హనుమ జన్మభూమిపై సరికొత్త వివాదం

May 9 2021 @ 01:43AM

‘హనుమంతుడి జన్మస్థలం తిరుమల కొండలలోని అంజనాద్రే’ అంటూ ఒక పండిత బృందం పలు పౌరాణిక, వాఙ్మయ, శాసన, భౌగోళిక ప్రమాణాలకు సంబంధించిన ఆధారాలతో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో ప్రకటించింది. ఒక భక్తుడి వాట్స్యాప్ సందేశం ద్వారా తాము ఈ సంకల్పానికి పూనుకున్నామనీ, ఈ అంశంపై దాదాపు నాలుగునెలల పాటు ఒక కమిటీ లోతుగా పరిశోధించిందని తి.తి.దే. కార్యనిర్వహణాధికారి జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా సంక్షుభిత సమయంలో కూడా కేవలం ‘ఒక భక్తుడి విజ్ఞప్తి మేరకు’ ఇక్ష్వాకుల కాలం నాటి ఒక అంశాన్ని తిరగదోడటం వెనుక టిటిడి లక్ష్యమేమిటో తెలియదు.


‘ఆంజనేయుడు ఆంధ్రుడే’ అనీ, దానికి తనవద్ద ఎన్నో ఆధారాలున్నాయనీ మరొక పరిశోధకుడు ఆ ముందు రోజే పత్రికలలో ప్రకటించడం గమనార్హం. ఆ తరువాత రోజే తిరుమలలో ఈ పరిశోధక బృందం ప్రకటన వెలువడింది. ఆంజనేయుడు ఆంధ్రుడా, కాడా అన్న విషయం టి.టి.డి. వారికి ఇప్పుడే ఎందుకు అవసరమైందన్న విషయాన్ని అటుంచితే, ఆయన్ని మనం దేవుడని భావిస్తే, దేవుడు జాతి, ప్రాంతీయ, భాషాభేదాలకు అతీతుడు కదా ఆయన జన్మస్థలం ఎక్కడనే మీమాంస కొత్తగా ఇప్పుడు ఎందుకు? ఆంజనేయుడు పుట్టిన ప్రదేశం కర్ణాటకలోని హంపి సమీపంలోని అంజనాద్రి అయితే ఏమిటి? లేక తిరుమల కొండలలోని అంజనాద్రి అయితే ఏమిటి? 


వాల్మీకి రామాయణం ప్రకారం కిష్కింధ అనేది వాలి, సుగ్రీవులు నివసించి, పాలించిన వానర రాజ్యం. ఆంజనేయుడు ఆ రాజ్య నివాసి. రాముడిని తీసుకెళ్లి మొదటగా సుగ్రీవుడికి పరిచయం చేసింది కూడా ఆంజనేయుడే. కర్ణాటకలోని పంపానది (తుంగభద్ర) ఉత్తర తీరాన హంపి విజయనగరానికి సమీపంలో ఆనెగొంది పరిసరాలలో ఉన్న ఈ కిష్కింధ నేటికీ అదే పేరుతో పిలువబడుతూ ఉంది. అనాదిగా ఇది కుంతల దేశంలో అంతర్భాగం. ఇది నేటి కర్ణాటకలోని ఈశాన్య భాగంలో ఉంది. మహాభారత గాథలోని కుంతలుడి పేరు మీదుగా ఈ కుంతల దేశం ఏర్పడింది. తండ్రి యయాతి నుంచి వృద్ధాప్యాన్ని స్వీకరించేందుకు నిరాకరించి, ఆయన చేత ధర్మాధర్మ విచక్షణ లేనివారికి, కోతులకూ రాజువు కమ్మని శపించబడిన తుర్వసుని ఏడవ తరం వారసుడే ఈ కుంతలుడు. రామాయణ కాలం నాటి కిష్కింధ మహాభారత కాలం నాటికి కుంతల రాజ్యంలోని ఒక అంతర్భాగం అయింది. హంపిలో రామాయణ గాథకు సంబంధించిన ఎన్నో స్థలాలు నేటికీ అవే పేర్లతో పిలువబడుతూ ఉండడం విశేషం. మతంగ మహర్షి ఆశ్రమం కల మాల్యవంత పర్వతం ఇక్కడే ఉంది. ఈ పర్వతంలోని గుహలలోనే రాముడు లక్ష్మణుడితో సహా, సీతను వెదకడానికి వెళ్లిన హనుమంతుడు తిరిగి వచ్చేవరకు నివసించాడని ప్రతీతి. మతంగ మహర్షి శాపం కారణంగా సుగ్రీవుని అన్న వాలి అడుగుపెట్టలేని ఋష్యమూక పర్వతాన్ని కూడా కిష్కింధలో నేటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. 


వాల్మీకి రామాయణం ప్రకారం మతంగ మహర్షి ఒకరోజు ఋష్యమూక పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా దుందుభి అనే రాక్షసుడిని చంపి, ఆ కళేబరాన్ని వాలి ఋష్యమూక పర్వతం పైకి విసిరివేయగా, రక్త బిందువులు కొన్ని మహర్షి మీద పడ్డాయట. ఆయన కోపించి ఋష్యమూక పర్వతం మీద అడుగుపెట్టిన మరుక్షణమే వాలి తల వెయ్యి వ్రక్కలవుతుందని శపించాడట. అది మొదలు వాలి ఋష్యమూక పర్వతం ఛాయలకు కూడా వచ్చేవాడు కాడట. 


రాముడి చేతిలో వాలి వధింపబడేవరకు సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదే భద్రంగా నివసించాడు. రామాయణంలో వర్ణించిన సుగ్రీవుడి గుహ, అతని మధువనం హంపిలోని కిష్కింధలో నేటికీ అదే పేర్లతో వ్యవహరించబడటం విశేషం. ఈ సుగ్రీవుని గుహలోనే సీత నగలు భద్రపరచినట్లు రామాయణంలో ఉంది. ఉప్పునీటి సరస్సు కలిగిన రుమద్వంతం అనే పర్వతం హంపిలో అదే పేరుతో పిలువబడుతున్నది. సుగ్రీవుని భార్య అయిన రుమ ఈ పర్వతం మీదే పుట్టిందని నమ్ముతారు. ఇక్కడి హేమకూట పర్వతాన్ని కూడా ఇప్పటికీ అదే పేరుతో వ్యవహరిస్తున్నారు. దానికి సమీపంలోనే పంపా సరోవరం, సీతా సరోవరం, పంపాపతి ఆలయం కూడా ఉన్నాయి. దీనినే ప్రస్తుతం విరూపాక్షాలయం అంటున్నారు. ఇక్కడి పంపాసరోవరానికి సమీపంలోనే శబరి ఆశ్రమం, శబరి గుహ ఉన్నాయి. శబర జాతికి చెందిన ఆ వృద్ధ స్త్రీ మతంగ మహర్షి శిష్యురాలని రామాయణం పేర్కొంది. సీతను అన్వేషిస్తూ అక్కడికి వచ్చిన రామలక్ష్మణులకు ఆమె ముందుగా తాను ఎంగిలిచేసి రుచిచూసిన మధురఫలాలను పెట్టిందట. 


ఇక మరో ముఖ్యమైన ప్రదేశం కూడా హంపిలోనే ఉంది. అదే అంజనాద్రి అనే పర్వతం. దానినే ఇప్పుడు కన్నడిగులు అంజనాదేవి బెట్ట అని కూడా అంటున్నారు. ఈ పర్వతం మీదనే వానర స్త్రీ అయిన అంజనాదేవి, వాయుదేవుడు ఒకరినొకరు కలుసుకున్నారనీ, ఆంజనేయుడు పుట్టాడనీ అనాదిగా ప్రజలు నమ్ముతున్నారు. రామాయణ, భారతాది ఇతిహాసాలలో ఇవ్వబడిన పలు వివరాలు దాదాపుగా ఆధునిక భౌగోళిక వివరాలకు దగ్గరగానే ఉన్నాయి. 2007లో నేను ‘తెనాలి రామకృష్ణ కవి’ గ్రంథం రాసినప్పుడు రామాయణంలో పేర్కొనబడిన వైఖానస సరస్సే నేటి సైబీరియాలోని బైకాల్ సరస్సు అనే నిర్ధారణకు రావడంకోసం ఆ విషయమై లోతుగా పరిశోధించాను. రామాయణంలోని కిష్కింధ కాండలోని 43వ సర్గలో సీతను వెదకడం కోసం ఉత్తర దిశగా పంపబడిన శతబలితో సుగ్రీవుడు ‘హేమ పుష్కర సంఛన్నం తస్మిన్ వైఖానసం సరః’ అంటూ చెప్పింది బైకాల్ సరస్సు గురించే. కైలాస పర్వతం (సుమేరు) కి ఉత్తరంగా వెళితే వైఖానస సరస్సు వస్తుందనీ, అక్కడికి వెళ్లే దారిలో వచ్చే ‘అపర్వత నదీ వృక్షం సర్వ సత్వ వివర్జితమ్’ (ఎటువంటి పర్వతాలు, నదులు, వృక్షాలు, జీవజాలం లేనట్టి) అంటూ చెప్పబడింది నేటి గోబి లేక షామొ ఎడారి గురించేననీ నిర్ధారణకు వచ్చాను. నిజంగానే నేటి చైనాలోని తీసా (కైలాస పర్వతం) కు ఉత్తరంగా వెళితే గోబి (షామొ) ఎడారి, దానిని దాటి వెళితే బైకాల్ సరస్సు వస్తాయి. రామాయణంలో ఉత్తర కురుభూముల (టిబెట్, చైనా, మంగోలియా, సైబీరియా) గురించి ఇవ్వబడిన భౌగోళిక వివరాలు దాదాపు వాస్తవానికి దగ్గరగానే ఉండటం గమనార్హం. 


రామాయణ గాథలో వివరించిన ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రి కిష్కింధ అనే వానర రాజ్యంలోనిదేనని అనాదిగా జనం విశ్వాసం. ఆ అంజనాద్రి కర్ణాటకలోని హంపి సమీపంలోని కిష్కింధలో ఉన్నదేనని పేర్కొన్న ద్వారకా పీఠాధిపతి వాదనను ప్రస్తుత ప్రతిపాదన ఏ ఆధారాలతో తిరస్కరిస్తున్నదీ స్పష్టత లేదు. రామాయణంలో పేర్కొన్నదానినిబట్టి సుగ్రీవుడు తన సర్వసైన్యాధ్యక్షుడైన నీలుడు (అగ్ని పుత్రుడు), నలుడు (విశ్వకర్మ పుత్రుడు), హనుమంతుడు, అంగదుడు (వాలి కుమారుడు), జాంబవంతుడు మొదలైన వారినందరినీ సీతను వెదికేందుకు దక్షిణ దిశకు పంపాడు. సీతాన్వేషణలో భాగంగా వారు హంపికి ఆగ్నేయంగా సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమల కొండలకు కూడా వచ్చి ఉండే అవకాశం ఉంది. దానికి ‘వేంకటాచల మహాత్మ్యం’ నుంచి ఆధారాలు చూపాల్సిన అవసరమైతే లేదు. కావలసిందల్లా తిరుమల కొండలలోని అంజనాద్రి పర్వతం మీదనే ఆంజనేయుడు జన్మించాడనే విషయమై స్పష్టత. సుగ్రీవుడు పాలించిన కిష్కింధ అనే వానర రాజ్యం హంపిలో ఉందని అంగీకరిస్తూనే ఆంజనేయుడి జన్మస్థలం మాత్రం హంపిలోని అంజనాద్రి కాదు, తిరుమల కొండలలోని అంజనాద్రి అనడమే యుక్తియుక్తంగా లేదు. తిరుమల కొండలలోని అంజనాద్రిలో పుట్టి పెరిగిన హనుమ కిష్కింధకు వెళ్లి సుగ్రీవుడికి సాయం చేసి ఉండవచ్చుననే ప్రతిపాదన కూడా బలహీనంగా ఉంది. ఇప్పటికే హనుమంతుడు తమ రాష్ట్రంలోనే పుట్టాడని గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా వాదిస్తున్నాయి. కొత్తగా ఆంధ్రప్రదేశ్ కూడా రంగప్రవేశం చేసింది. ఎన్ని రాష్ట్రాలు గోదాలోకి దిగినా కిష్కింధలో ఉన్న అంజనాద్రి వైపే అంటే కర్ణాటక వైపే విజ్ఞులు మొగ్గు చూపవచ్చు. అయితే చారిత్రక వివాదాలైనా తేలవచ్చేమోగానీ పౌరాణిక వివాదాలు ఓ పట్టాన తెగవు. అభివృద్ధికి నోచుకోక, అధోగతికి చేరుకున్న ఆంధ్రులకు ఇప్పుడు ఆంజనేయుడు తమవాడేనని తేలినా అదనంగా ఒరిగేదేమీ ఉండదు. పాలనాపరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాలకులు అప్పుడప్పుడు ఇలా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. 

ముత్తేవి రవీంద్రనాథ్

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.