కరుగుతున్న కాంగ్రెస్ కాలం

ABN , First Publish Date - 2022-04-06T06:12:26+05:30 IST

‘ప్రజాస్వామ్యం రెండు చక్రాలపై నడుస్తుంది. ఒక చక్రం అధికార పార్టీ అయితే మరో చక్రం ప్రతిపక్ష పార్టీ. ప్రజాస్వామ్యం సరిగా సాగాలంటే బలమైన ప్రతిపక్షం అవసరం....

కరుగుతున్న కాంగ్రెస్ కాలం

‘ప్రజాస్వామ్యం రెండు చక్రాలపై నడుస్తుంది. ఒక చక్రం అధికార పార్టీ అయితే మరో చక్రం ప్రతిపక్ష పార్టీ. ప్రజాస్వామ్యం సరిగా సాగాలంటే బలమైన ప్రతిపక్షం అవసరం. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి. ఆ పార్టీ బలహీనపడితే, ఇతర ప్రాంతీయ పక్షాలు దాని స్థానంలో ప్రవేశిస్తాయి, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. ఒక బిజెపి నేత నుంచి ఇలాంటి మాటలు రావడం ఆయన రాజనీతిజ్ఞతను తెలియజేస్తుంది. నిజానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ దుస్థితి గురించి బాధపడే ఆ పార్టీ శ్రేయోభిలాషులెవరైనా ఇదే రకంగా బాధపడతారు. భారతీయ జనతా పార్టీలో కూడా కాంగ్రెస్ గురించి బాధపడే నితిన్ గడ్కరి లాంటి నేతలున్నారంటే ఒక ప్రతిపక్ష పార్టీ బలంగా లేకపోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ఏర్పడే ముప్పు గురించి వారికి కూడా స్వానుభవం కలుగుతున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.


ఇవాళ భారతదేశంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నాయి. ప్రభుత్వ విధానాలను మార్చలేకపోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగేంతవరకూ మౌనంగా ఉండి, ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే 12 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచారు. దీనిపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కనీసం చర్చను కూడా సాధించలేకపోతున్నాయి. చర్చకోసం ఇస్తున్న నోటీసులను ఉభయ సభాపతులు తిరస్కరిస్తున్నారు. దీంతో గందరగోళం సృష్టించడం, వాకౌట్ చేయడం మినహా ప్రతిపక్షాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఇది ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా అనిపించడం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తాము ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాని వల్ల తమకు వచ్చే నష్టం ఏమీ ఉండదన్న ధీమా కేంద్రంలో బిజెపి అగ్రనేతలకు ఏర్పడింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎడా పెడా పెంచడం ఇందుకు సంకేతం అయితే మోదీ నుంచి ఇంకా ఎటువంటి కీలక నిర్ణయాలు వెలువడనున్నాయా అని భయపడవలసి వస్తోంది. ఈ ఫలితాల తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణ, లేబర్ కోడ్‌ల అమలు, ప్రభుత్వ ఆస్తుల నగదీకరణతో పాటు మరిన్ని ఆర్థిక సంస్కరణల విషయంలో మరింత వేగంగా చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నా రైతులను మార్కెట్ వైపు నడిపించే చర్యలు పరోక్షంగా ఇప్పటికే వేగంగా పుంజుకున్నాయని, క్రమంగా కనీస మద్దతు ధరకు విలువ లేకుండా పోతుందని పరిశీలకులు భావిస్తున్నారు.


2024 సార్వత్రక ఎన్నికల లోపు బిజెపి మరో తొమ్మిది రాష్ట్రాల్లో తన సత్తానిరూపించుకోవాల్సి ఉన్నది. వీటిలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌లలో బిజెపి నేరుగా కాంగ్రెస్‌ను ఢీకొనాల్సి ఉన్నది, తెలంగాణలో కాంగ్రెస్‌ను అధిగమించి టీఆర్‌ఎస్‌ను గద్దెదించడం బిజెపికి అంత సులభమైన పని కాదు. కనుక ఈ రాష్ట్రాల్లో కనుక కాంగ్రెస్‌ను తుడిచిపెడితే బిజెపికి దేశంలో ఇక ఎంతమాత్రం తిరుగుండదు, ఆ తర్వాత భారత ప్రజాస్వామ్యం పూర్తిగా ఏకపార్టీ దిశగా పయనించే అవకాశాలు స్పష్టంగా ఏర్పడతాయి. ఉధృత ఎన్నికల ప్రచారం, క్రింది స్థాయి నుంచి బూత్‌ల నిర్వహణ, ప్రత్యర్థులను బలహీనపరచడం, అవసరమైన చోట్ల హిందూత్వ విధానాలు మొదలైన పద్ధతులతో మోదీ ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహరచన విజయవంతం అయితే ఆయన లక్ష్యం నెరవేరక మారదు. దేశం నుంచి కాంగ్రెస్ విముక్తి అయిన తర్వాత ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టడం బిజెపికి పెద్ద విషయం కాదు. ఇప్పుడు ప్రతి ప్రాంతీయ పార్టీ ఢిల్లీ నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఆత్మరక్షణ పద్ధతులను అనుసరించాల్సి వస్తోంది. ఇక పూర్తిగా దేశం తన గుప్పిట్లోకి వచ్చిన తర్వాత మోదీ విధానాలు ఎలా ఉంటాయో ఊహించడం ఎవరికైనా కష్టం కాదు. బహుశా అందుకే నితిన్ గడ్కరి లాంటి వారు బలమైన ప్రతిపక్షం గురించి మాట్లాడి ఉంటారు. ఒక రకంగా ఆయన మాటలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన సంకేతాలను అందించి ఉంటాయి.


మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ నితిన్ గడ్కరి మాటలనే ప్రస్తావించారు. ‘కాంగ్రెస్ పునరుద్ధరణ కాంగ్రెస్‌కు మాత్రమే ముఖ్యం కాదు, మొత్తం ప్రజాస్వామ్యానికి, మన సమాజానికి కూడా ఎంతో ముఖ్యం’ అని ఆమె చెప్పారు. కాంగ్రెస్ జీవన్మరణ సమస్య నెదుర్కొంటున్నదని సోనియాగాంధీకి స్పష్టంగా తెలుసు. 1998లో సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు కేవలం మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఒడిషా, మిజోరంలలో మాత్రమే అధికారంలో ఉన్నది, అప్పటి నుంచీ ఒకో రాష్ట్రాన్ని కాంగ్రెస్ గెలుచుకుంటూ 2004లో కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు ఆ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్‌లలో మాత్రమే అధికారంలో ఉన్నది. వచ్చే రెండేళ్లలో ఈ రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాక, బిజెపితో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించడం అంత సులభం కాదు.


ఆ విషయం తెలిసినప్పటికీ కాంగ్రెస్‌కు చేయగలిగింది ఏమీ లేదు. ప్రత్యర్థి చేతుల్లో బలికావడం కంటే శాయశక్తులా పోరాడి కనీసం జీవించేందుకు ప్రయత్నించక తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నది. విచిత్రమేమంటే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం మారాలని ఎన్ని డిమాండ్లు వస్తున్నా, గాంధీ కుటుంబ సభ్యులకు మించిన నాయకులు కనపడడం లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీ పూర్తిగా దెబ్బతింటున్నదని తెలిసినా రాహుల్ స్థానంలో రాగలిగిన నాయకుడెవరూ కాంగ్రెస్‌లో కనపడడం లేదు.


అందుకే సోమవారంనాడు 38 మంది తెలంగాణ నేతలు ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ వ్యూహరచన గురించి ఆయన చేసిన ప్రసంగాలను తదేక శ్రద్ధతో విన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, క్రమశిక్షణా రాహిత్యానికి తావు లేదని ఆయన మాట్లాడుతుంటే తలలు ఊపడం మినహా వారు ఏమీ చేయలేకపోయారు. అసలు రాహుల్ గాంధీ ఎవరు? ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి చాలా కాలమైంది. కనీసం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా కాదు. అయినప్పటికీ రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నించగల ధైర్యం కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ లేదు. కొద్ది రోజుల క్రితం కర్ణాటక నేతలను కూడా ఇదే విధంగా ఢిల్లీ పిలిపించి ఆయన పాఠాలు చెప్పారు. జనంలోకి వెళ్లి ఉద్యమాలు చేయాలని, మీరు ఎప్పుడు రమ్మన్నా తాను అప్పుడు వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటానని ఆయన ఇప్పుడు చెబుతున్నారు. ఇంతకాలం ఆయన ఈ పని ఎందుకు చేయలేదో ఎవరికీ అర్థం కావడం లేదు.


పైగా ఇప్పుడు క్రమశిక్షణను ఉల్లంఘిస్తే వేటు వేస్తామని నేతలను అధిష్టానం హెచ్చరిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉల్లఘించినందువల్లే అది అరాచక పార్టీగా పేరొందింది. పంజాబ్‌లో ముఖ్యమంత్రిని తిట్టిపోసిన నవజోత్ సింగ్ సిద్ధూనే కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సహించి పిసిసి పగ్గాలను అప్పగించింది. గతంలో కోట్ల, నేదురుమల్లి, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నా అసమ్మతి నేతలు ఢిల్లీకి పొలోమని వచ్చేవారు. అసమ్మతి నేతలనే ముఖ్యమంత్రులను చేసిన సంస్కృతి కాంగ్రెస్‌ది. ఇప్పుడు రేవంత్‌కు కూడా ఆ బాధ తప్పడం లేదు. ఉత్తమ్ పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అసమ్మతి నడిపిన వారే రేవంత్‌కు తలనొప్పిగా తయారయ్యారు. విచిత్రమేమంటే కాంగ్రెస్‌లో అసమ్మతి నడిపే వారి వెనుక ఒక రహస్య ఎజెండా ఉంటుంది. తాము అసమ్మతి నడపడం వల్ల, పార్టీ నియమించిన నేతనే బలహీనంగా మార్చడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుందో వారికి తెలియనిది కాదు. ఇప్పటికైనా క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమని అధిష్టానం చెప్పడం సరైన పరిణామమే. తమిళనాడులో రాహుల్, ప్రియాంకలను విమర్శించిన పార్టీ అధికార ప్రతినిధిపైనే వేటు వేశారు. ఇది రాష్ట్రాల నాయకులపై అసమ్మతి నడిపే వారిపై కూడా అమలు చేస్తే బాగుంటుంది.


కాంగ్రెస్‌కు సమయం ఎక్కువగా లేదు. కనుక రాష్ట్రాలలో విజయం సాధించేందుకు ఏమి చేయాలో, ఏ విధంగా పార్టీలో నాయకులు అందరినీ కలుపుకుని విజయం వైపు నడిపించాలో అన్న దాని గురించి ఆ పార్టీ నాయకులు ఆలోచించాల్సి ఉన్నది. ఇందుకు అవసరమైన విశ్వసనీయమైన సమిష్టి నాయకత్వ బృందం బిజెపి బృందానికి దీటుగా ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజులన్నీ కాంగ్రెస్‌కు అంతిమ యుద్ధంలో ఘట్టాలే. రాహుల్ ఈ పోరులో విజయం సాధించేందుకు కొద్ది రోజులే కష్టపడాల్సి ఉంది. లేకపోతే ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడ విహార యాత్రకు వెళ్లినా ఆయనను అడిగేవారుండరు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-04-06T06:12:26+05:30 IST