెందిన నెరుసు శ్రీనివాసరావు అనే మధ్యవర్తి ద్వారా 29 డిసెంబరు 2020 నుంచి 14 ఏప్రిల్‌ 2021 వరకు మచిలీపట్నం చింతగుంటపాలెంలోని లక్ష్మీ వేంకటేశ్వర ట్రేడర్స్‌కు, విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి వెంబడి ఉన్న ప్లాటినం రైస్‌ ఇండస్ర్టీకి,   బాపులపాడు మండలం కాకులపాడులోని సువేరా ఆగ్రో ఇండస్ట్రీకి 12,915 సారలు (ఒక్కోసార 45 కేజీలు) ధాన్యాన్ని వాసు విక్రయించారు. 75 కిలోల బస్తాకు  పది రూపాయల కమీషన్‌ పద్ధతిపై ఆయన ఽధాన్యం విక్రయించారు. ఈ ధాన్యం విలువ రూ.1,08,48,600. ఇందుకు మధ్యవర్తిగా ఉన్న  నెరుసు శ్రీనివాసరావు మిల్లుల ద్వారా, చెక్కుల ద్వారా, ఆన్‌లైన్‌ద్వారా పొలగాని వాసుకు రూ.78,01,811 ఇచ్చాడు. మిగిలిన రూ.30.46 లక్షలు ఇవ్వాలని వాసు పదేపదే కోరినా, ప్రభుత్వం నగదు విడుదల చేయలేదని నెరుసు శ్రీనివాసరావును చెబుతూ వచ్చాడు. మే, జూన్‌ నెలల్లో ప్రభుత్వం ధాన్యం బిల్లులు మంజూరు చేసినా, మిల్లుల నుంచి బిల్లులు రాలేదంటూ దాటవేస్తూ వచ్చాడు. దీంతో వాసు చింతగుంటపాలెం రైస్‌ మిల్లు వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఆ సందర్భంలోనే నెరుసు శ్రీనివాసరావుతో పాటు మరో ఎనిమిది మంది రైతులు గరాలదిబ్బ ఆర్‌బీకే పరిధిలోని భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేసినట్టు చూపి, రూ.92 లక్షల మేర ఽధాన్యం బిల్లులను దొడ్డిదారిన దక్కించుకున్నట్టు వాసు తెలుసుకున్నారు. వెంటనే ఈ వ్యవహారంలో డీఎస్‌వో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గరాలదిబ్బ ఆర్‌బీకేను మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నడుపుతున్నారు. అక్కడి నుంచే ఈ అక్రమాలన్నీ సాగడం గమనార్హం.  


ఏవో తిప్పలు పడ్డారట.. వదిలేయమంటున్నారు

గరాలదిబ్బ ఆర్‌బీకే నుంచి తరకటూరుకు చెందిన తొమ్మిది మంది పేరిట నిబంధనలకు విరుద్ధంగా రూ.92 లక్షల ధాన్యం బిల్లులు మంజూరు చేయడంపై డీఎస్‌వో కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. దీనిపై దృష్టి సారించాల్సిన ఓ అధికారి ‘మిల్లర్లు, మధ్యవర్తులు ఏవో తిప్పలు పడ్డారు. విషయాన్ని పెద్దది చేయొద్దు, వదిలేయండి..’ అంటున్నారు. అంతటితో ఆగకుండా సదరు అధికారి ‘మిల్లర్లు, మధ్యవర్తితో మాట్లాడి సరిచేస్తాను.. నా సంగతేంటి?’ అంటూ బేరాలు పెడుతున్నాడు. ధాన్యం విక్రయించిన రైతుల నుంచి ఒత్తిడి రావడంతో నగదు సర్దుబాటు చేశాను. నాతోపాటు కూడేరు, నిమ్మకూరు, అవురుపూడి, పెసరమిల్లి, చంద్రాల తదితర ప్రాంతాల కమీషన్‌ వ్యాపారులు కూడా మోసపోయారు. ఈ ఘటనపై విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి, కలెక్టర్‌కు స్పందన కార్యక్రమాల్లో ఫిర్యాదు చేశాను. - పోలగాని వాసు, ధాన్యం కమీషన్‌ వ్యాపారి 

Updated Date - 2021-11-09T06:45:45+05:30 IST