ఎంత పని చేశావు తల్లీ..!

ABN , First Publish Date - 2021-04-13T06:29:51+05:30 IST

జన్మనిచ్చిన అమ్మే కన్న పేగును తెంపుకుంది..

ఎంత పని చేశావు తల్లీ..!

వేధింపులే కారణమా?

కన్నబిడ్డలతో మృత్యుఒడికి తల్లి 

ఉగాది వేళ నున్నలో విషాదం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): జన్మనిచ్చిన అమ్మే కన్న పేగును తెంపుకుంది. కష్టం వస్తే కడుపులో పెట్టుకోవలసిన తల్లే కష్టాలను తాళలేక ఇద్దరు చిన్నారులతో కలిసి మృత్యుఒడికి చేరింది. ఒడిలోని పిల్లలకు విషం కలిపిన పాలను ఇచ్చి, తానూ తీసుకుని, మృత్యువును ఆశ్రయించింది. భర్త వేధింపులే ఇందుకు కారణమని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసుకుని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


పెళ్లినాడు అత్తింటివారు ఇస్తామన్న అర ఎకరం పొలం కోసం భర్త పెట్టిన వేధింపులు మూడు ప్రాణాలను బలిగొన్నాయి. విజయవాడ రూరల్‌ మండలం నున్నలో ఒకవైపు ఉగాది పండుగ ఏర్పాట్లలో అందరూ నిమగ్నమై ఉండగా, ఓ తల్లి జన్మనిచ్చిన పిల్లలను తన చేతులతో చంపుకుని, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నారులతో కలసి ఒంగవోలు వాణి అనే గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలచివేస్తోంది. విజయవాడ రూరల్‌ మండలం నున్నకు చెందిన ఒంగవోలు వాణి (26), తన ఇద్దరు చిన్నారులు భావన (3), అక్షయ (10 నెలలు)లకు విషం కలిపిన పాలను ఇచ్చి, తను ఆత్మహత్య చేసుకున్న ఘటన నున్నలో విషాద చాయలు అలముకున్నాయి. ఆదివారం ఉదయమే ఆటో కిరాయికి వెళ్లిన మృతురాలి భర్త సురేంద్ర మధ్యలో రెండుసార్లు ఇంటికి వెళ్లాడని చెబుతున్నారు. మధ్యాహ్నం అందరూ కలసే భోజనం చేశారని, ఆ తర్వాత సురేంద్ర మళ్లీ కిరాయికి వెళ్లాడని చెబుతున్నారు. ఆ సమయంలో ఏమి జరిగిందో తెలియదుగానీ, పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్యకు పాల్పడిందనే సమాచారంతో సురేంద్ర ఇంటికి చేరుకున్నాడు.


అప్పటికే పిల్లలు వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోవడంతో స్థానికుల సహకారంతో పిల్లలను, భార్యను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసికెళ్లాడు. పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాడు. చిన్నారులను మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించగా, మార్గమధ్యంలో ఒకరు, ఆసుపత్రికి వెళ్లాక మరొకరు మృతి చెందారు. విజయవాడలో చికిత్స పొందుతున్న వాణి సోమవారం మధ్యాహ్నం కన్నుమూసింది. ఈ విషయం తెలియడంతో వాణి తల్లిదండ్రులు హుటాహుటిన నున్న చేరుకున్నారు. 


పొలం కోసం వేధింపులు!

గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వాణితో సురేంద్రకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఆ సమయంలో కట్నంగా అర ఎకరం పొలం ఇస్తామని వాణి తల్లిదండ్రులు మాటిచ్చారు. ఆ భూమి కోసం సురేంద్ర కొద్దిరోజులుగా తమ కుమార్తెను వేధిస్తున్నాడని వాణి తల్లి లక్ష్మి నున్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నున్న రూరల్‌ సీఐ హనీష్‌బాబు నేతృత్యంలో పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, సురేంద్రను అదుపులోకి తీసుకుని, అతని కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. 

Updated Date - 2021-04-13T06:29:51+05:30 IST