2 వేలకు చేరువగా..!

ABN , First Publish Date - 2020-07-06T11:04:25+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండు వేలకు చేరువలోకి వచ్చింది. ఆదివారం 58 కేసుల్ని గుర్తించారు.

2 వేలకు చేరువగా..!

 జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు

తాజాగా 58 నమోదు

63 మండలాల్లో వైరస్‌ ఉనికి


తిరుపతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండు వేలకు చేరువలోకి వచ్చింది. ఆదివారం 58 కేసుల్ని గుర్తించారు. వీటిలో తిరుపతి అర్బన్‌ మండలంలో 14, పుంగనూరులో 12, నగరిలో 8, చిత్తూరులో 7, తిరుపతి రూరల్‌, చంద్రగిరి మండలాల్లో రెండేసి, బంగారుపాళెం, జీడీనెల్లూరు, నిండ్ర, పలమనేరు, పుత్తూరు, రేణిగుంట, సోమల, శ్రీకాళహస్తి, వరదయ్యపాళెం, వెదురుకుప్పం, ఏర్పేడు తదితర 11 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మిగిలిన రెండు కేసులూ కర్నూలు జిల్లాకు సంబంధించినవి. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 1928కి పెరిగింది. వీటిలోనూ 34 కేసులు ఇతర రాష్ట్రాలకు... 12 కేసులు ఇతర జిల్లాలకు చెందినవి. జిల్లాకు సంబంధించిన కేసుల సంఖ్య 1882గా అధికారులు ప్రకటించారు. మరోవైపు సోమల మండలంలో ఆదివారం తొలి కరోనా కేసు నమోదు కావడంతో వైరస్‌ ఉనికి బయటపడిన మండలాల సంఖ్య 63కు చేరింది.


శరవేగంగా విస్తరణ 

రోజులు గడిచేకొద్దీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 


ఈ ఏడాది మార్చి 24న తొలి కరోనా కేసు నమోదు కాగా.. మే 13వ తేదికి (50 రోజులకు) కేసుల సంఖ్య 151కు చేరింది. అంటే యాభై రోజుల్లో కేసుల పెరుగుదల 150 శాతం. 


జూలై 2వ తేదీకి (వందో రోజు) కేసుల సంఖ్య 1720కి చేరింది. అంటే తొలి 50 రోజుల్లో 151 నమోదైతే.. మలి 50 రోజుల్లో 1569 కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి జిల్లాలో వైరస్‌ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందో అర్థం చేసుకోవచ్చు. 


23 మండలాల్లో అధికం 

తిరుపతి నగరంలో కేసుల సంఖ్య 350కి చేరాయి. రూరల్‌ మండలంలో 122, శ్రీకాళహస్తిలో 195, పుత్తూరులో 179, చిత్తూరులో 134, నగరిలో 119 కేసులు నిర్ధారణ అయ్యాయి. సత్యవేడులో 97, రేణిగుంటలో 57, నారాయణవనంలో 48, మదనపల్లెలో 47, నాగలాపురంలో 44, పిచ్చాటూరులో 42, చంద్రగిరిలో 39, నిండ్రలో 36, విజయపురంలో 34, ఏర్పేడులో 23, కేవీబీపురంలో 22, వి.కోటలో 21, కార్వేటనగరంలో 20, పుంగనూరులో 19, గుడిపాల, వరదయ్యపాళెం మండలాల్లో 18 చొప్పున, జీడీనెల్లూరులో 13 వంతున కేసులను గుర్తించారు. ఈ 23 మండలాల్లోనే 1697 కేసులు బయట పడ్డాయి. మిగిలిన 40 మండలాల్లో 185 నమోదయ్యాయి.


ఆ మూడు మండలాల్లో లేవు 

కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె, పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం.. ఈ మూడు మండలాల్లో మాత్రమే ఇప్పటి వరకూ కరోనా కేసులేవీ నమోదు కాలేదు. 


హాట్‌స్పాట్‌గా తిరుపతి ప్రాంతం

కరోనా వైరస్‌ వ్యాప్తికి తిరుపతి ప్రాంతం హాట్‌స్పాట్‌గా మారుతోంది. నగరంలో 350, నగరంతో కలసిపోయిన రూరల్‌ మండలంలో 122, చంద్రగిరిలో 39, రేణిగుంటలో 57 చొప్పున నమోదయ్యాయి. భౌగోళికంగానూ, జనజీవన పరంగానూ ఈ నాలుగు మండలాలు ఒకే జనావాసంగా పరిగణించే పరిస్థితి ఉంది. ఈ నాలుగు చోట్ల వెలుగుచూసిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 568. తిరుపతి ప్రాంతం వైరస్‌ వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారిందనడానికి ఈ లెక్కలే నిదర్శనం. సాక్షాత్తూ టీటీడీలోనే అధికారిక సమాచారం మేరకే 17 మంది ఉద్యోగులకు వైరస్‌ సోకింది. ఉద్యోగుల కుటుంబాల్లో వైరస్‌ బాధితుల సంఖ్య గురించి స్పష్టత లేదు. ఇక, రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లోనూ, కార్పొరేషన్‌లోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, వారి కుటుంబీకులు వైరస్‌ బారిన పడ్డారు. బాధితుల్లో పోలీసు సిబ్బంది, అధికారులూ ఉన్నారు. 

Updated Date - 2020-07-06T11:04:25+05:30 IST