అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-12-03T05:56:54+05:30 IST

సచివాలయానికి వస్తే వీఆర్‌ఓలను తరమండంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజును బర్తరఫ్‌ చేయాలంటూ వీఆర్‌ఓలు డిమాండ్‌ చేశారు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని బర్తరఫ్‌ చేయాలి
హిందూపురంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న వీఆర్‌ఓలు

వీఆర్‌ఓల డిమాండ్‌... నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన 

హిందూపురం టౌన, డిసెంబరు 2: సచివాలయానికి వస్తే వీఆర్‌ఓలను తరమండంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజును బర్తరఫ్‌ చేయాలంటూ వీఆర్‌ఓలు డిమాండ్‌ చేశారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ శ్రీనివాసులుకు వినతిని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రిగా ఉండి వీఆర్‌ఓలను సచివాలయాలకు రాకుండా తరమాలంటూ పేర్కొనడం హేయమైన చర్య అన్నారు. కాశీబుగ్గ మునిసిపల్‌ కమిషనర్‌ రాజగోపాల్‌రావును ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఒక అధికారిగా ఉండి వీఆర్‌ఓలను బయటికి పొమ్మనడం తగదన్నారు. మంత్రి వీఆర్‌ఓలకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విధులకు గైర్హాజరై ఉద్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఓలు సుదర్శన, అనీల్‌, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌, నాగమణి, సుభాషిణి, శివానంద, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. 


పరిగి: మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఓలు గురువారం నిరసన చేశారు. పెనుకొండ డివిజన వీఆర్‌ఓల సంఘం అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ సచివాలయానికి వస్తే వీఆర్‌ఓలను తరిమికొట్టండనడం బాధాకరమన్నారు. మంత్రి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మీకి వినతిపత్రం అందించారు. 

Updated Date - 2021-12-03T05:56:54+05:30 IST