చదువుల తల్లి మన తెలంగాణ ఎస్సార్సీ

ABN , First Publish Date - 2021-12-29T09:12:13+05:30 IST

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి జాతీయ సాక్షరతా మిషన్‌లో భాగంగా 1978లో రాష్ట్ర వయోజన విద్యా వనరుల కేంద్రం (ఎస్.ఆర్.సి) ఏర్పడింది. అప్పటినుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

చదువుల తల్లి మన తెలంగాణ ఎస్సార్సీ

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి జాతీయ సాక్షరతా మిషన్‌లో భాగంగా 1978లో రాష్ట్ర వయోజన విద్యా వనరుల కేంద్రం (ఎస్.ఆర్.సి) ఏర్పడింది. అప్పటినుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వయోజన విద్యా కేంద్రాలను నెలకొల్పి నిరంతర అక్షరాస్యత కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ అవసరమైన పుస్తకాలను ముద్రిస్తూ గ్రామ గ్రామాన విస్తరించింది. అనితర సాధ్యంగా విద్యా కార్యక్రమాల్లో ప్రతిష్టాత్మక నెహ్రూ లిటరసీ అవార్డుతో పాటు 5 జాతీయ అవార్డులను గెలుచుకుని దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 32 ఎస్.ఆర్.సి.లలో తెలంగాణ ఎస్‌.ఆర్.సి తలమానికంగా నిలిచింది.


1978 నుంచి 1988 వరకు ఎస్.ఆర్.సి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విస్తరణ విభాగంతో కలిసి పనిచేస్తూ వయోజనుల అక్షరాస్యత కోసం 32 రకాల వయోజన వాచకాలను తయారుచేసి ముద్రించింది. అక్షరాస్యతలో భాగంగా అప్పట్లో వీరు తయారు చేసిన జన వాచకం ఎంతో ప్రాచుర్యం పొందింది. తర్వాత 1988లో ఎస్.ఆర్.సి ఆంధ్ర మహిళా సభకు చేరి రాత్రి బడుల ద్వారా వయోజన విద్యా కార్యక్రమాలను నిర్వహించింది. 1980లో రైతులకోసం తయారు చేసిన వాచకంలో 'వేసిన పంట వెయ్యకు, భూమిని పాడు చెయ్యకు' అనే పాఠం లక్షల మంది రైతులకు పంటల విషయంలో మార్గ నిర్దేశం చేసింది. రైతులకు కేవలం అక్షరాలు నేర్పడమే కాదు సాగు విషయంలో కూడా మెళకువలను నేర్పిన చరిత్ర ఎస్.ఆర్.సి కి ఉన్నది.


1992లో ఎస్.ఆర్.సి తెలుగు నేల మీద విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. ఇది రూపొందించిన వయోజన వాచకంలోని 'ఐక మత్యం' అనే పాఠం లోని సీతమ్మ కథ ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించింది. ఆ పాఠం స్ఫూర్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు మద్యపానానికి వ్యతిరేకంగా రెండేళ్లు పోరాటం చేశారు. దాని ఫలితంగానే అప్పటి ప్రభుత్వాలు దిగి వచ్చి మద్యాన్ని నిషేధించాయి.


కేంద్ర ప్రభుత్వం పథకంలో వచ్చిన మార్పుల కారణంగా 2001 సంవత్సరం నుండి ఎస్.ఆర్.సి స్పేస్ ఆధ్వర్యంలోకి వచ్చింది. తర్వాత 2007 నుంచి హైదరాబాద్ సొసైటీ కింద రిజిస్టర్ స్వయం ప్రతిపత్తి గల సంస్థగా రూపొంది తన సేవలను మరింత ముమ్మరం చేసింది. యువజన అక్షరాస్యత రంగంలో అనితర సాధ్యంగా ఐదు జాతీయ అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించింది మన ఎస్.ఆర్.సి. అంతేకాకుండా వయోజనులు నేర్చుకున్న అక్షర నైపుణ్యాన్ని స్థిరపరచుకుని సామాజిక అవగాహన, జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడే 700 పైగా పుస్తకాలను ముద్రించి అన్ని గ్రామాల్లోని వయోజన విద్యా కేంద్రాలకు పంపిణీ చేసింది. ఆ విధంగా ప్రజల్లో అక్షర చైతన్యాన్ని నింపింది.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఎస్.ఆర్.సి కృషి ఎనలేనిది. వివక్షకు గురైన భాష, సంస్కృతి, పండుగలతో పాటు ఉద్యమ తీరుతెన్నులు, విస్మరణకు గురైన తెలంగాణ ప్రముఖులు, పర్యాటక ప్రాంతాలు, కళలతో పాటు ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల పథకాల పట్ల చిన్న చిన్న పుస్తకాలు, పోస్టర్లు, స్టిక్కర్లు ముద్రించి ప్రజలకు అవగాహన కల్పించింది. స్వచ్ఛ తెలంగాణ, హరితహారం, పౌర సేవలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పౌర హక్కులు, ఇంకా అనేక అంశాలపై పుస్తకాలను రూపొందించి ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఎంతోమంది తెలంగాణ రచయితలతో సరళమైన భాషలో యువజన వాచకాలను రాయించింది. ఇప్పుడున్న తెలంగాణ సాంస్కృతిక శాఖలో పని చేస్తున్న కళాకారుల్లో చాలామంది ఎస్.ఆర్.సి.తో అనుబంధం ఉన్నవారే.


ఎస్.ఆర్.సి తన కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్, పొదుపు సంఘాల లీడర్లు, యూత్ క్లబ్ సభ్యలు ఇలా ఎందరికో అక్షరాస్యత, నిరంతర విద్యా కార్యక్రమాలపై అవగాహన కల్పించింది. అంతేకాకుండా సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ స్థాయి నాయకులు, టీచర్లు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలకు అక్షరాస్యత, నిరంతర విద్యా కార్యక్రమాలపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. వ్యవసాయానికి సంబంధించి ఎరువుల అవగాహన, రైతులకు సంబంధించి పంటల అవగాహన, భూముల తీరుతెన్నులు, గ్రామాల్లో మరుగు దొడ్ల అవసరాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, పాండిచ్చేరి ప్రాంతాలలో నివసించే తెలుగువారికి కూడా సేవలను విస్తరించింది. దాదాపు మూడు లక్షల మందికి క్షేత్ర స్థాయిలో శిక్షణ అందించింది. జాతీయస్థాయిలో మొట్టమొదటి ఐ.పి.సి.ఎల్ వాచకాన్ని రూపొందించి దేశంలో అక్షరాస్యత కోసం గ్రేడ్ మెటీరియల్ రూపొందించింది. దేశంలోనే ప్రప్రథమంగా నిరంతర విద్యా కార్యక్రమాలపై మాడ్యూలును తయారు చేసిన ఘనత కూడా మన తెలంగాణ ఎస్.ఆర్.సి దే. మిషన్ భగీరథ, గ్రామ నీటి సరఫరా పారిశుద్ధ్యం గురించి జలధార శీర్షికతో ప్రచార గీతాల సంచికను కూడా రూపొందించింది.


అర్ధ శతాబ్దపు అక్షర యానంలో పల్లె పల్లెలో రాత్రి బడుల ద్వారా నాగలి పట్టిన రైతన్నలకు నాట్లేసే అక్కా చెల్లెళ్లకు నిరంతర విద్యతోపాటు వృత్తి నైపుణ్యాలను అందించి గ్రామ గ్రామాన అక్షర దీపం వెలిగించి పది సంవత్సరాలు ఉస్మానియా యునివర్సిటీతో కలిసి పనిచేసి, పదహారు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వ నిధులను అందుకున్న ఎస్.ఆర్.సి., ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్వహణ నుంచి తప్పుకోవడంతో మూడేండ్లుగా వెలవెలబోతున్నది. అందులో ఇప్పుడు అందుబాటులో విలువైన 50 వేల పుస్తకాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల కలలు సాకారమవుతున్నాయి. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చి సాగు భూముల విస్తీర్ణం పెరిగింది. రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న పంట మార్పిడికి సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్.ఆర్.సి.లో చాలా మెటీరియల్ అందుబాటులో ఉంది. పైగా ఎస్.ఆర్.సి.కి తెలంగాణలో జిల్లా స్థాయి నుంచి మొదలు గ్రామ స్థాయి వరకు కార్యకర్తలున్నారు. కాబట్టి రైతులకు పంటమార్పిడి మీద, ప్రజలకు పథకాల మీద అవగాహన కల్పించడం చాలా తేలిక. బహుళ ప్రయోజనాలున్న ఈ ఎస్.ఆర్.సి.లను దేశంలోని చాలా రాష్ట్రాలు పునరుద్ధరించుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎస్.ఆర్.సి.ని పునరుద్ధరిస్తే స్వరాష్ట్ర కలలు మరింతగా సాకారమయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.

పెద్దింటి అశోక్ కుమార్

Updated Date - 2021-12-29T09:12:13+05:30 IST