జిల్లాలో ఎన్నికల వాతావరణం

ABN , First Publish Date - 2021-11-03T06:21:42+05:30 IST

జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.

జిల్లాలో ఎన్నికల వాతావరణం

సందడి మొదలు..

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

పోటీకి ఉవ్విళ్లూరుతున్న ఇరు పార్టీల అభ్యర్థులు

పెనుకొండ చైర్మన అభ్యర్థిత్వంపై సమాలోచనలు

అనంతపురం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. పెనుకొండ నగర పంచాయతీలోని 20 వార్డులు, అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన, రాయదుర్గం మున్సిపాలిటీలోని ఒకటో వార్డుతోపాటు చిలమత్తూరు జడ్పీటీసీ, 16 ఎంపీటీసీలు, 4 సర్పంచ, 175 వార్డులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఆయా స్థానాల్లో పోటీచేసేందుకు ఇరు పార్టీల అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయా రాజకీయ పార్టీల స్థానిక నాయకులు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో... కరోనా నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు వేసేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు సంసిద్ధమయ్యారు. గురువారం దీపావళి పండుగ అయినప్పటికీ... నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 5తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అన్ని స్థానాల్లోనూ పోటీచేసేందుకు పాలకపార్టీయేతర పక్షాలు బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతున్నారు. ఐదు నెలల క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అధికార పార్టీ దౌర్జన్యాల నేపథ్యంలోనే అప్పట్లో ఆ పార్టీ అధిష్టానం ఆ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజా ఎన్నికల్లో అధికార పార్టీతో తలపడేందుకు టీడీపీ ముఖ్య నేతలు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. అధికార పార్టీ సాగిస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు, హామీల వైఫల్యం తదితర అంశాలే అజెండాగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ షరామామూలే అన్న చందంగా... వలంటీర్లనే ప్రధాన ఆయుధంగా వాడుకునేందుకు సిద్ధమైంది. ఇదివరకూ జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే వలంటీర్ల ద్వారా లబ్ధి పొందిందో... అదే వ్యూహంతో వాయిదా పడిన స్థానాలను చేజిక్కించుకోవాలనే యోచనలో ఉన్నారు. ప్రధానంగా పెనుకొండను నగర పంచాయతీగా గుర్తించినప్పటికీ... కొన్ని కారణాల నేపథ్యంలో ఇటీవల ఎన్నిక నిర్వహించలేదు. తొలిసారిగా అందులోనూ ప్రత్యేకంగా పెనుకొండ నగర పంచాయతీకే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష టీడీపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారధి ఆ నియోజకవర్గానికి ఇనచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన మాలగుండ్ల శంకర్‌నారాయణ ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు మంత్రిగా పనిచేస్తున్నారు. ఆ ఇద్దరు ముఖ్యనేతలూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో... ఈ ఎన్నిక వారికి ప్రతిష్టాత్మకంగా మారింది. జిల్లాలోని 14 నియోజకవర్గాల టీడీపీ ముఖ్యనేతలు పెనుకొండ నగర పంచాయతీలో పసుపు జెండా ఎగరేయాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఆ మేరకు సమష్టిగా అడుగులు వేస్తున్నారు. ఆ నగర పంచాయతీలో 20 వార్డులుండగా... ఒక్కోవార్డు బాధ్యతను ఆ పార్టీ ముఖ్య నాయకులకు ఇప్పటికే అప్పగించారు. ఓటర్లను ఏ విధంగా ఆకర్షించాలి...? ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఓటర్లలోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలనేదే ఆ పార్టీ ముఖ్య నేతల ప్రధాన అజెండా. అధికార పార్టీలో ముఖ్య నేతల మధ్య అసంతృప్తుల నేపథ్యంలో... పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా లేరన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలూ ఆసక్తి చూపరన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ... రాష్ట్ర మంత్రిగా మాలగుండ్ల శంకర్‌నారాయణకు పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలు పెనుసవాల్‌గా మారాయనడంలో అతిశయోక్తి లేదు.


పెనుకొండ చైర్మన అభ్యర్థిత్వంపై సమాలోచనలు 

మేజర్‌ పంచాయతీగా ఉన్న పెనుకొండను కొన్నేళ్ల క్రితం నగర పంచాయతీగా మార్పు చేశారు. అప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో చైర్మన అభ్యర్థిత్వంపై ఇరు పా ర్టీల ముఖ్యనేతలు సమాలోచనలు చేస్తున్నారు. చైర్మన అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే అసంతృప్తులు పెల్లుబుకే అవకాశం ఉంటుందనే అభిప్రాయంలో అధికార పార్టీ ఉంది. టీడీపీ నుంచి ఓ మహిళా నేతను చైర్మన అభ్యర్థిగా ప్రకటించాలనే వ్యూహంలో ముఖ్య నేతలున్నారు. ఆమె పోటీ చేసేందుకు సంసిద్ధంగా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెనుకొండ పట్టణంలో ఓటర్లు ఎక్కువగా ఉన్న సామాజికవర్గం నుంచి చైర్మన అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలనే యోచనలో వైసీపీ నేతలున్నారు. ఏదేమైనప్పటికీ పెనుకొండ నగర పంచాయతీ చైర్మన అభ్యర్థిత్వంపై ఇరు పార్టీలు సమాలోచనలో పడ్డాయి.

Updated Date - 2021-11-03T06:21:42+05:30 IST