పార్టీని తిరుగులేని శక్తిగా నిలపాలి

ABN , First Publish Date - 2022-05-18T05:37:51+05:30 IST

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా నిలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

పార్టీని తిరుగులేని శక్తిగా నిలపాలి
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌

కరీంనగర్‌ టౌన్‌, మే 17:  క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా నిలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్‌లో బీజేపీ బూత్‌ కమిటీల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జీల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నదన్నారు. బూత్‌ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలు పట్టుదలతో కృషి చేస్తే పార్టీ విజయం ఖాయమని అన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ బూత్‌ ల సంస్థాగత నిర్మాణం బలోపేతంపై దృష్టి సారించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు బండి సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. బూత్‌ అధ్యక్షుల సమష్టి కృషితోనే తుక్కుగూడ సభ విజయవంతయిందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని చెప్పారు. అందుకే పార్టీని బూత్‌ స్థాయిలో బలోపేతం చేయడానికి తగిన కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ డబల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతిలో పెడితే రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని, టీఆర్‌ఎస్‌ పాలన తుగ్లక్‌ పరిపాలన కంటే హీనంగా మారిందని విమర్శించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కుటుంబ పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించేందుకు బీజేపీ శ్రేణులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వ  వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి కృషి చేయాలని కోరారు. ఈ నెల 25న కరీంనగర్‌లో తలపెట్టిన హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యే బొడిగె శోభ, కటకం మృత్యుంజయం, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు శివరామయ్య, రాం గోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, వాసుదేవ రెడ్డి, లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T05:37:51+05:30 IST