సినిమా పెద్దన్న సిద్ధంగా ఉన్నాడు!

Jun 21 2021 @ 01:32AM

జూలై నుంచి థియేటర్లలో సందడి చేయనున్న హాలీవుడ్‌ చిత్రాలు...

ప్రపంచ సినిమాకు పెద్దన్న... హాలీవుడ్‌! భారతీయ మార్కెట్‌ మీద చాలా రోజుల క్రితమే కన్నేశాడు. ప్రాంతీయ భాషల్లోనూ తన చిత్రాలను అనువదించి విడుదల చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇండియాలో పెద్దన్న మార్కెట్‌కు పెద్ద సమస్యే వచ్చి పడింది. అమెరికాలో చిత్రాలు విడుదల చేయడానికి సిద్ధమైన పెద్దన్న... ‘ఇండియాలో ఎలా?’ అని ఇన్నాళ్లూ ఆలోచించాడు. కరోనా రెండో దశ కేసులు తగ్గుతుండటంతో సినిమాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాబోయే రెండు మూడు నెలల్లో సుమారు పది హాలీవుడ్‌ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.


తెలంగాణలో థియేటర్లలో ప్రదర్శనలకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. ఏపీలో పగటిపూట ప్రదర్శనలు వేసుకోవచ్చు. మహారాష్ట్రలోపాక్షికంగా థియేటర్లు తెరచుకున్నాయి. భారతీయ సినీ రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఇంకా థియేటర్లకు మోక్షం లభించలేదు. అక్కడ త్వరలో అనుమతులు రావొచ్చని ఆశిస్తున్నారు. ఈలోపు హాలీవుడ్‌ చిత్రాలు థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. 


వీలైతే జూలై 2న, లేదంటే జూలై 9న ఇండియాలో ‘ద కాన్‌జురింగ్‌: ద డెవిల్‌ మేడ్‌ మి డూ ఇట్‌’ను విడుదల చేయాలని వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ ఆలోచన. ఇదొక్కటే కాదు... జూలై 16న ‘ద స్పేస్‌ జామ్‌: న్యూ లెగసీ’, ఆగస్టు 6న ‘ద సూసైడ్‌ స్క్వాడ్‌’ను... తర్వాత ‘మోర్టల్‌ కాంబాట్‌’ను మళ్లీ విడుదల చేయాలనుకుంటోంది. ఆల్రెడీ అమెరికాలో హారర్‌ చిత్రం ‘కాన్‌జురింగ్‌-3’ విడుదలైంది. ‘స్పేస్‌ జామ్‌’, ‘సూసైడ్‌ స్క్వాడ్‌’ విడుదల కాలేదు. అమెరికాతో పాటు ఇండియాలో ఒకే రోజు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అదీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్‌ అయితేనే! ఎందుకంటే... ‘మోర్టల్‌ కాంబాట్‌’ను దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో విడుదల చేశారు. అప్పుడు ఉత్తరాదిలో విడుదల చేయలేకపోయారు. అటువంటి పరిస్థితి ఈసారి తలెత్తకుండా చూసుకోవాలనుకుంటున్నారు. అమెరికాలో మే నెలాఖరున  హారర్‌ చిత్రం ‘ద క్వైట్‌ ప్లేస్‌-2’. విడుదలైంది.  ఇప్పుడు దీనిని ఇండియాలో విడుదల చేయాలనుకుంటున్నారు.


‘ద కాన్‌జురింగ్‌’, ‘ద క్వైట్‌ ప్లేస్‌-2’కు భారీ సంఖ్యలో థియేటర్లు అవసరం లేదు. హాలీవుడ్‌ హారర్‌ చిత్రాలకు మల్టీప్లెక్స్‌ ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తుంటుంది. అందుకని, సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లు లేకపోయినా... వివిధ భారతీయ భాషల్లో అనువదించి మల్టీప్లెక్స్‌లలో విడుదల చేయాలనుకుంటున్నారట. భారీ యాక్షన్‌ చిత్రాలు మాత్రం సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్ల కోసం వేచి చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన ‘బ్లాక్‌ విడో’ జూలై 9న అమెరికాలో విడుదల కానుంది. హిందీ సహా దక్షిణాది భాషలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో అనువదించారు. ఇండియాలో ఇంగ్లి్‌షతో పాటు ఈ భాషల్లో విడుదల చేయాలనేది ప్లాన్‌. వీలైతే జూలై 9న లేదంటే ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సిరీ్‌సలో తొమ్మిదో సినిమా ‘ఎఫ్‌-9’ను అమెరికాలో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఇండియాలో భారీ ఎత్తున విడుదల చేయాలని పరిస్థితులను యూనివర్సల్‌ పిక్చర్స్‌ సంస్థ నిశితంగా గమనిస్తోంది. ఈ చిత్రాన్నీ ఐదు భాషల్లో అనువదించారు. జూలై, ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘ద బాస్‌ బేబీ2: ఫ్యామిలీ బిజినెస్‌’, ‘ఓల్డ్‌’, ‘నోబడీ’, ‘ద క్రూడ్స్‌: న్యూ ఏజ్‌’ చిత్రాలనూ ఇండియాలో విడుదల చేయడానికి యూనివర్సల్‌ పిక్చర్స్‌ సిద్ధంగా ఉంది. ‘వెనమ్‌’ను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. దీన్ని తెలుగు, తమిళంలో అనువదించారు. భారత సంతతి నటుడు దేవ్‌ పటేల్‌ నటించిన ‘ద గ్రీన్‌ నైట్‌’ను జూలై 30న అమెరికాతో సహా ఇండియాలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ జాబితాలో మరికొన్ని చిత్రాలున్నాయి. థియేటర్లు ఓపెన్‌ అవ్వడమే సినిమాలతో దిగడానికి పెద్దన్న సిద్ధంగా ఉన్నాడు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.