బదిలీల సందడి

ABN , First Publish Date - 2022-06-30T06:10:58+05:30 IST

ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి నెలకొంది. దాదాపు అన్ని శాఖల్లో పైరవీలు జరుగుతున్నాయి.

బదిలీల సందడి

శాఖల వారీగా జాబితాలు సిద్ధం

నేటి సాయంత్రం లేదా రాత్రికి వెల్లడి

అధికార పార్టీ నేతల సిఫారసులను పరిగణనలోకి

తీసుకోవలసిందిగా ఉన్నతాధికారులకు పైనుంచి ఆదేశాలు

తమ చెప్పుచేతుల్లో ఉండే వారిని

తహసీల్దార్‌ కార్యాలయాల్లో

నియమించాల్సిందిగా కోరుతున్న ఎమ్మెల్యేలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి నెలకొంది. దాదాపు అన్ని శాఖల్లో పైరవీలు జరుగుతున్నాయి. బదిలీల కోసం ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు భిన్నంగా అధికార పార్టీ నేతల సిఫారసులు, లేఖలనే అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. బదిలీలకు గురువారం చివరిరోజు కావడంతో అన్ని శాఖల్లో జాబితాలు సిద్ధమయ్యాయి. ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను శాఖల అధికారులు బదిలీ జాబితాలో చేర్చారు. అయితే అత్యవసర వైద్యం అవసరమైన వ్యక్తులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇంకా 50 ఏళ్లు దాటిన వారిని ఏజెన్సీకి బదిలీ చేయకూడదనే నిబంధన అమలుచేస్తున్నారు. రెవెన్యూ సహా పలు శాఖల్లో బదిలీ కానున్న ఉద్యోగుల జాబితాలు సిద్ధం చేసినా బయటకు చెప్పడానికి అధికారులు ఇష్టపడడం లేదు. గురువారం సాయంత్రం లేదా రాత్రి వివరాలు వెల్లడించడానికి సిద్ధమవుతున్నారు. 

నేతల సొంత జాబితా

బదిలీల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతల సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు జిల్లా ఉన్నతాధికారులకు సూచించారనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు రెవెన్యూలో కీలకమైన తహసీల్దార్‌ కార్యాలయాల్లో తమ సొంత టీమ్‌ ఏర్పాటుకు అనుగుణంగా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. చివరకు తహసీల్దార్ల బదిలీల్లో కూడా అధికార పార్టీ నేతల ముద్ర ఉంటుందంటున్నారు. దీనికి అనుగుణంగానే జాబితాలు సిద్ధమయ్యాయంటున్నారు. అయితే నేతల సిఫారసులను కలెక్టర్‌ పరిగణనలోకి  తీసుకుంటారా? లేక ప్రతిభ, సీనియారిటీ, ఆరోపణలకు దూరంగా వుండే వ్యక్తులకు కీలక స్థానాల్లో పోస్టింగ్స్‌ ఇస్తారా?...అనేది గురువారం సాయంత్రం వెల్లడి కానున్నది. 

జడ్పీలో సంఘ నేత మధ్యవర్తిత్వంపై ఆరోపణలు

జిల్లా పరిషత్‌ పరిధిలో ఐదేళ్లకు మించి ఒకేచోట సర్వీస్‌ పూర్తిచేసుకున్న ఉద్యోగులు 277 మంది వున్నట్టు గుర్తించారు. వీరిలో ఎక్కువ మందిని బదిలీ చేసేందుకు అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఆ జాబితాను జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్రకు సీఈవో విజయకుమార్‌ అందజేశారు.  అయితే జడ్పీలో సంఘ నేత ఒకరు బదిలీల్లో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇప్పిస్తానంటూ సదరు నేత భారీగా డబ్బులు వసూలు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకూ చైర్‌పర్సన్‌ బంగ్లాలో వుంటూ హడావిడి చేస్తుండడాన్ని కొందరు ఉద్యోగులు వైసీపీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారని తెలిసింది. ఇదిలావుండగా బదిలీల నుంచి తమను మినహాయించాలని జడ్పీలో రెండు సంఘాలతోపాటు ఎన్జీవోలు, క్లాస్‌-4 సంఘం ప్రతినిధులు చైర్‌పర్సన్‌ను కలిశారు. కాగా పలు ఆరోపణలున్న ఉద్యోగ సంఘ నేత ఒకరు బదిలీ నుంచి తప్పించుకుని విశాఖలోనే కొనసాగాలని పైరవీ చేస్తున్నారు. జడ్పీలో రెండు సంఘాల మధ్య చాలాకాలంగా విభేదాలు  కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ సంఘం కార్యవర్గం గడువు గత ఏడాదితో ముగిసింది. అందువల్ల ఈ సంఘానికి ఎన్నికలు నిర్వహించిన తరువాత మాత్రమే కార్యవర్గాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కొందరు ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. జడ్పీలో వున్న మరో సంఘం ‘ప్రభుత్వ ఉద్యోగుల సంఘం’పై కోర్టులో కేసు ఉంది. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన సంఘాల ఆఫీస్‌ బేరర్స్‌ను బదిలీ చేయాలని మెజారిటీ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. బదిలీలపై వస్తున్న ఆరోపణలను జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర వద్ద ప్రస్తావించగా ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేస్తామన్నారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ అత్యవసర వైద్యం అవసరమున్నవారు, పదవీ విరమణకు చేరువలో ఉన్న వారిని తప్ప మిగిలిన వారిని నిబంధనల ప్రకారం బదిలీ చేస్తామన్నారు. ఉద్యోగుల సంఘ నేతలకు కూడా  మినహాయింపు ఇచ్చేది లేదన్నారు. సంఘ నేత ప్రమేయంపై మాట్లాడుతూ ఎవరినీ ప్రోత్సహించబోమని, బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2022-06-30T06:10:58+05:30 IST