మృత్యుదారులు

ABN , First Publish Date - 2022-08-11T06:47:53+05:30 IST

జిల్లాలో జాతీయ రహదారులు మృత్యుదారులుగా మారాయి. ముఖ్యకంగా జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ముఖ్యంగా అతివేగం, నిద్ర, మద్యం మత్తులో వాహనాలు నడపడం ఒక కారణమైతే.. ప్రధాన రహదారులపై ఉన్న మూలమలుపుల వద్ద నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం మరో కారణమని పోలీసులు వెల్లడిస్తున్నారు.

మృత్యుదారులు

జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు

నిత్యం గాలిలో కలుస్తున్న అనేక మంది ప్రాణాలు

అతివేగంతో అదుపు తప్పుతున్న వాహనాలు

మలుపుల వద్ద కానరాని సూచిక బోర్డులు

ఇప్పటికీ చర్యలు చేపట్టని అధికారులు

మంగళవారం మెండోర జాతీయ రహదారిపై ఇద్దరు యువకుల దుర్మరణం

బుధవారం ముప్కాల్‌ గ్రామ శివారులో  రక్తసిక్తమైన జాతీయ రహదారి

డివైడర్‌ను ఢీకొట్టిన కారు

అక్కడికక్కడే నలుగురి మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రకు వెళ్తుండగా దుర్ఘటన

మృతులు హైదరాబాద్‌ వాసులు

ఆర్మూర్‌రూరల్‌/ముప్కాల్‌, ఆగస్టు 10: జిల్లాలో జాతీయ రహదారులు మృత్యుదారులుగా మారాయి. ముఖ్యకంగా జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ముఖ్యంగా అతివేగం, నిద్ర, మద్యం మత్తులో వాహనాలు నడపడం ఒక కారణమైతే.. ప్రధాన రహదారులపై ఉన్న మూలమలుపుల వద్ద నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం మరో కారణమని పోలీసులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో వేల్పూర్‌ మండలం లక్కోర, ఆర్మూర్‌ మండలం చేపూరు, బోధన్‌ మండలం రాకాసిపేట, అలాగే కమ్మర్‌పల్లి మండ లం గండిహన్మాన్‌, నగర శివారులోని దాస్‌నగర్‌, మల్లారం గండి మలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ఆయా ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

వాహన వేగం అదుపుకాక..

జిల్లాలోని ఇందల్‌వాయి మండలం చంద్రాయన్‌పల్లి నుంచి మెండోరా మండలం బుస్సాపూర్‌ వరకు ప్రతిరోజూ ఈ రహదారిపై వేలాది వాహనాలు వెళ్తున్నాయి.వాహనాలు స్పీడ్‌గా వెళ్లడం, మూలమలుపులను గుర్తుపట్టకపోవడం, ఒకేసారి టర్నింగ్‌ వచ్చిన సమయంలో వాహనం అదుపుకాకపోవడం వల్ల ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలకు కావాల్సిన సూచికలు ఉంచకపోవడం, బ్లాక్‌స్పాట్స్‌ హైవే అథారిటీ గుర్తించిన ప్రమాదం తెలిపే సూచికలను ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామాల వద్ద మూలమలుపులు ఎక్కువగా ఉండడం, బైపాస్‌లు ఉన్నచోట కూడా వాహనాలు వేగం అదుపు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత నెల 18న బాల్కొండ వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. జూన్‌ 27న కూడా మరో జాతీయ రహదారి వేల్పూర్‌ వద్ద ప్రమాదం జరిగి మెట్‌పల్లికి చెందిన ఇద్దరు మృతిచెందారు. వాహనం అతివేగంగా నడపడం వల్లనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు మృతిచెందారు. ఇదే రహదారిపై చేపూర్‌ వద్ద కారు డివైడర్‌కు ఢీకొట్టడంతో మెట్‌పల్లికి చెందిన వ్యక్తులు మృతిచెందారు. జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఇలాంటి ప్రమాదాలు ఈ రెండు రహదారులపైన కొనసాగుతున్నాయి. ఈ రెండు రహదారులపైన జరిగే 90 శాతానికి పైగా రోడ్డు ప్రమాదాలు అతివేగంగా వెళ్లడం వల్ల జరుగుతున్నట్లు పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

జారిమానా వేస్తున్నా పట్టింపు కరువు

జాతీయ రహదారులపైన స్పీడ్‌గన్‌లు పెట్టి 80కి.మీలలోపు వెళ్లాలని నియంత్రిస్తు ఫైన్‌లు వేస్తున్న పట్టించుకోవడంలేదు. ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉదయం, రాత్రివేళల్లో జరుగుతున్నాయి. జాతీయ రహదారులపై, మూల మలుపుల వద్ద రేడియం, మూలమలుపు స్టిక్కర్‌లు, సూచికలు ఏర్పాటు చేయేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 

జిల్లాలో జాతీయ రహదారి 44, 63లో ఎక్కడెక్కడ ప్రమా దాలు జరుగుతున్నాయో హై వే అథారిటీ అధికారులతో పా టు జిల్లా పోలీసులు పలు దఫాలు సర్వే చేశారు. బ్లాక్‌స్పాట్‌లను గుర్తించారు. కొన్నిచోట్ల కొద్ది మొత్తం లో సరిచేయడంతో పా టు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జాతీ య రహదారుల అధికారులు ఇంకా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం, ఇప్పటికి మూలమలుపుల వద్ద ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేపై వెళ్లే వాహనాల స్పీడ్‌ నియంత్రించడంతో పాటు వాహనాలు నడిపేవారికి అవగాహన కల్పిస్తే ఈ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. 

జాతీయ రహదారులపైనే అధికం

జిల్లాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల ద్వారా పోలీసుల లెక్కల ప్రకారం 350 నుంచి 400 మధ్య వ్యక్తులు చనిపోతున్నారు. మరో 800లకు పైగా క్షతగాత్రులవుతున్నారు. వీటిలో సగానికిపైగా ఈ రెండు జాతీ య రహదారులపైనే జరుగుతున్నాయి. మిగతా రహదారులకన్న ఈ రెండు రహదారులపైన వాహనాల నియంత్రణ లేకపోవడం, ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపైన రోడ్లపైనే లారీలు, కంటైనర్‌లు నిలపడం వల్ల స్పీడ్‌గా వస్తున్న వాహనాలు చూసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.  అయితే ఆయా పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఇందల్‌వాయి, చంద్రాయన్‌పల్లి నుంచి మెండోర, బుస్సాపూర్‌ వరకు పర్యవేక్షణ చేస్తే కొంతమేర ప్రమాదాలు తగ్గనున్నాయి. బోధన్‌, సాలూరా నుంచి కమ్మర్‌పల్లి వరకు ఈ రోడ్డుపైన కూడా పోలీసులు నిఘా పెడితే రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయి.

నలుగురి దుర్మరణం..

ముప్కాల్‌: మండలంలోని కొత్తపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని టోలిచౌకికి చెందిన మహమ్మద్‌ అంజాద్‌ షేక్‌ (32) వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మహారాష్ట్రలోని వార్దాలో అంజాద్‌ షేక్‌ సోదరుడి ఇంట్లో ఫంక్షన్‌ ఉండడంతో.. బుధవారం తెల్లవారుజామున 4గంటలకు హైదరాబాద్‌ నుంచి రెండు వాహనాల్లో కుటుంబసభ్యులు బయలుదేరారు. ఈ క్రమంలో మహమ్మద్‌ అంజాద్‌ షేక్‌(32) తన కారులో.. సోదరి మినహజ్‌బేగం (38)తో పాటు వారి కుటుంబీకులు సయ్యద్‌  సాతియా, మహమ్మద్‌ తక్వాన్‌, సయ్యద్‌ అహీల్‌ హైమద్‌(7), సయ్యద్‌ అదిల్‌ లెహజన్‌, సయ్యద్‌ ఉమెర్‌ హకీం, సయ్యద్‌ ఫిర్జా హందాని(3) బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ముప్కాల్‌ మండలం కొత్తపల్లి వద్ద అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టి, అవతలి వైపు రోడ్డుపై పడిపోయింది. కారు మధ్యలో ఉన్న మినహజ్‌ బేగం మృతదేహం ఎగిరి రోడ్డు కింది భాగంలో పడింది. కారు నడుపుతున్న మహమ్మద్‌ అంజాద్‌షేక్‌, మినహజ్‌ బేగం రెండవ కుమారుడు సయ్యద్‌ అహీల్‌ హైమద్‌(7), చిన్నకూతురు ఫిర్దా హందాని (3) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే సయ్యద్‌ సాతియా, సయ్యద్‌ అదిల్‌లెహజన్‌, సయ్యద్‌ ఉమెర్‌హకీంలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న మరో కారులోని వ్యక్తులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని వెంటనే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. అతివేగం, నిద్రమత్తే ఈ దుర్ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మినహజ్‌బేగం భర్త సయ్యద్‌ జుబేర్‌ ఇబ్రహీంసా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మనోహర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-08-11T06:47:53+05:30 IST