మెమో ఇచ్చి మసిపూశారు

ABN , First Publish Date - 2022-06-30T07:32:39+05:30 IST

మెమో ఇచ్చి మసిపూశారు

మెమో ఇచ్చి మసిపూశారు

హాస్టళ్లలో హాజరు అక్రమాలపై కనిపించని విచారణ 

విజిలెన్స కదిలినా.. శాఖ అధికారుల్లో కానరాని చలనం

పొంతనలేని ఉన్నతాధికారుల సమాధానాలు

ఖమ్మం, జూన 29 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో కొందరు సంక్షేమ అధికారులు హాజరు పేరిట అంకెల గారడీ ప్రదర్శించారు. హాస్టల్‌లో ఉండని విద్యార్థుల పేరుతో హాజరువేయడం, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలను తమ హాజరు లిస్టులో చూపడం లాంటి అక్రమాలకు పాల్పడి అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, రెండు రోజుల వ్యవధిలో హాజరు మార్చారని, ఒక్కసారే 29 మంది విద్యార్థులు సంఖ్య ఎలా తగ్గిందనే అంశాలపై ‘వసతిలో మాయగాళ్లు’, ‘అధికారుల అంకెల గారడీ’ శీర్షికలతో రెండు రోజులపాటు ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దాంతో కొందరు సంక్షేమ అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఎస్సీ సంక్షేమ హాస్టళ్లపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కేవలం మెమో ఇచ్చి అక్రమాలు బయటకు రాకుండా మసి పూశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతపెద్దస్థాయిలో ఆరోపణలు వచ్చినా కనీసం విచారణ నిర్వహించకుండా వివరణ అడగడం.. ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. 


చలించని సంక్షేమ శాఖ..

హాస్టళ్లలో విద్యార్థుల పేరుతో జరుగుతున్న అక్రమంపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాల పట్ల జిల్లా విజిలెన్స శాఖ అధికారులు కదిలారు. జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యతోపాటుగా జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో వివరాలు సేకరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయా వసతి గృహాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై మొట్టమొదటగా స్పందించాల్సిన సంబంధిత శాఖ అధికారులు కనీసం చలించకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి హాజరు మాయ ముందుగానే తెలుసని, కొందరు అధికారులకు నెలవారీ మామూళ్లు సైతం అందుతాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే ఇది వెలుగులోకి వచ్చినప్పటకీ దాన్ని పెద్ద విషయంగా భావించలేదన్న అంశంపై తీవ్ర చర్చజరుగుతోంది. హాజరు మాయ అంశానికి సంబంధించి సంబంధిత సంక్షేమ శాఖ అధికారులకు ఇంక్రిమెంట్లు కట్‌ చేశామని చెబుతున్నా అది ఎక్కడా అధికారికంగా ప్రకటించకపోవడం వెనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


ఉన్నతాధికారుల సమాధానాలపై విమర్శలు.. 

హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు వేసే హాజరుకు పొంతన లేకపోవడం లాంటి ఆరోపణలకు సంబంధించి ఉన్నతాధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంత పెద్దస్థాయిలో హాజరు శాతం తేడా రావడానికి కారణం.. హాస్టళ్ల ప్రారంభం నేపథ్యంలో ఒకేరోజు విద్యార్థులందరినీ పిలిచారనీ కొందరు అధికారులు సమాధానమిస్తున్నట్టు తెలిసింది. అలా పిలిస్తే మిగిలిన హాస్టళ్లలోనూ అదే తరహా హాజరు నమోదు కావాల్సి ఉంటుంది.. కానీ కొన్ని హాస్టళ్లలో మాత్రమే ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక పలు ఆరోపణలున్నాయి. అంతేకాదు.. ఆ రోజు వచ్చిన విద్యార్థులు ప్రస్తుతం కొనసాగుతున్నారా? ఒకవేళ అంతటిస్థాయిలో సంఖ్య చూపించినా ఆయా పేర్ల విద్యార్థులే ఉన్నారా? లేరా? అన్న అనుమానాలు తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవల నిర్వహించిన సంక్షేమాధికారుల సమావేశంలో కొందరు సంక్షేమ అధికారులు తాము వేసిన హాజరులో ఉన్న విద్యార్థులు హాస్టల్‌లో ఉండటంలేదని బహిరంగంగానే అంగీకరించినట్టు సమాచారం. అయినా వారిని కేవలం మందలించి వదిలేయడం వెనుక విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతలా ఆరోపణలు వస్తున్నా కనీసం ఆయా హాస్టళ్లవైపు ఉన్నతాధికారులు కన్నెత్తి చూడలేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి సంబంధిత అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 

Updated Date - 2022-06-30T07:32:39+05:30 IST