ఉద్యమమే శరణ్యం

ABN , First Publish Date - 2022-01-23T05:20:49+05:30 IST

ప్రభుత్వం తక్షణమే దిగిరాకపోతే ఉద్యమమే శరణ్యమని, తమ సమస్యల పరిష్కారానికి స్పందించకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌, కన్వీనర్‌ బి.సాయికృష్ణ స్పష్టం చేశారు. కడప నగరంలోని విష్ణుప్రియ కళ్యాణ మండపంలో శనివారం

ఉద్యమమే శరణ్యం
సంఘీభావం తెలుపుతున్న ఏపీ రాష్ట్ర విద్యుత్‌ జేఏసీ నేతలు

ప్రభుత్వం దిగిరాకపోతే ఏ క్షణమైనా మెరుపు సమ్మె 

విద్యుత్‌ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి

ట్రాన్స్‌కోకు ప్రత్యేక సీఎండీ ఉండాలి

హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తూ ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలి

ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యుత్‌ జేఏసీ నేతలు

కడప(క్రైం), జనవరి 22 : ప్రభుత్వం తక్షణమే దిగిరాకపోతే ఉద్యమమే శరణ్యమని, తమ సమస్యల పరిష్కారానికి స్పందించకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌, కన్వీనర్‌ బి.సాయికృష్ణ స్పష్టం చేశారు. కడప నగరంలోని విష్ణుప్రియ కళ్యాణ మండపంలో శనివారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ ఐక్యవేదిక, విద్యుత్‌ ఉద్యోగుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపై డిసెంబర్‌ 22న చర్చల్లో చేసుకున్న ఒప్పందం మేరకు తక్షణం పరిష్కరించాలని అన్నారు. రెండేళ్లు కరోనా ఉందని తమ సమస్యలు పరిష్కరించక పోయినప్పటికీ విధులు నిర్వహించామే తప్ప తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని గుర్తుచేశారు. కృష్ణపట్నం థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలు వెంటనే విడుదల చేయాలని అన్నారు. అక్టోబర్‌ 2 నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న జేఎల్‌ఐ గ్రేడ్‌-2లను రెగ్యులర్‌ చేసి, న్యాయమైన 13 సమస్యలపై విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులతో చర్చలు జరిపి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 32 మందిపై బనాయించిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ట్రాన్స్‌కో సీఎండీ, సెక్రటరీగా రెండు విధులు నిర్వహించడం సరికాదన్నారు. ట్రాన్స్‌కోకు ప్రత్యేకంగా సీఎండీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయం సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డిల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి సరైన స్పందన లేదన్నారు. ప్రభుత్వ చర్యలతో ఉద్యోగుల్లో అభద్రత పెరుగుతోందని, సర్వీసు రెగ్యులేషన్‌ మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. దీనిపై మంత్రులకు అపీల్‌ చేసి నెల రోజులు అవుతున్నా ఎలాంటి స్పందన లేదన్నారు. పవర్‌ప్లాంట్స్‌ ఆర్టీపీపీ, ఎన్టీపీపీ ప్రభుత్వం ఆధీనంలో ఉండాలంటూ అప్పుడు తాము అండగా నిలిచామన్నారు. ఇప్పుడు కృష్ణపట్నం ఽథర్మల్‌ స్టేషన్‌ను లీజ్‌కు ఇవ్వడం మంచిపద్ధతి కాదన్నారు. దీంతో జెన్‌కో ఉద్యోగులు 5 వేల మంది రోడ్డుపాలవుతారని, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు తమ ఉద్యోగ నాయకులతో చర్చించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సంస్థలను లాభాల బాటలో నడిపించి తక్కువ ధరకు ఇచ్చేలా కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. విద్యుత్‌ ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి ప్రతా్‌పరెడ్డి, కోచైర్మన్‌ ఎస్వీకేవీ శేషారెడ్డి, శ్రీనివాసకుమార్‌, కోకన్వీనర్‌ సాంబశివరావు, అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరి ఎస్‌.ప్రతాప్‌, వైస్‌ చైర్మన్‌ బి.సూరిబాబు, జేఏసీ మీడియా కోఆర్డినేటర్‌ నాగమునిస్వామి, జిల్లాలోని విద్యుత్‌ ఉద్యోగ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:20:49+05:30 IST