కొత్త రెవెన్యూ చట్టం సాహసోపేతం

ABN , First Publish Date - 2020-09-23T06:38:15+05:30 IST

రైతు సమస్యలను దూరం చేయడానికి సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం సాహసోపేతమైన నిర్ణయమని

కొత్త రెవెన్యూ చట్టం సాహసోపేతం

 రైతుల కష్టాలను దూరం చేయడానికే కొత్త చట్టం

 ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి 

 70 ఏళ్ల పంచాయతీలకు కొత్త చట్టంతో చరమగీతం

 రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి

 మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో కృతజ్ఞతా ర్యాలీ 


మెదక్‌ మున్సిపాలిటీ, సెప్టెంబరు 22: రైతు సమస్యలను దూరం చేయడానికి సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం సాహసోపేతమైన నిర్ణయమని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి అన్నారు. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే  ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నూతన రెవెన్యూ చట్టానికి చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతగా మంగళవారం మెదక్‌ పట్టణంలో రైతులతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ చట్టంతో రైతులకు వారి హక్కులు వారికి అందుతాయని చెప్పారు. ఇకపై రెవెన్యూ సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ఏర్పడినా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో లోటు రానివ్వలేదని తెలిపారు.


రైతులు కోరుకునే విధంగా వారసత్వ హక్కులు కల్పించడమే ఈ చట్టం లక్ష్యమని పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా సాగునీటిని అందించబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల కోసం కొత్త చట్టాలను ఏర్పాటు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేట్‌కు దారదత్తం చేసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు రైతులు పూర్తి వ్యతిరేకమన్నారు. ఈ బిల్లుతో మద్దతు ధరను ప్రకటించే అవకాశం కూడా ఉండదన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ లావణ్యారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్లు తొడుపునూరి చంద్రపాల్‌, పల్లె జితేందర్‌గౌడ్‌, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌, కౌన్సిలర్లు, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌కె శ్రీనివాస్‌, బీమరి కిషోర్‌, జయరాజ్‌, మందుగుల గంగాధర్‌, శ్రీధర్‌యాదవ్‌, రాజేందర్‌రెడ్డి, యమిరెడ్డి, బయ్యన్న, అజయ్‌కుమార్‌గౌడ్‌, శ్రీనివా్‌సరెడ్డి, అంజాగౌడ్‌, శ్రీహరి, చెన్నాగౌడ్‌, సాప సాయిలు, జగన్‌ పాల్గొన్నారు. 


కార్పొరేట్‌ వ్యవసాయ విధానం వద్దు 

గజ్వేల్‌ : కార్పొరేట్‌ వ్యవసాయ విధానం వద్దని.. చిన్న, సన్నకారు వ్యవసాయ విధానమే ముద్దని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం ఆమోదం పొందటంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం ప్రజ్ఞాపూర్‌లోని హరితా రెస్టారెంట్‌ నుంచి గజ్వేల్‌ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తా వరకు ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, రైతులు, నాయకులు హాజరయ్యారు. గజ్వేల్‌ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా నూతన వ్యవసాయ విధానాన్ని సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చారన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే మ్యుటేషన్‌ అయి పాసుబుక్‌ వచ్చేలా నూతన ఆవిష్కరణలకు తెరతీశారని తెలిపారు. భూమి పుత్రుడిగా సీఎం కేసీఆర్‌ అహర్నిశలు రైతుల సంక్షేమం, రైతాంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌లకు కొమ్ము కాస్తూ నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొన్నప్పుడే రైతుకు లాభం జరుగుతుందన్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసాధ్యాలను సుసాధ్యం చేయగలరని, 13 ఏళ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించారని, 70 ఏళ్ల పొలం పంచాయతీలకు కొత్త రెవెన్యూ చట్టంతో చరమగీతం పాడారని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. 140 టీఎంసీల గోదావరి జలాలను 600 మీటర్ల ఎత్తుకు తీసుకువచ్చిన భగీరథుడన్నారు. కేసీఆర్‌ గంగ పుత్రుడని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులుగా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ వైపు దేశం మొత్తం చూస్తున్నదని, మన నాయకుడు ఢిల్లీకి వెళ్తే నదుల అనుసంధానం జరిగి ప్రతీ ఎకరాకు సాగునీరు అందుతుందని, ప్రతి రాష్ట్రానికి బుల్లెట్‌ ట్రైన్లు వస్తాయన్నారు. పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. ఈ అంతకుముందు తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీరవీందర్‌, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ వంగ నాగిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, మార్కెట్‌ చైర్మన్‌ అన్నపూర్ణ, ఎంపీపీలు అమరావతి, వసంత, జడ్పీటీసీలు పంగ మల్లేశం, బాలమల్లు, నాయకులు మాదాసు శ్రీనివా్‌సలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ జకీ, మెట్టయ్య, చందు, రవి, నాయకులు గుంటుకు రాజు, నాగులు, మథీన్‌, రామకృష్ణారెడ్డి, ఉమర్‌, నిజాం, రమేశ్‌, శ్రీనివా్‌సగుప్తా, చంద్రమోహాన్‌రెడ్డి, హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T06:38:15+05:30 IST