ఆంధ్రా నుంచి పొంచి ఉన్న కరోనా వైరస్‌

ABN , First Publish Date - 2020-08-08T09:49:51+05:30 IST

సత్తుపల్లి పట్టణానికి ఆంధ్రా ప్రాంతం నుంచి కరోనా వైరస్‌ ముప్పు పెరుగుతోంది. రోజు రోజుకూ పట్టణంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడమే ఇందుకు

ఆంధ్రా నుంచి పొంచి ఉన్న కరోనా వైరస్‌

భయం గుప్పెట్లో సత్తుపల్లి....

రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

పట్టణంలో 12 గంటలకు దుకాణాల బంద్‌


సత్తుపల్లి, ఆగస్టు 7: సత్తుపల్లి పట్టణానికి ఆంధ్రా ప్రాంతం నుంచి కరోనా వైరస్‌ ముప్పు పెరుగుతోంది. రోజు రోజుకూ పట్టణంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. కొద్ది రోజుల క్రితం వరకూ సత్తుపల్లి పట్టణం సేఫ్‌ జోన్‌గా ఉన్నప్పటికీ వారం రోజుల వ్యవధిలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఇప్పటి వరకూ పట్టణంలో 50 వరకూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ వైరస్‌ బారిన పడిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు వైరస్‌ బారిన పడటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోయింది.


దీంతో పట్టణ ప్రజలు రోడ్డు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, విజయవాడ వెళ్లి వచ్చిన వారికి ఎక్కువ మందికి వైరస్‌ సోకింది. ఇటీవల ఏలూరు ప్రాంతంలో పెళ్లికి వెళ్లి వచ్చిన ఒక కుటుంబం మొత్తం వైరస్‌ బారిన పడ్డారు. కృష్ణా జిల్లా వెళ్లి వచ్చిన ఒక విశ్రాంత ఉద్యోగి సహా ఆయన కాంటాక్టు ద్వారా ఆ కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకింది. పట్టణానికి చెందిన ఒక వ్యాపారి కుటుంబ సభ్యులు ఏలూరు వెళ్లిన కారణంగా ఆ కుటుంబంలో మహిళకు, ఆమె భర్తకు మరొకరికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. మరో వ్యక్తికి సంబంధించి ఆంధ్రా ప్రాంతం నుంచి సత్తుపల్లి వచ్చిన వారి ద్వారా వైరస్‌ సోకినట్లు తెలిసింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారి ద్వారా ఒక కుటుంబంలోని సభ్యులకు వైరస్‌ వ్యాపించినట్లు చెపుతున్నారు.


బ్యాంకుల్లో కలకలం....

సత్తుపల్లిలో ఇప్పటికే రెండు ప్రధాన బ్యాంకుల్లో సిబ్బందికి కరోనా పాజిటివ్‌ రావటంతో ఖాతాదారులు, బ్యాంకుల సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. బ్యాంకుల వద్ద శానిటేషన్‌, భౌతికదూరం అమలు చేస్తున్నప్పటికీ కరోనా పాజిటివ్‌ రావటంతో ఆందోళన కలిగిస్తోంది. 


నియంత్రణ అవసరమంటున్న అధికారులు

కరోనా వైరస్‌ పట్టణంలో వేగంగా విస్తరిస్తున్న కారణంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే మేలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రా సరిహద్దు మండలమైన సత్తుపల్లి ప్రాంత ప్రజలకు ఆంధ్రాలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలతో బంధుత్వంతో పాటు వ్యాపార లావాదేవీలు నిత్యం ఉంటాయి. ఈ క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


12గంటలకు దుకాణాల బంద్‌

సత్తుపల్లిలో రోజు రోజుకూ కరోనా వైరస్‌ విస్తరిస్తున్న కారణంగా వ్యాపారస్తులు మధ్యా హ్నం 12గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. కొన్ని దుకాణాలను ఉదయం ఆ రు గంటల నుంచి 11 గంటల వరకూ మాత్రమే తీసి ఉంచుతున్నారు. నగల దుకాణాలు అవసరమైతేనే తెరుస్తున్నారు. మోటార్‌సైకిల్‌ మెకానిక్‌లు, ఆటోమొబైల్‌ షాపులు ఈ నెల 5 నుంచి 15 వరకూ పూర్తి స్థాయిలో బంద్‌ పాటిస్తున్నారు.

Updated Date - 2020-08-08T09:49:51+05:30 IST