సర్కారు స్కూళ్లకు తగ్గిన విద్యార్థులు.. ప్రైవేటు పాఠశాలల వైపు చూపు

ABN , First Publish Date - 2022-08-12T21:52:32+05:30 IST

చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల(High School)లో ఆరో తరగతితో పాటు ఇతర తరగతుల్లో ఏటా 1,100 మంది విద్యార్థులు చేరేవారు. ప్రస్తుత

సర్కారు స్కూళ్లకు తగ్గిన విద్యార్థులు.. ప్రైవేటు పాఠశాలల వైపు చూపు

ప్రాథమిక పాఠశాలల విలీనం

ఎయిడెడ్‌ పాఠశాలల మూత ప్రధాన కారణం

జిల్లాలో గత ఏడాది కంటే ఆరేడు వేలు తగ్గిన సంఖ్య

టీసీలు తీసుకోకుండానే వెళ్లిపోతున్న కొందరు విద్యార్థులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల(High School)లో ఆరో తరగతితో పాటు ఇతర తరగతుల్లో ఏటా 1,100 మంది విద్యార్థులు చేరేవారు. ప్రస్తుత సంవత్సరం ఇప్పటివరకు సుమారు 950 మంది చేరారు. అదే సమయంలో ఏడు నుంచి పదో తరగతి వరకు 150 నుంచి 200 మంది టీసీలు తీసుకువెళ్లేవారు. అయితే ఈ ఏడాది టీసీలు తీసుకువెళ్లిన వారి సంఖ్య 300 దాటింది. మరికొంతమంది టీసీలు తీసుకువెళ్లకపోయినా పాఠశాలకు రావడం లేదు.


ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది తగ్గింది. గడచిన రెండు, మూడు సంవత్సరాలతో పోల్చితే ఈ  సంవత్సరం ప్రవేశాలు తక్కువగా వున్నట్టు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు చెబుతున్నారు. నాడు-నేడు పనులతో కొన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు పెరిగినా... ప్రాథమిక పాఠశాలల విలీనం, నగరంలో రమారమి 18 ఎయిడెడ్‌ ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలల మూసివేత, జూన్‌ రెండో వారంలోనే అమ్మఒడి సాయం అందడం వంటి కారణాలతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారంటున్నారు. జిల్లాలో విశాఖ రూరల్‌, ఆనందపురం, పెందుర్తి, పద్మనాభం, భీమిలి మండలాల్లో పలు ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో అక్కడ చదివే కొందరు విద్యార్థులు ఉన్నత పాఠశాలలకు వెళ్లకుండా తమ ఇంటికి దగ్గరలో వున్న ప్రైవేటు పాఠశాలల్లో చేరిపోయారు. ఇక నగరంలో 18 ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడడంతో అక్కడ చదువుకునే పిల్లల్లో కొద్దిమంది మాత్రమే సమీపంలోని జీవీఎంసీ, జడ్పీ పాఠశాలల్లో చేరగా, మిగిలిన వారంతా ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. ఏవీఎన్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల మూత నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న పిల్లలను కిలోమీటరు దూరంలో వున్న ఎంవీడీ ఉన్నత పాఠశాలకు మ్యాపింగ్‌ చేశారు. ఎంవీడీ పాఠశాలలో వసతి లేకపోవడం గమనించి కొంతమంది మాత్రమే చేరారు.  అలాగే మర్రిపాలెం రైల్వే ఎయిడెడ్‌ పాఠశాల పిల్లలను కప్పరాడలోని జీవీఎంసీ పాఠశాలకు మ్యాపింగ్‌ చేసినా అక్కడ కూడా వసతి సమస్య ఎదురైంది. ఎయిడెడ్‌ పాఠశాలల మూత నేపథ్యంలో అక్కడ పిల్లలను విద్యా శాఖ సమీపంలోని జీవీఎంసీ, జడ్పీ పాఠశాలలకు మ్యాపింగ్‌ చేసి చేతులు దులుపుకుంది. కనీసం పాఠశాలల్లో వసతి ఉందా? లేదా అనేది పర్యవేక్షించలేదు...సరికదా పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి నచ్చచెప్పలేదు. వారి తిప్పలు వారి పడతారు అన్న విధంగా వ్యవహరించింది. దీంతో ఎయిడెడ్‌ పాఠశాలల్లోని విద్యార్థుల్లో అత్యధికులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. కరోనా ప్రభావంతో రెండేళ్లపాటు మూతపడిన అనేక ప్రైవేటు పాఠశాలలను పునఃప్రారంభించడమే కాకుండా విద్యార్థుల చేరికపై గట్టిగా దృష్టిసారించాయి. చిన్న చిన్న పాఠశాలలైతే.. అమ్మఒడి కింద ఇచ్చే సాయంతో పాటు కొద్దోగొప్పో చెల్లిస్తే పిల్లలను చేర్పించుకున్నాయి. గత ఏడాది నగరంలో 146 ప్రభుత్వ పాఠశాలల్లో (అన్ని యాజమాన్యాలు కలిపి) సుమారు 34,500 నుంచి 35,000 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుత ఏడాది 31,500 నుంచి 32,000 మంది మాత్రమే ఉన్నారు. అదే గ్రామీణ ప్రాంతంలోని భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్‌ మండలాల్లో గత ఏడాది 20 వేల మంది ఉండగా, ప్రస్తుతం 17,500కు తగ్గారు. ఇంకా టీసీలు తీసుకోకుండా ప్రైవేటు బడుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య జిల్లాలో 1000 నుంచి రెండు వేల వరకు వుండవచ్చునని చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు పాఠశాలల్లో చేరేందుకు గడువు వున్నప్పటికీ ప్రభుత్వ బడుల్లో కొత్తగా చేరే విద్యార్థులు పెద్దగా పెరగపోవచ్చునని అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-08-12T21:52:32+05:30 IST