కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు సముచితం

ABN , First Publish Date - 2022-05-29T06:29:08+05:30 IST

కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడం సముచితమని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు ఆచార్యులు, మేధావులు పేర్కొన్నారు.

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు సముచితం
సంఘీభావం తెలుపుతున్న ఆచార్యులు, మేధావులు

మేధావుల చర్చాగోష్ఠిలో పలువురు ప్రముఖులు 

ఏయూ క్యాంపస్‌, మే 28: కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడం సముచితమని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు ఆచార్యులు, మేధావులు పేర్కొన్నారు. శనివారం ఏయూలోని టీఎల్‌ఎన్‌ సభా మందిరం వేదికగా కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడం అన్ని వర్గాలకు హర్షదాయకం, ఆమోదయోగ్యం అనే అంశంపై మేధావుల చర్చాగోష్ఠి నిర్వహించారు.  ఈ సందర్భంగా ఏయూ జర్నలిజం విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ చల్లా రామకృష్ణ మాట్లాడుతూ ప్రతీ భారతీయుడి గౌరవం డాక్టర్‌ అంబేడ్కర్‌ అని, అటువంటి ప్రపంచ మేధావికి ఎంత చేసినా తక్కువేనన్నారు. ఏయూ పాలకమండలి సభ్యుడు ప్రొఫెసర్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ మాట్లాడుతూ జాతీయ నాయకులు సైతం ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలపై స్పందించాలని కోరారు. ఏయూ న్యాయ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.సూర్యప్రకాశరావు మాట్లాడతూ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అంబేడ్కర్‌ అని కొనియాడారు. విశ్రాంత ప్రిన్సిపాల్‌ కె.రామ్మూర్తి మాట్లాడుతూ అమలాపురం ఘటనను చూస్తే అంబేడ్కర్‌పై సమగ్ర అవగాహన లేనివారు, ప్రభుత్వ నిర్ణయానికి ఓర్వలేని వారు చేసిన చర్యలుగా పేర్కొన్నారు. అంతర్జాతీయ భాషల విభాగం డైరెక్టర్‌ ఆచార్య డీవీఆర్‌ మూర్తి మాట్లాడుతూ అంబేడ్కర్‌ను గౌరవించాడం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ విశ్వేశ్వరరావు, క్రీడా విభాగాధిపతి డాక్టర్‌ పల్లవి, క్రీడా విభాగం డైరెక్టర్‌ ఎన్‌.విజయమోహన్‌, రెక్టార్‌ సమత, ఆచార్యులు రాజేంద్ర కర్మార్కర్‌, శోభశ్రీ, ఎన్‌.సత్యనారాయణ, టి.షోరోన్‌రాజు, పాల్‌, ఉత్తరాంధ్ర కాపు సంఘం అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, జర్నలిస్టుల సంఘనాయకుడు గంట్ల శ్రీనుబాబు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-29T06:29:08+05:30 IST