స్ఫూర్తి శిఖరం

ABN , First Publish Date - 2022-06-10T07:55:24+05:30 IST

రెండుదశాబ్దాలకు పైగా మహిళల క్రికెట్‌లో రాజ్యమేలి లేడీ సచిన్‌గా నీరాజనాలందుకున్న మిథాలీ రాజ్‌ ఆటనుంచి నిష్క్రమిస్తున్నట్టుగా ప్రకటించారు...

స్ఫూర్తి శిఖరం

రెండుదశాబ్దాలకు పైగా మహిళల క్రికెట్‌లో రాజ్యమేలి లేడీ సచిన్‌గా నీరాజనాలందుకున్న మిథాలీ రాజ్‌ ఆటనుంచి నిష్క్రమిస్తున్నట్టుగా ప్రకటించారు. కెరీర్‌ ఆరంభం నుంచి ఆఖరి బంతివరకూ అదే అంకితభావంతో ముందుకు సాగిన ఆమె పురుషాధిక్య క్రికెట్‌లో వారికి దీటుగా ఆడి, లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టింది. సచిన్‌ టెండూల్కర్‌ 24 ఏళ్లు ఆటలో కొనసాగితే, మిథాలీ 23 ఏళ్లపాటు మహిళల క్రికెట్‌లో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. 


మిథాలీ క్రికెట్‌ ప్రవేశం ఆసక్తికరం. చిన్నప్పుడు సోదరుడితో కలిసి సరదాగా స్టేడియానికి వెళ్లిన ఆమెకు అనూహ్యంగా క్రికెట్‌ బ్యాటుపై ఆసక్తి కలిగింది. తాను నేర్చుకుంటున్న భరతనాట్యం, ఇష్టపడుతున్న క్రికెట్‌లలో దేనిని కెరీర్‌గా ఎంచుకోవాలన్న ప్రశ్న ఒక దశలో తలెత్తినప్పుడు ఆమె బ్యాటు పట్టేందుకే సిద్ధపడింది. మహిళల క్రికెట్‌కు ఏమాత్రం ఆదరణ లేని రోజుల్లో ఆ ఆటలోకి రావాలనుకోవడం ఆమె విభిన్నమైన ఆలోచనా ధోరణికి నిదర్శనం. క్రికెటర్‌గా ఎదగాలన్న మిథాలీ నిర్ణయానికి తల్లిదండ్రుల మద్దతు ఉన్నది కానీ, తాతయ్య, నానమ్మ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. క్రికెట్‌ ఆడితే ఎండకు నల్లగా అయిపోతారని, అప్పుడు ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారని వాళ్ల ఆందోళనట. అంతేకాదు, క్రికెట్‌ కిట్లు పట్టుకొని ప్రాక్టీస్‌కు వెళ్తుంటే చాలామంది హాకీ క్రీడాకారిణివా అని అడిగేవారనీ, ఆడపిల్లలు క్రికెట్‌ ఆడతారని అప్పట్లో చాలామందికి తెలియదనీ మిథాలీ గతంలో చెప్పుకొచ్చింది. పలు సామాజిక కట్టుబాట్లు, సమస్యలు వేధిస్తున్న సమయంలో మిథాలీ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. అప్పటికి ఈ మాత్రం ప్రోత్సాహం కూడా లేని మహిళల క్రికెట్‌లో మ్యాచ్‌ ఫీజులు అరకొరగా ఉండేవి. ప్రయాణ ఖర్చులు సైతం సొంతంగా పెట్టుకోవాల్సిన స్థితి. ఓ వైపు మగ క్రికెటర్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ, ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేస్తుంటే.. మహిళల జట్టు సభ్యులు మాత్రం అరకొర సౌకర్యాలతోనే సరిపెట్టుకునేవారు. ఇలాంటి అడ్డంకులన్నింటినీ అధిగమించి, తన ప్రతిభతో అంచలంచెలుగా ఎదిగి మహిళల క్రికెట్‌కు ముఖచిత్రంగా మారింది మిథాలీ. వేలాదిమంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు స్ఫూర్తినిచ్చింది. 


పదహారేళ్ల వయసులో తొలి వన్డే ఆడిన మిథాలీ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకుంది. మూడేళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో పోరులో ద్విశతకం నమోదు చేసి పురుష క్రికెటర్ల ప్రతిభకు తీసిపోనని నిరూపించుకుంది. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌లోనూ తన  ముద్ర వేసింది. అనతికాలంలోనే టీమిండియా సారథిగా ఎంపికై జట్టును సమర్ధవంతంగా నడిపించి, పురుషుల క్రికెట్‌లో మేటి కెప్టెన్‌గా పేరున్న మహేంద్రసింగ్‌ ధోనీకి సమానంగా ఖ్యాతి గడించింది. రికార్డుస్థాయిలో ఆరుసార్లు ప్రపంచకప్‌లో ప్రాతినిథ్యం వహించిన ఆమె రెండుసార్లు జట్టును ఫైనల్స్‌ దాకా తీసుకెళ్లి తన సమర్థతను రుజువుచేసుకుంది. ప్రపంచ మహిళల క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన మూడో సారథి ఆమె. మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ఈమె, ఓసారి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కాలికి గాయమైనా 91 పరుగులు సాధించి ఆటపట్ల తన అంకితభావాన్ని చాటుకుంది. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌ తర్వాత టీ20 ప్రపంచకప్‌ సమయంలో ఆమె సామర్ధ్యం, అంకితభావంపై జట్టు యాజమాన్యం నుంచి ప్రశ్నలు తలెత్తినా కుంగిపోకుండా ఆటతోనే ఆ విమర్శలన్నింటికీ సమాధానమిచ్చింది. ఆటతో పాటు ఆత్మగౌరవం విషయంలోనూ ఆమె ఎంతో నిక్కచ్చిగా ఉండేది. ఓ ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన పురుష క్రికెటర్‌ ఎవరని అడిగితే.. ‘మీకిష్టమైన మహిళా క్రికెటర్‌ ఎవరని వాళ్లను ఎప్పుడైనా అడిగారా’ అని బదులివ్వడం మిథాలీకే చెల్లింది. ఎన్నో ఆటంకాలు, సవాళ్లను ఎదుర్కొంటూ, మరెన్నో మైలురాళ్లను దాటుకుంటూ ఆమె సాగించిన సుదీర్ఘ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ‘నాకు అవకాశమిస్తే క్రికెట్‌ పరిపాలనలోకి వస్తా. ఆటను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేస్తా. యువ క్రికెటర్లకు ఏం కావాలో నాకు బాగా తెలుసు’ అని రిటైర్మెంట్‌ సందర్భంగా మిథాలీ చేసిన వ్యాఖ్యను భారత క్రికెట్‌ బోర్డు పెద్దలు పరిగణనలోకి తీసుకోవాలి. మహిళల క్రికెట్‌కు స్ఫూర్తి శిఖరంగా నిలిచిన ఆమె సేవలను వినియోగించుకుంటే భవిష్యత్తులో మరెందరో మిథాలీలు వెలుగులోకి వస్తారు.

Updated Date - 2022-06-10T07:55:24+05:30 IST