‘ముస్లిం’ కోణం చరిత్ర వక్రీకరణే!

ABN , First Publish Date - 2022-09-15T10:26:53+05:30 IST

సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీకి ఇన్నేళ్ళకు గుర్తుకు రావడం ఆశ్చర్యకరం. నిజంగానే ఆసక్తి ఉండి ఉంటే అధికారంలోకి వచ్చిన సంవత్సరమే మొదలు...

‘ముస్లిం’ కోణం చరిత్ర వక్రీకరణే!

సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీకి ఇన్నేళ్ళకు గుర్తుకు రావడం ఆశ్చర్యకరం. నిజంగానే ఆసక్తి ఉండి ఉంటే అధికారంలోకి వచ్చిన సంవత్సరమే మొదలు పెట్టాల్సింది కదా? ఎనిమిదేళ్ళు ఆగాల్సిన అవసరం ఏమిటి? అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుందనేది అనేక సందర్భాల్లో రుజువైంది. ఈసారి తెలంగాణ సాయుధ పోరాటాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని తలపెట్టింది. హైదరాబాద్‌ సంస్థానం విలీన సమయాన ముస్లిం అయిన నిజాం రాజు పాలకుడుగా ఉన్నాడు కాబట్టి ‘ముస్లిమ్‌ పాలన’ నుంచి విమోచన అన్న అర్థంలో బిజెపి దీన్ని హిందూ ముస్లిమ్‌ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. చరిత్ర వక్రీకరణ కూడా!


ఆనాడు ముస్లిం రాజు పాలకుడుగా ఉండడం అనేది కేవలం యాదృచ్చికమే. ఆ మాటకొస్తే, నిజాంకు వ్యతిరేకంగా అనేక మంది ముస్లింలు పోరాడారు. మఖ్దూం మొహియుద్దీన్‌, షోయబుల్లా ఖాన్‌, షేక్‌ బందగీ లాంటి వాళ్ల వీరోచిత పాత్రను మనం విస్మరించగలమా? వాళ్లు ముస్లింలు కారా? అంతేకాదు, అనేక మంది దేశ్‌ముఖ్‌లు నిజాంకు మద్దతుగా నిలిచారు. నిజాం నజరానాలకు ఆశపడి ‘జీ హుజూర్‌’ అన్నారు. మరి వాళ్ళు హిందువులు కాదా? అందుకనే దీన్ని మత కోణంలో చూడడం సరికాదు. అలా అని, నిజాం కూడా మచ్చలేనివాడు, సుద్దపూస అనీ ఎవరూ అనడం లేదు. కానీ అతని పాలన మొత్తాన్నీ రాక్షస పాలనగా చిత్రీకరించే ప్రయత్నం ఖచ్చితంగా దుర్మార్గమే. రజాకార్ల పేరుతో చివరి రోజుల్లో జరిగిన అరాచకాలకు నిజాం ఎంత బాధ్యుడో, అంతకంటే అనేక రెట్లు దేశ్‌ముఖ్‌లు, దొరలు, పటేళ్ళే ఎక్కువ బాధ్యులు. వాస్తవానికి నిజాం రాజులెప్పుడూ స్వతంత్ర పాలకులుగా ఉండలేదు. వారు బయటి నుంచి వచ్చిన వలస పాలకులు కూడా కాదు. అందుకని ‘పరాయి పాలన’ అన్న పదానికి కూడా అవకాశం లేదు. సువిశాల భారతదేశంలోని ఇతర ప్రాతాల పాలకుల లానే వారూ ఒక ప్రాంతానికి పాలకులు. మొగల్‌ సామ్రాజ్య కాలంలో నిజాం పాలకులు వారి సూబేదార్లు (గవర్నర్లు)గా ఉండేవారు. మొగల్‌ చక్రవర్తే వారిని నియమించేవాడు. బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత, మొగల్‌ సామ్రాజ్యం పతనం కావడంతో, నిజాం రాజులు బ్రిటిష్‌ వారి అధీనంలోకి వెళ్ళిపోయారు. అలా 1947 వరకూ బ్రిటిష్‌ రాణికి విధేయులుగానే ఉన్నారు.


1948లో భారత ప్రభుత్వానికి, నిజాంకు మధ్య జరిగిన ఒప్పందం ద్వారా హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనానికి సంబంధించిన రాజకీయ ప్రక్రియ ఆరంభమైంది. రజాకార్లు అందుకు అవరోధాలు కల్పిస్తూ, విలీన ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీస్‌ యాక్షన్‌ ద్వారా రజాకార్ల తిరుగుబాటును అణిచి వేశారు. ఆ తరువాత 1948 సెప్టెంబర్‌ 10న నిజామ్‌ నవాబు స్వచ్ఛందంగా ఇండియన్‌ యూనియన్‌లో విలీనానికి సంసిద్ధత తెలియజేశాడు. సికింద్రాబాద్‌ మిలటరీ కంటోన్మెంటును స్వాధీనం చేసుకోడానికి స్వయంగా భారత సైన్యాన్ని ఆహ్వానించడం గమనిస్తే, భారత ప్రభుత్వం నుంచి నిజాం నవాబు పోలీసు సహాయం అర్థించాడని అర్థమవుతుంది. ఆ క్రమంలోనే 1948 సెప్టెంబర్‌ 17న భారత సైన్యాలు సికింద్రాబాద్‌ కంటోన్మెంటును ఆక్రమించుకున్నాయి. 1947లో దేశంలోని వివిధ సంస్థానాలు ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైనట్లుగానే, హైద్రాబాద్‌ సంస్థానం కూడా ఆ ప్రక్రియలో భాగంగా విలీనం కావలసి ఉంది కాని 1947 నుంచి 1948 సెప్టెంబర్‌ వరకు హైదరాబాదులో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా హైదరాబాద్‌ విలీనం సాధ్యం కాలేదు. కేవలం పది నెలల పాటు మాత్రమే కొనసాగిన ఈ రాజకీయ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌ విలీనాన్ని స్వాతంత్య్ర సమరంగానో, విమోచన పోరాటంగానో చూడడం ఎంతమాత్రం సరికాదు. ఎందుకంటే, నిజాం సైన్యాలు భారత సైన్యాలను ఎదిరించడంగాని, పోరాడడం కాని చేయలేదు. భారత సైన్యానికి వ్యతిరేకంగా నిజాం సైన్యం ఒక్కతూటా కూడా పేల్చిన దాఖలా లేదు. నిజాం స్వచ్ఛందంగానే తన సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేశాడు. అందుకని మిగిలిన సంస్థానాలను విలీనం చేసిన రాజులు, నవాబులు ఎంతో నిజాం నవాబు కూడా అంతే. ఈ కారణంగానే ఆయా రాజులు, నవాబుల మాదిరిగానే, నిజాం నవాబును కూడా హైదరాబాద్‌ రాజ్‌ప్రముఖ్‌గా నియమించారు. నిజాంకు, భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నిజాం రాజుకు సంవత్సరానికి 50 లక్షల రూపాయల భరణం చెల్లించే విధంగా నిర్ణయం జరిగింది. 1950 జనవరి 26వరకు ప్రభుత్వాధినేతగా హైదరాబాద్‌ రాజ్య పాలన నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పేరుమీదనే కొనసాగింది. ఆయనే ఫర్మానాలు జారీ చేసేవాడు. 1956 అక్టోబరు 31 వరకూ రాజ్‌ప్రముఖ్‌గా కూడా నిజాం రాజే కొనసాగాడు. ఒకవేళ నిజాం రాజ్యాన్ని, ఆయన సంస్థాన సైన్యాన్ని ఎదిరించి, పోరాడి గనక స్వాధీనం చేసుకుని ఉన్నట్లయితే, ఆయనకంతటి రాజమర్యాదలు దక్కేవా? నిజాం నవాబు స్వచ్ఛందంగానే ఇండియన్‌ యూనియన్‌లో విలీనమయ్యాడు కనుక 1947 సెప్టెంబర్‌ 17న నిజాం నుంచి హైద్రాబాదుకు విమోచన లభించిందన్న వాదన సత్యదూరం మాత్రమేకాదు, వక్రభాష్యం కూడా. అందుకని సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర సర్కార్‌ నిర్ణయించినట్లు జాతీయ సమైక్యతా దినోత్సవంగానో, విలీన దినోత్సవంగానో, లేక హైదరాబాద్‌ రాజ్యం భారత ప్రభుత్వ పాలన కిందికి వచ్చిన రోజుగానో చూడడమే సమంజసం.

యండి.ఉస్మాన్‌ ఖాన్‌

Updated Date - 2022-09-15T10:26:53+05:30 IST