మాయా మాధ్యమం

ABN , First Publish Date - 2020-09-05T06:15:15+05:30 IST

తెలంగాణ శాసనసభలో బిజెపికి చెందిన ఏకైక శాసనసభ్యుడు రాజాసింగ్‌ను ‘ప్రమాదకరమైన వ్యక్తి’గా పరిగణిస్తూ, ఆయన ఖాతాను సామాజిక మాధ్యమ సంస్థ ‘ఫేస్‌బుక్‌’ నిషేధించింది.

మాయా మాధ్యమం

తెలంగాణ శాసనసభలో బిజెపికి చెందిన ఏకైక శాసనసభ్యుడు రాజాసింగ్‌ను ‘ప్రమాదకరమైన వ్యక్తి’గా పరిగణిస్తూ, ఆయన ఖాతాను సామాజిక మాధ్యమ సంస్థ ‘ఫేస్‌బుక్‌’ నిషేధించింది. రాజాసింగ్‌ ఖాతాను అందుబాటు లేకుండా, ఆయన మిత్రుల, బృందాల ఖాతాలతో సహా అన్నిటినీ ఫేస్‌బుక్‌ తొలగించింది. హింసను, విద్వేషాన్ని ప్రోత్సహించరాదన్న తమ విధానం ఆధారంగానే ఈ తొలగింపు జరిగినట్టు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఆ ఖాతాను తాను నిర్వహించడం లేదని, తన అనుచరులో, అభిమానులో ఎవరో నిర్వహిస్తూ వచ్చారని రాజాసింగ్‌ చెబుతున్నారు. తన అధికారిక ఖాతా రెండేళ్ల కిందట హ్యాక్‌ అయిందని, తిరిగి దాన్ని పునరుద్ధరించమని కోరుతూ సంస్థకు లేఖ రాశానని శాసనసభ్యుడు అంటున్నారు. ఈ వివరణ వల్ల, తన పేరిట ఉన్న ఖాతాలోని వివాదాస్పద అంశాలకు సంజాయిషీ ఇవ్వనక్కరలేదని రాజాసింగ్‌, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నాయకులు అనుకోవచ్చు. తన ఫేస్‌బుక్‌ ఖాతా విద్వేష రచనలకు వేదిక అయిందని ఒక అంతర్జాతీయ పత్రిక రాసేదాకా, రాజాసింగ్‌ ఎందుకు దానిని ఉపేక్షించారన్నది ప్రశ్న. ఫేస్‌బుక్‌ రాజకీయ పక్షపాత ధోరణి చూపుతున్నదని, కొందరి విద్వేషపు పోస్టులను చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నదన్న విమర్శకు రాజాసింగ్‌ ఖాతా ఒక సాక్ష్యంగా కనిపించడం వల్లనే దాని నిషేధం జరిగిందనిపిస్తోంది.


సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా ఫేస్‌బుక్‌ వివిధ దేశాలలో రాజకీయాలను ప్రభావితం చేస్తున్నదన్న అపకీర్తి మూటగట్టుకున్నది. 300 కోట్లకు పైగా ఖాతాదారులున్న అతి పెద్ద సామాజిక మాధ్యమం, ఆ బలాన్ని దుర్వినియోగం చేయడానికే చూస్తున్నది తప్ప, ఒక సమానావకాశాల ప్రజాస్వామిక వేదికగా నిలబడడానికి ప్రయత్నించడం లేదు. ప్రతి ఒక్క ఖాతా, ఒక జర్నల్‌, సొంత పత్రిక వంటిది. తమ వ్యక్తిగత అభిరుచులను, రాజకీయాభిప్రాయాలను, తమ సమస్త ఉద్వేగాలను, ఆవేశాలను పరిజ్ఞానాన్ని తాము ఎంచుకున్న మిత్రులతో పంచుకునే వేదిక ఫేస్‌బుక్‌. ఈ అభిప్రాయ వినిమయం జరుగుతున్న సమయంలోనే,  ప్రతి ఒక్క ఖాతాదారు అభిరుచులను, కొనుగోలు అలవాట్లను, జీవనసరళిని గ్రహించి వ్యాపారసంస్థలకు అమ్ముకుంటున్నది. ఇంటర్నెట్‌లో వ్యక్తమయ్యే మన సరళికి తగ్గట్టుగా వ్యక్తిగతంగా గురిపెట్టిన వ్యాపారప్రకటనలను ఫేస్‌బుక్‌ గుప్పిస్తుంది. ప్రపంచాన్నంతా చుట్టేసి, గ్లోబల్‌ కమ్యూనిటీలను నిర్మించే ఈ వేదిక, పన్నులు మాత్రం అమెరికాకే కడుతుందట. వ్యాజ్యాలు మాత్రం అమెరికాలోనే చెల్లుతాయట.


తమ చేతిలో ఉన్న ఖాతాదారుల జీవన, మేధో, హృదయ సరళులను రాజకీయంగా కూడా విక్రయించడానికి సామాజిక మాధ్యమాలు ప్రయత్నిస్తాయి. 2016లో అమెరికా ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఫేస్‌బుక్‌ కృషిచేసింది. తరువాత క్షమాపణలు చెప్పింది. భారతదేశంలో 2014లో జరిగిన ఎన్నికలకు ముందే, ఫేస్‌బుక్‌తో ఒక రాజకీయపక్షానికి అవగాహన కుదిరిందన్న ఆరోపణలున్నాయి. ఒక పక్షం కాదు, రెండు ప్రధాన పక్షాలతోనూ బేరాలు సాగాయన్న వాదనా ఉన్నది. ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా దేశంలో తీవ్ర జాతీయవాదం, మతతత్వం కలగలసి భావవాతావరణంగా బలపడిన తరువాత, ఫేస్‌బుక్‌ మాధ్యమంలో అభ్యంతరకరమైన పోస్టుల సంఖ్య పెరిగింది. వ్యక్తిగతమైన నిందలు, ఆరోపణలు, అసభ్యకరమైన రాతలు ఉంటే, ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఖాతాను తాత్కాలికంగా స్తంభింపచేయడం దగ్గర నుంచి , పూర్తిగా నిషేధించడం దాకా చర్యలు తీసుకునే సంస్థ, అత్యంత భయానకమైన రాతలు కనిపిస్తున్నా ఉదాసీనంగా ఉంటున్నది. ఈ ధోరణి మీదనే ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’’లో కథనం వచ్చింది. ఫేస్‌బుక్‌ సంస్థ ఇండియా పాలసీ చీఫ్‌ అంఖీదాస్‌కు బిజెపితో ఉన్న సంబంధాలే ఈ ఉదాసీనతకు కారణమన్నట్టుగా ఆ పత్రిక రాసింది. ఫేస్‌బుక్‌ వైఖరి వల్ల తమకు రాజకీయంగా నష్టం జరుగుతున్నా, విద్వేష వాతావరణం వ్యాపిస్తున్నా గొంతెత్తడానికి ధైర్యం చాలని కాంగ్రెస్‌ పార్టీ, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంతో కొంత స్పృహలోకి వచ్చింది. ఫేస్‌బుక్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. తాము నికార్సయిన నిష్పక్షపాతులమని బుకాయించిన ఫేస్‌బుక్‌ చివరకు చర్యలు మొదలుపెట్టవలసి వచ్చింది. రాజాసింగ్‌ ఖాతాతో పాటు అనేక వందల ఖాతాల మీద చర్యలు తీసుకున్నది.


చాలా సులువుగా మాయ చేయవచ్చు కాబట్టి, విచక్షణకు తావివ్వకుండా ప్రజల మనస్సులను ప్రభావితం చేయవచ్చును కాబట్టే, రాజకీయపక్షాలు సామాజికమాధ్యమాల మీద దృష్టి పెడుతున్నాయి. పత్రికల మీద కక్షసాధింపులకు, నిరాదరణకు పాల్పడుతున్నాయి ప్రధాన స్రవంతి మీడియా కంటె ఎక్కువ మంది పాల్గొనడానికి, అధిక భావప్రసారానికి ఆస్కారమిచ్చే సోషల్‌ మీడియా, మరోవైపు మూక ధోరణి, అబద్ధాల వ్యాప్తికి వేదికగా కూడా మారింది. సామాజిక మాధ్యమాలు వ్యాపింపజేసే అసత్యాలను ఎదుర్కొనడానికి సత్యనిర్ధారణ ఇప్పుడు మీడియాలో ఒక ప్రత్యేక రంగంగా అభివృద్ధి చెందవలసివస్తున్నది. ఉద్వేగాల మీద, తీవ్ర జాతీయవాదం మీద అధికారానికి సులువుగా ప్రయాణించవచ్చుననే ధోరణి పెరిగాక, మాధ్యమాల దుర్వినియోగం మరింతగా పెరుగుతుంది. విషం చిమ్మే రాతలపై చర్య తీసుకోవలసి వచ్చే అనివార్య పరిస్థితికి సామాజిక మాధ్యమాలు ఇప్పుడు చేరుకున్నాయి. అదే సమయంలో, ద్వేషాన్ని నిరోధించడం పేరుతో విమర్శను కూడా అడ్డుకునే చర్యలకు పాల్పడే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక, ప్రజాస్వామిక, ఉద్యమ శక్తులకు సంబంధించిన పోస్టులపై, పేజీలపై చర్య తీసుకోవడానికి ఫేస్‌బుక్‌ ఉత్సాహపడుతున్నదని వింటున్నాము. ప్రజలకు అటువైపు ఉండడానికి ఎందుకో అంత తాపత్రయం?

Updated Date - 2020-09-05T06:15:15+05:30 IST