సూది పొడవలేరు శాంపిల్‌ తీయలేరు!

ABN , First Publish Date - 2022-05-04T09:09:14+05:30 IST

రెండేళ్ల పాటు పారామెడికల్‌ శిక్షణ పొందిన తర్వాత కూడా బ్లడ్‌ శాంపిల్‌ తీయడం రాకపోతే ఎలా? అలాంటి వారికి ఉద్యోగం ఎలా ఇవ్వగలం..

సూది పొడవలేరు శాంపిల్‌ తీయలేరు!

  • స్థానిక ల్యాబ్‌ టెక్నీషియన్లకు నైపుణ్యాల లేమి.. 
  • పారా మెడికల్‌ కళాశాలల్లో అధ్వానంగా శిక్షణ

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల పాటు పారామెడికల్‌ శిక్షణ పొందిన తర్వాత కూడా బ్లడ్‌ శాంపిల్‌ తీయడం రాకపోతే ఎలా? అలాంటి వారికి ఉద్యోగం ఎలా ఇవ్వగలం..? ఇదీ ఓ డయాగ్నస్టిక్‌ కేంద్రం నిర్వాహకుడి ప్రశ్న. రాష్ట్రంలో ల్యాబ్‌ టెక్నీషియన్ల అవసరం భారీగా ఉన్నా.. అందుకు తగ్గట్టుగా శిక్షణ పొందిన వారు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నైపుణ్యాలు ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్లు(ఎల్టీలు) దొరక్క కార్పొరేట్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు పొరుగు రాష్ట్రాల వారిని నియమించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా ఆస్పత్రులు నర్సుల కొరతను ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు ఎల్టీలను కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి తెలంగాణలో ప్రభుత్వ రంగంలో 12, ప్రైవేటులో 240 పారామెడికల్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 18 రకాల కోర్సులు ఉండగా.. 15వేల పైచిలుకు సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. రాష్ట్రంలో ఏటా 3 వేల మంది ఎల్టీలు చదువు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నా.. వారికి తగిన నైపుణ్యాలు ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెజారిటీ పారామెడికల్‌ కాలేజీలు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా మారడం, కొత్త డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, ఆస్పత్రులు అధిక సంఖ్యలో ఏర్పాటు కావడం కూడా ఎల్టీల కొరతకు కారణమవుతోంది.


పొరుగు రాష్ట్రాల వారితో భాష సమస్య

రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్‌ ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు.. పొరుగు రాష్ట్రాల వారిని నియమించుకుంటున్నాయి. అయితే, వారికి తెలుగు రాకపోవడం, రోగులు చెప్పేది అర్థం కాకపోవడం సమస్యగా మారుతోంది. స్థానిక ఎల్టీలకు సగటున రూ.10 వేల జీతం ఇస్తున్న సంస్థలు... ఇతర రాష్ట్రాల వారికి రూ.18-25 వేల వరకు వేతనం చెల్లిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన ఎల్టీలను నియమించుకునేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సాధారణంగా పారామెడికల్‌ కోర్సులు పూర్తి చేసిన వారు.. సొంత రాష్ట్రంలోని పారామెడికల్‌ బోర్డులో సర్టిఫికెట్‌ రిజిష్ట్రేషన్‌ చేసుకోవాలి. వారికి పొరుగు రాష్ట్రంలో ఉద్యోగం వస్తే... అక్కడి పారామెడికల్‌ బోర్డు నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలి. ఆ ఎన్‌వోసీతో మళ్లీ ఆ రాష్ట్ర పారామెడికల్‌ బోర్డు వద్ద రిజిష్ట్రేషన్‌ చేయించుకోవాలి. అప్పుడే వారికి అక్కడ పని చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం చిన్నదే అయినా... పెద్ద తతంగం ఉండడంతో పొరుగు రాష్ట్రాల వారిని వెంటనే నియమించుకునే పరిస్థితి లేకుండా పోతోంది.


ఈ విషయంలో సాయం చేయాలని ఒక కార్పొరేట్‌ ల్యాబ్‌ యాజమాన్యం ఇటీవలే ప్రభుత్వాన్ని కోరింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ఎల్టీలకు రిజిష్ట్రేషన్‌ ప్రక్రియను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు భారీగా ఖాళీ ఉన్నాయి. సర్కారీ దవాఖానాల్లో మొత్తం కేడర్‌ స్ట్రెంత్‌ కింద 1,380 ఎల్టీ పోస్టులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 800 మందే పని చేస్తున్నారు.  2017లో 200 ఎల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినా.. కోర్టు కేసులతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. 


నాణ్యమైన సేవలు అందించే వారు దొరకట్లేదు

మా అవసరాలకు తగ్గట్టుగా, నాణ్యమైన సేవలందించే ఎల్టీలు దొరకడం లేదు. ప్రస్తుతం పని చేస్తున్న వారు తరచూ ఉద్యోగాలు మానేస్తున్నారు. మాకు అధిక సంఖ్యలో ఎల్టీలు అవసరమవుతున్నారు. అందుకే పొరుగు రాష్ట్రాల వారిని తీసుకుంటున్నాం.

-సుప్రీతా రెడ్డి, విజయా డయాగ్నస్టిక్‌ ఎండీ

Read more