అప్పుడే పుట్టిన కంగారూ సైజు అంగుళమే!

ABN , First Publish Date - 2022-05-23T07:09:04+05:30 IST

కంగారూలు ఎక్కువగా ఆస్ట్రేలియాలోనే కనిపిస్తాయి. ప్రస్తుతం సుమారు 3 కోట్ల కంగారూలు ఆస్ట్రేలియాలో ఉన్నట్టు అంచనా.

అప్పుడే పుట్టిన  కంగారూ సైజు అంగుళమే!

కంగారూలు ఎక్కువగా ఆస్ట్రేలియాలోనే కనిపిస్తాయి. ప్రస్తుతం సుమారు 3 కోట్ల కంగారూలు ఆస్ట్రేలియాలో ఉన్నట్టు అంచనా. 

కంగారూలు శాకాహార జంతువులు. ఇవి రకరకాల మొక్కలను, గడ్డిని తింటాయి. చిన్న చిన్న గ్రూపులుగా నివసిస్తాయి. ఈ గ్రూపులను మాబ్స్‌ అని, ట్రూప్స్‌ అని పిలుస్తారు. అందులో పెద్దగా ఉన్న పురుష కంగారూ ఆ గ్రూప్‌కు లీడర్‌గా వ్యవహరిస్తుంటుంది. 

వీటి వెనక కాళ్లు  చాలా బలంగా ఉంటాయి. ముందు కాళ్లు చిన్నగా ఉంటాయి. పొడవైన తోక గెంతేటప్పుడు శరీర బరువును నియంత్రిస్తూ ఉంటుంది. 

ఆడ కంగారూలకు పొట్ట భాగంలో సంచి(పౌచ్‌) ఉంటుంది. బేబీ కంగారూలు ఈ పౌచ్‌లోనే పెరుగుతాయి. బేబీ కంగారూలను జోయ్స్‌ అని అంటారు. అప్పుడే పుట్టిన కంగారూ అంగుళం సైజు మాత్రమే ఉంటుంది. అంటే ఒక గ్రేప్‌ సైజులో ఉంటుందన్న మాట.

ఇవి వెనక్కి నడవలేవు. కంగారూలు ఈత కొట్టడాన్ని ఇష్టపడతాయి. కంగారూలు పంచ్‌ ఇవ్వడమే కాదు, కిక్‌ కూడా ఇస్తాయి. బాగా కోపం వస్తే కరుస్తాయి కూడా!

రాత్రివేళ యాక్టివ్‌గా ఉండి, పగటివేళ విశ్రాంతి తీసుకుంటాయి. కొన్నిరోజుల పాటు నీరు లేకున్నా బతికేయగలవు. తీసుకునే ఆహారంలో ఉండే నీటి శాతంతో సరిపెట్టుకుంటాయి. వేసవికాలంలో వేడిని తగ్గించుకోవడం కోసం ముంజేతులను నాకుతుంటాయి. 

Updated Date - 2022-05-23T07:09:04+05:30 IST