కొత్త కరోనా

ABN , First Publish Date - 2020-12-23T06:13:56+05:30 IST

కరోనాపై పోరాటానికి సమస్త దేశాలూ వాక్సిన్‌తో సమాయత్తమవుతున్న తరుణంలో, బ్రిటన్‌లో అది ఒక కొత్త రూపాన్ని...

కొత్త కరోనా

కరోనాపై పోరాటానికి సమస్త దేశాలూ వాక్సిన్‌తో సమాయత్తమవుతున్న తరుణంలో, బ్రిటన్‌లో అది ఒక కొత్త రూపాన్ని సంతరించుకుని, విపరీతమైన వేగంతో వ్యాప్తి చెందుతూండటం కచ్చితంగా భయం కలిగించే అంశమే. ఆ దేశంలో కొవిడ్‌ కేసులు కొద్దిరోజుల్లోనే రెట్టింపు కావడం, వాటిలో దాదాపు 60శాతం ఈ కొత్తరకం స్ట్రెయిన్‌కు చెందినవని నిర్థారణ కావడంతో బ్రిటన్‌లోని అత్యధిక ప్రాంతాల్లో మళ్ళీ లాక్‌డౌన్‌ విధించవలసి వచ్చింది. పాత వైరస్‌ కంటే ఈ కొత్త రకానికి మరింత వేగంగా వ్యాప్తిచెందే లక్షణం ఉన్నందున అది బ్రిటన్‌కు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. ఇప్పటికే రెండోవిడత కరోనా విజృంభణ సాగుతున్న యూరప్‌లోని కొన్ని దేశాల్లో కూడా కొత్తరకం వైరస్‌ జాడలు కనిపించాయి. దక్షిణాఫ్రికాలోనూ వైరస్‌ కొత్తరూపాన్ని సంతరించుకుందనీ, బ్రిటన్‌తో సంబంధం లేకుండా ఇది అక్కడ జరిగిందనీ అంటున్నారు. 


భారత్‌తో పాటు పలుదేశాలు బ్రిటన్‌తో రాకపోకలు నిలిపివేశాయి. ఆ దేశం నుంచి మనదేశంలోకి ఇప్పటికే ప్రవేశించిన వారిని వేగంగా గుర్తించి పరీక్షించే ప్రక్రియ మొదలైంది. బ్రిటన్‌నుంచి వచ్చి చేరినవారిలో ఎంతమంది కొత్త స్ట్రెయిన్‌ను తీసుకువచ్చారో ఇదమిత్థంగా తెలియదు కానీ, వీరి విషయంలోనూ నిర్థారణ పరీక్షలు, క్వారంటైన్‌ ఇత్యాది విధానాల అమలుతో రోగవ్యాప్తిని నిరోధించవచ్చునని అధికారులు అంటున్నారు. ఇక ఎన్నో నెలలు శ్రమకోర్చి పరిశోధించి తయారుచేసిన వాక్సిన్లు ఈ కొత్తరకాన్ని నియత్రించగలవా అన్న అనుమానాలూ ఉన్నాయి. ప్రస్తుతం తయారవుతున్న వాక్సిన్లు పరివర్తన చెందిన వైరస్‌ను సైతం భేషుగ్గా తట్టుకుంటాయని నిపుణులు భరోసా ఇస్తుంటే, అవసరమనుకుంటే కొత్త వాక్సిన్‌ను సత్వరమే సిద్ధంచేయవచ్చునని మరికొందరు అంటున్నారు. దాదాపు పదినెలలుగా కరోనా కష్టాలు అనుభవిస్తున్న ప్రపంచ ప్రజానీకానికీ, నిపుణులకూ ఈ కొత్త స్ట్రెయిన్‌ ఒక సవాలు విసిరినమాట నిజం. కరోనా వ్యాపించిన కొత్తల్లో ఉన్న ఆందోళన, భయం ఎంతో కొంత స్థాయిలో ఇప్పుడూ కనిపిస్తున్నాయి. మళ్ళీ లాక్‌డౌన్‌లు, అర్థరాత్రి కర్ఫ్యూలు, రాకపోకల నిషేధాలతో భారత్‌ సహా వివిధ దేశాలు దీనిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాయి.


మనదేశంలో శనివారం నాటికి కరోనా బాధితుల సంఖ్య కోటి దాటింది. మిగతా ప్రపంచం మాట అటుంచితే, మనదేశానికి సంబంధించినంత వరకూ ఇటీవలి కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూండటం ఊరట కలిగించే అంశమే. ఈ స్థితిలో అతి వేగంగా వ్యాప్తిచెందే ఈ కొత్త స్ట్రెయిన్‌ దేశంలోకి ప్రవేశిస్తే బాధలు తప్పవు. బ్రిటన్‌లో అనేక వారాలు వ్యాపించిన తరువాత ఇప్పుడు ప్రయాణాలపై నిషేధాన్ని విధించడం ద్వారా ఈ కొత్త స్ట్రెయిన్‌ దేశంలోకి దిగుమతి కాకుండా ఆపగలగడం అసాధ్యం. అందువల్ల, ఇప్పటికే ఇక్కడ కాలూనినవారినీ, వారి బంధువులనూ సన్నిహితులనూ గుర్తించడం, వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేయడం, క్వారంటైన్‌లో ఉంచడం వంటి ప్రక్రియలను వేగంగా, విస్తృతంగా చేపట్టగలిగితే మనదేశంలో దాని వ్యాప్తి వేగాన్ని కొంతమేరకు అరికట్టవచ్చు. అలాగే, మొత్తంగా కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య ఇటీవల బాగా తగ్గించివేసిన ప్రభుత్వాలు కొత్త పరిణామాల నేపథ్యంలో వాటిని హెచ్చించడమూ అవసరమే. వరుస అన్‌లాక్‌లతో అన్ని గేట్లూ తెరిచి, ఆర్థిక కార్యకలాపాలకు తిరిగి జోరందించిన తరువాత, ప్రజలతో కరోనా జాగ్రత్తలు పాటించేట్టు చేయడంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నాయి. ఒకప్పుడు సామాన్యులను లాఠీలతో బాదినవారు ఇప్పుడు మాస్కులు ధరించకున్నా ప్రశ్నించడం లేదు. కరోనా ఎక్కడికీ పోలేదు కానీ, పాలకుల, ప్రజల వైఖరిలో మాత్రం అవాంఛనీయమైన మార్పు వచ్చింది. 


ఇప్పుడు కొత్త స్ట్రెయిన్‌ అసలు వైరస్‌ కంటే ప్రమాదకరమైనది కాకపోవచ్చు కానీ, దీని వ్యాప్తి వేగం చూసినప్పుడు కచ్చితంగా మరింత జాగ్రత్త పడవలసిందే. ప్రభుత్వాలు చేపట్టే నియంత్రణ చర్యలను అటుంచితే, ప్రజలు స్వచ్ఛందంగా కరోనా నియమాలను కఠినంగా పాటించడం అవసరం. వైరస్‌ కొత్త రూపాలు సంతరించుకుంటున్న తరుణంలో, ప్రభుత్వం తన వాక్సిన్‌ వ్యూహాన్ని తిరగరాసుకొని, మరింతమందికి దానిని అందించడమూ అవసరమే.

Updated Date - 2020-12-23T06:13:56+05:30 IST