మొబైల్స్‌ స్వాధీనంపై తలొక విధానం

ABN , First Publish Date - 2021-03-07T07:34:02+05:30 IST

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వలంటీర్ల నుంచి మొబైల్స్‌ స్వాధీనం చేసుకునే విషయమై అధికారులు తలొక విధానం అమలు చేస్తున్నారు.

మొబైల్స్‌ స్వాధీనంపై తలొక విధానం

తిరుపతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వలంటీర్ల నుంచీ మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకునే విషయంలో అధికారులు తలొక విధానం అమలు చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న నగర, పట్టణ ప్రాంతాల్లోని వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా వుంచామని, ఎక్కడైనా వారు ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్టు తెలిస్తే ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ హరినారాయణ్‌ శనివారం ప్రకటన జారీ చేస్తూ అందులో సంబంధిత ఫోన్‌, వాట్సప్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీ తదితర వివరాలిచ్చారు. కానీ ఫోన్ల స్వాధీనం గురించి అందులో ప్రస్తావించకపోవడం గమనార్హం.కాగా మదనపల్లె మున్సిపాలిటీలో ఈ నెల 1, 2, 3 తేదీల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి కాగానే వలంటీర్ల నుంచీ మొబైల్‌ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసేసుకున్నారు.నగరి ,పుత్తూరు మున్సిపాలిటీల్లో హైకోర్టు ఆదేశాలతో వలంటీర్ల నుంచీ మొబైల్‌ ఫోన్లను మున్సిపల్‌ కమిషనర్లు స్వాధీనం చేసేసుకున్నారు.పలమనేరు మున్సిపాలిటీలో మొబైల్‌ ఫోన్లు అప్పగించాలని వలంటీర్లకు మున్సిపల్‌ అధికారులు  నోటీసులు జారీ చేశారు. అయితే శనివారం సాయంత్రం వరకూ ఫోన్లను అధికారులకు వలంటీర్లు  అప్పగించలేదు.


తిరుపతిలో ఫోన్లు లేకుంటే డ్యూటీలు కష్టమట!

తిరుపతి కార్పొరేషన్‌లో వలంటీర్లకు ప్రభుత్వం సమకూర్చిన మొబైల్‌ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకోలేదు. ఫోన్లు లేకుంటే రోజువారీ విధి నిర్వహణ కష్టమంటున్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో వలంటీర్ల నుంచీ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వుల్లో ఒకవేళ ఫోన్లు తప్పనిసరిగా అవసరమైన పక్షంలో వాటిని పర్యవేక్షణాధికారి సమక్షంలో వినియోగించాలని వెసులుబాటు ఇచ్చారు. దాన్ని అవకాశంగా తీసుకున్న తిరుపతి మున్సిపల్‌ అధికారులు వలంటీర్ల నుంచీ మొబైల్‌ ఫోన్లు తీసేసుకుంటే ముఖ్యమైన విధుల నిర్వహణకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. అదే సాకుగా చూపి వలంటీర్ల నుంచీ ఫోన్లు స్వాధీనం చేసుకోలేదు.


చిత్తూరులో ఎస్‌ఈసీ నుంచీ ఆదేశాలు రాలేదట!

చిత్తూరు నగర కార్పొరేషన్‌లో 580 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని మున్సిపల్‌ అధికారులు స్పష్టంచేస్తున్నారు. అయితే ఫోన్లను స్వాధీనం చేసుకునే విషయంలో మాత్రం తమకు ఎన్నికల కమిషన్‌ నుంచీ ఇంతవరకూ ఎలాంటి ఆదేశాలూ రాలేదని చెబుతున్నారు. ఆ కారణం చూపి వలంటీర్ల నుంచీ ఇప్పటి దాకా ఫోన్లను వశపరుచుకోలేదు.

Updated Date - 2021-03-07T07:34:02+05:30 IST