ఆలయాల మర్మమిది

ABN , First Publish Date - 2021-04-09T05:30:00+05:30 IST

పూర్వ కాలంలో ఆలయాల ధ్యేయం ఎవరినీ ఆకర్షించడం కాదు. కాలక్రమేణా మానవుడి ఆసక్తి మారిపోయింది. చివర్లో లభించే ముక్తి కన్నా...

ఆలయాల మర్మమిది

పూర్వ కాలంలో ఆలయాల ధ్యేయం  ఎవరినీ ఆకర్షించడం కాదు. కాలక్రమేణా మానవుడి ఆసక్తి మారిపోయింది. చివర్లో లభించే ముక్తి కన్నా... వెంటనే కావలసినవి ముఖ్యంగా తోచాయి. ఆ అవసరాలకు తగినట్టు శక్తులను ప్రసాదించే రూపాలను సృష్టించడం ప్రారంభించారు. 


ఆకాశాన్ని చూస్తే అది ఎంతో విశాలమైనదిగా కనిపిస్తుంది. కానీ ఆకాశంలో మనల్ని ఆకర్షించేవి ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మిగతా గ్రహాలు. అంతేకానీ, అనంతంగా వ్యాపించి ఉన్న శూన్యం మనల్ని ఆకర్షిస్తుందా? అసలు ఆ శూన్యం ఉన్నట్టు మనకు తెలుస్తుందా? అయితే రూపం లేని ఆ శూన్యంలో ఆనందాన్ని ఇచ్చే అనుభవం ఒకటి ఉంది. ఆ అనుభవాన్ని తెలుసుకోవడానికే గుడులూ, గోపురాల ఏర్పాటు జరిగింది. మనం ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేవి మన పంచేద్రియాలు... అంటే కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. కానీ శూన్యాన్ని తెలుసుకోవడానికి అవి సరిపోవు. పంచేంద్రియాలతో విశ్వాన్ని అర్థం చేసుకోవడం ఎలాంటిదంటే...


ఒక జెన్‌ గురువు దగ్గరకు ఒక కోతి వచ్చింది. తనను శిష్యునిగా స్వీకరించాలని కోరింది. ‘‘వేరే వాళ్ళకు లేని సామర్థ్యం ఒకటి నా దగ్గర ఉంది. ఒక్క గెంతులో వంద చెట్లను దాటేస్తాను’’ అంది. ఆ కోతికి గురువు ఒక కత్తి ఇచ్చాడు. ‘‘ఈ రోజు వెళ్ళగలిగినంత దూరం వెళ్ళు. అక్కడ ఈ కత్తితో ఒక గుర్తు పెట్టి, తిరిగి రా! ఆ తరువాత నా అభిప్రాయం చెబుతాను’’ అన్నాడు. ఇది చాలా తేలికైన పందెం అనుకుంది కోతి. మామూలుకన్నా ఎక్కువ వేగంతో పరుగెత్తింది. అలసట వచ్చాక, ఒక చోట ఆగింది. ఒక చెట్టు మీద కత్తితో గుర్తు పెట్టి తిరిగి వచ్చింది. ‘‘ఆ చెట్టును చూడాలంటే మీరు కొన్ని నెలలు ప్రయాణించాల్సి ఉంటుంది’’ అని గురువుతో అంది. గురువు మందహాసం చేసి, తాను కూర్చున్న చెక్క పలకను చూపించాడు. దాని మీద కోతి చెక్కిన గుర్తు కనిపించింది. ఈ విశ్వం అనే బ్రహ్మాండంలో మానవుడి ప్రయాణం కూడా అంతే! దాన్ని మించిన పయనం కోసం నిర్మితమైనవే ఆలయాలు. 


తేలికగా చెప్పాలంటే, ఏమీ లేని శూన్యం మీద విశాలమైన ఒక తివాచీ పరచి ఉందనుకుంటే... మీరు ఆ తివాచీ మీద ఉన్నారనుకోవచ్చు. ప్రత్యక్ష అనుభవం ఉన్నవారు శక్తిభరితమైన స్థితిలో... శాస్త్రీయంగా ఆ తివాచీ మీద ఏర్పరచిన రంధ్రాలే ఈ కోవెలలు. ఆ రంధ్రాల ద్వారా ఆవల ఉన్న శూన్యాన్ని, పరిమితి లేని శూన్యాన్ని అనుభూతి చెందగలరు. ఆ అంతుచిక్కని శూన్యాన్నే ‘శివ’ అంటాం. నిరాకారమైన శూన్యం ఒక రూపాన్ని సంతరించుకున్నప్పుడు మొదట ఏర్పడే రూపమే లింగం. మనం దేని నుంచి ఉద్భవించామో... ఆ శూన్యతత్త్వమైన శివంతో ఏకమైపోవడానికే మొదట్లో ఆలయాల నిర్మాణం ప్రారంభమయింది. అలా నిర్మితమైన వేలాది ఆలయాలు ఎలాంటి అట్టహాసాలూ లేకుండా... కేవలం లింగాలతోనే ఉండేవి. ఎవరినీ ఆకర్షించడం వాటి ధ్యేయం కాదు. కాలక్రమేణా మానవుడి ఆసక్తి మారిపోయింది. చివర్లో లభించే ముక్తి కన్నా... వెంటనే కావలసినవి ముఖ్యంగా తోచాయి. ఆ అవసరాలకు తగినట్టు శక్తులను ప్రసాదించే రూపాలను సృష్టించడం ప్రారంభించారు. మహా యోగులు నిర్మించిన శక్తిమంతమైన గొప్ప ఆలయాలెన్నో మన దేశంలో ఆదరణ లేక పాడైపోయాయి. వాటి శక్తిని మనం తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. 


ఈ రోజుల్లో ఆలయాలకు వెళ్ళేవారిలో చాలామంది వాటిలోని శక్తికి ఆకర్షితులై కాదు.. భయంతోనో, ఆశతోనో వెళుతున్నారు. అసలు ‘గుడి’ స్థాపన వెనుక ఉన్న విజ్ఞానం వేరు! ఆలయాలకు సంబంధించిన విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్న మానవుడు శక్తికి ఒక దైవం, ధనానికి ఒక దైవం, చదువుకు ఒక దైవం, కాపాడి రక్షించేందుకు ఒక దైవం అంటూ ఎన్నో రకాల దేవుళ్ళ కోసం ఎన్నో ఆలయాలు నిర్మించాడు. కాని ఈ రోజు ఆలయాలకు వెళ్ళే అధికశాతం ప్రజలకు అక్కడ నిక్షిప్తమై ఉన్న శక్తిని గ్రహించే స్థాయి లేదు కనుక,  వారు ఆ శక్తిని అనుభూతి చెందలేకపోతున్నారు. ‘శక్తిమంతమైన గుడి ఏది? ఏది మామూలు కట్టడం?’ అనే భేదం తెలుసుకోలేక పోతున్నారు. తమను ఉద్వేగపరచే ఆలయాలు కావాలనుకుంటున్నారు. కోరికలు తీర్చే స్థలంగా ఏ కోవెల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోందో అవి ప్రసిద్ధి చెందుతున్నాయి. ప్రసిద్ధి చెందినంత మాత్రాన, ఒక కోవెల శక్తిమంతమైనదని చెప్పలేం. సృష్టిలో కనిపించేవన్నీ శూన్యంలో విస్ఫోటం జరిగి, దానిలోంచి పొంగి పొరలి వచ్చినవేనని  వైజ్ఞానిక పరిశోధనలు నిరూపించాయి. శూన్యం నుండి పుట్టినవన్నీ తిరిగి ఆ శూన్యంలో కరిగిపోతాయనే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి స్థాపితమైనవే నిజమైన ఆలయాలు.

సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2021-04-09T05:30:00+05:30 IST