‘పెడల్ మీద కాలు’ ఎప్పుడో తీసేశాం!

ABN , First Publish Date - 2020-06-10T05:46:14+05:30 IST

పౌరసత్వ బిల్లు సృష్టించిన హింసాత్మక ఆందోళన వల్లో, లేక ఇతరత్రా ఏమైనా రాజకీయ కారణాలో కానీ గత రెండున్నర నెలలుగా కొంచెం స్తబ్ధంగా ఉన్న హోంమంత్రి అమిత్ షా మళ్లీ రంగంలోకి దిగారు...

‘పెడల్ మీద కాలు’ ఎప్పుడో తీసేశాం!

భారత దేశ రాజకీయ వ్యవస్థ ప్రాణం ఎన్నికల్లోనే ఉంటుంది కనుక రాజకీయ నాయకుల ఆలోచనలన్నీ ఎన్నికలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కరోనాపై పోరులో మన దేశం ఎప్పుడు విజయం సాధిస్తుందో, న్యూజిలాండ్‌లో లాగా కరోనా రహిత దేశంగా మన దేశాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కాని మన నాయకులే ఇప్పుడు కరోనా గురించి మాట్లాడడం తగ్గించారు. ‘ప్రాణం కావాలీ, ప్రపంచమూ కావాలి’ అని ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల సమావేశంలో ఒకసారి ప్రకటించారు కాని ప్రాణాలు పోయినా సరే ప్రపంచం కావాలన్నది ఇప్పుడు నేతల మనోగతంలా కనిపిస్తోంది. నేతల ప్రపంచంలో రాజకీయాలు తప్ప ఇంకేముంటాయి?


పౌరసత్వ బిల్లు సృష్టించిన హింసాత్మక ఆందోళన వల్లో, లేక ఇతరత్రా ఏమైనా రాజకీయ కారణాలో కానీ గత రెండున్నర నెలలుగా కొంచెం స్తబ్ధంగా ఉన్న హోంమంత్రి అమిత్ షా మళ్లీ రంగంలోకి దిగారు. లాక్‌డౌన్‌ను సడలించే ముందు ప్రధానమంత్రి బదులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆ తర్వాతే క్రమంగా సడలింపులు ప్రారంభమయ్యాయి. తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అమిత్ షా ఇంటర్నెట్ ద్వారా ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీలో ప్రధాని మోదీ తర్వాత ఎంతో కొంత ప్రజల్లో గుర్తింపు ఉన్న నేత అమిత్ షా. పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కాలంలో ఆయన దేశమంతా సుడిగాలిలా తిరిగి వందలాది సభలు, సమావేశాలు నిర్వహించి నంబర్‌ టూగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మోదీకున్న ఆకర్షణ అమిత్ షాకు లేనప్పటికీ మోదీ తర్వాత బాగా తెలిసిన, పార్టీపై పట్టు ఉన్న నేత అమిత్ షా మినహా మరెవరూ లేరు.


మోదీ, షా రంగ ప్రవేశం చేసిన తర్వాత అనర్గళంగా చక్కటి ఉపన్యాసాలు చేసి ఆకట్టుకునే నేతలు బిజెపిలో లేని పరిస్థితి ఒక సహజక్రమంగా ఏర్పడింది. ప్రస్తుత బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాకు తనదైన రాజకీయ స్వరం అంటూ ఉన్నట్లు కనపడదు. ఆయన పూర్తిగా నరేంద్ర మోదీ, అమిత్ షాల మార్గదర్శకత్వానికి అనుగుణంగా నడుచుకుంటున్నట్లే కనపడుతుంది. అందువల్ల ఇవాళ బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తుంటే మళ్లీ పార్టీకి అమిత్ షాయే ‘నంబర్ టూ’ నేతగా ప్రచారానికి అవసరమయ్యారు. తాజాగా నిర్వహించిన జన సంవాద్ ర్యాలీలో అమిత్ షా బీహార్‌లో తమ కూటమి తప్పకుండా మెజారిటీ దక్కిచుకుంటుందని ప్రకటించారు. కరోనా విపత్తులో కష్టాల పాలైన వలస కార్మికులలో అత్యధికులు బిహార్‌కు చెందిన వారే కనుక అమిత్ షా పనిలో పనిగా ఎన్నికల సభలో వారి బాధల పట్ల విచారాన్ని ప్రకటించారు. ఈ విషయంలో మోదీ చేయని పనిని ఆయన చేశారు. కరోనా విషయంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చునని కూడా అమిత్ షా ఒప్పుకున్నారు. అయితేనేం ‘కరోనా వైరస్ బిజెపి ర్యాలీలను ఆపలేదు’ అని ఆయనే ప్రకటించారు.


కరోనాపై పోరు రాజకీయాలవైపు మళ్లింది కాని దేశంలో పరిస్థితి రెండు నెలలకు పూర్వం కంటే ఘోరంగా ఉన్నది. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి ప్రవేశించని చోటు లేకుండా పోయింది. దేశ రక్షణ శాఖ కార్యదర్శి నుంచి ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ వరకు కరోనా వాతపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ అధినేత బలరాం భార్గవ, నీతీఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ తమ సహచరులకు కరోనా వచ్చిందని తేలడంతో క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. ఈ పరిణామాలు సామూహిక వ్యాప్తి జరగడంలేదని ప్రభుత్వం చేస్తున్న వాదనల్ని తిప్పిగొడుతున్నాయి. మొత్తం రక్షణ మంత్రిత్వ శాఖనే శానిటైజ్ చేయాల్సి రాగా ఆర్మీ కేంద్ర కార్యాలయమే ఉద్యోగుల రాకపోకల్ని, ముఖాముఖి సమావేశాల్ని పరిమితం చేసింది. జులై నాటికి ఢిల్లీలో కరోనా కేసులు అయిదున్నర లక్షలకు చేరుకుంటాయని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసులకు తప్ప మరెవరినీ ఆసుపత్రుల్లో చేర్చుకోలేమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించాల్సి వచ్చింది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని అందర్నీ చేర్చుకుంటామని ప్రకటించారు. దేశ రాజధానిలో కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకుని సరైన చర్యలు తీసుకోలేకపోయిన మోదీ సర్కార్ ఇతర రాష్ట్రాలకు ఎలాంటి సహాయ సహకారాలను అందిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.


కరోనా వైరస్ ప్రబలిన కొత్తలో ప్రధాని మోదీ ప్రతి రోజూ ఏదో ఒక సమావేశంలో మనకు కనపడేవారు. ఆయన్ని అనుసరించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హోంమంత్రిత్వ శాఖ అధికారులు కూడా క్రియాశీలకంగా ఉన్నట్లు నటించేవారు. కాని ఇప్పుడు మొత్తం కేంద్ర పాలనా వ్యవస్థలో కరోనాను అరికట్టే విషయంలో తీసుకున్న చర్యల గురించి స్తబ్ధత నెలకొన్నది. పై నుంచి క్రింది వరకూ అందరూ శ్మశాన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. పిఐబి ఇచ్చే పత్రికా ప్రకటనలు తప్ప మరే సమాచారమూ తమ ముఖతా చెప్పడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. అధికారులంతా ముఖం చాటేస్తున్నారు. మే 11 వరకూ ప్రతి రోజూ విలేఖరుల సమావేశాలు నిర్వహించిన కేంద్ర ఆరోగ్య, హోంమంత్రిత్వ శాఖ అధికారులు వారానికోసారి మాట్లాడతామని చెప్పి తప్పించుకున్నారు. ఆ తర్వాత వారానికోసారి కూడా వారు మాట్లాడడం మానేశారు. తొలుత వారితో పాటు విలేఖరుల సమావేశాలకు హాజరయ్యే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ప్రతినిధులు ఏప్రిల్ 24 నుంచే గైర్హాజర్ కావడం ప్రారంభించారు. ఇందుకు ప్రధాన కారణం కరోనా రోజుజుకూ పెరుగుతుండడం. సామూహిక వ్యాప్తిపై విలేఖరులు సంధించే ప్రశ్నలకు వారివద్ద సమాధానం లేకపోవడమేనని తెలిసింది. కరోనా నుంచి గట్టెక్కితే మీకు అద్భుతమైన ఇంటర్వ్యూ ఇస్తానని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తర్వాత ఆ ఆధికారి మాట్లాడడం మానేశారు. 

 

కరోనా వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మే 8న ప్రకటించే నాటికి దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 56 వేలు. ఇవ్వాళ్టికి అంటే జూన్ 9కి ఆ సంఖ్య 2.66 లక్షలు దాటింది. అంటే నెలరోజుల్లోనే (అధికార లెక్కల ప్రకారమే) కరోనా ఎంత తీవ్రంగా పెరుగుతున్నదో అర్థమవుతున్నది. కరోనా సోకిన వారి సంఖ్య తగ్గుముఖం పడుతోందని, అనుకున్నంత వేగంగా రెట్టింపు కావడం లేదని, గ్రాఫ్ పెరగడంలేదని రకరకాల గణాంక వివరాలు చెప్పి తొలుత పబ్లిసిటీకి పూనుకున్నవారు ఇప్పుడు మౌనం పాటించాల్సి వస్తోంది. సోమవారం ఒక్కరోజే దాదాపు పదివేల కేసులు నమోదయ్యాయి. ఇది రికార్డు స్థాయి కాగా ఒకే రోజు 331 మంది కరోనా సోకి మరణించడం కూడా రికార్డు స్థాయే. ముంబైలో కరోనా సోకిన వారి సంఖ్య చైనా లెక్కల్ని దాటిపోయింది. ప్రధానమంత్రి స్వంత రాష్ట్రమైన గుజరాత్ కరోనా కేసుల విషయంలో తమిళనాడును ముందుకు నెట్టి మూడో స్థానం నుంచి నాలుగో స్థానం చేరుకున్నది.


అయితే గుజరాత్‌లో కరోనా సోకిన వారు ఆందోళనకరంగా పెద్ద ఎత్తున మరణిస్తున్నారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక మరణాలు గుజరాత్‌లోనే జరుగుతున్నాయి. నిజానికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పడు చెబుతున్న లెక్కల్లో అత్యధిక భాగం కాకి లెక్కలే. ఆరోగ్య సేతు యాప్ ఉంటే కరోనా వ్యాపించదని మోదీ ప్రభుత్వం చెప్పుకున్నట్లే, ఈ లెక్కలేవీ నిజం కావు. అత్యధికంగా కరోనా సోకిన ప్రజలున్న దేశాల్లో మనం ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాం. అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాత భారత దేశం అయిదో స్థానాన్ని చేరుకుంది. నెల రోజుల క్రితం స్పెయిన్‌లో నమోదవుతున్న కేసుల గురించి ఆందోళన చెందేవారం. ఇప్పుడు మన దేశం స్పెయిన్‌ను కూడా అధిగమించింది. నిజంగా పెద్ద ఎత్తున వ్యాధి నిర్ధారిత పరీక్షలు నిర్వహించి ఉంటే, నిజంగా ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను చిత్త శుద్ధితో కనిపెట్టి శాంపిల్స్ తీసుకుని ఉంటే కరోనా కేసుల విషయంలో ఇవాళ మనదే అగ్రస్థానమయివుండేది. ‘ప్రపంచ దేశాలతో పోలిస్తే మన ప్రధానమంత్రి సమర్థంగా లాక్‌డౌన్‌లు వరుసగా విధించి కరోనాను నియంత్రించారు.’ అని బిజెపి అనుకూల సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారు, నరేంద్రమోదీ తన మూడో కన్ను తెరిచి కరోనా పీచమణిచేందుకు శివతాండవం చేస్తారని భావించిన వారు ఇప్పుడు నిశ్చల సమాధిలో ఉన్నట్లు కనపడుతోంది.


‘మనం పెడల్ మీద నుంచి కాలు తీసే సమయం కాదిది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ఇటీవల హెచ్చరించారు కాని మనం ఎప్పుడో పెడల్ మీద కాలు తీశాం. తొలుత వలస కార్మికులను బస్ డిపోల్లో నింపేశాం. తర్వాత మద్యం షాపుల్లోకి జనాలను తోలాం. ఇప్పుడు ఆరాధనా మందిరాల్లోకి జనాన్ని ప్రవేశపెడుతున్నాం. కరోనా వైరస్ ఉధృతికి మన ప్రజా ఆరోగ్య వ్యవస్థ తట్టుకోలేకపోతున్న విషయం రోజురోజుకూ నిరూపితమవుతున్నది. పడకల విషయంలో కానీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ల విషయంలో కానీ, వెంటిలేటర్ల విషయంలో కానీ మన వనరులు చాలా చాలా పరిమితం. ఆరోగ్య సేవల విషయంలో మన ప్రభుత్వాలు పెట్టే ఖర్చు జీడీపీలో ఒక శాతం కంటే తక్కువే. అతి చిన్న దేశమైన మాల్దీవులు ఆరోగ్య సంరక్షణకు జీడీపీలో 9.4 శాతం ఖర్చు పెడుతుంది. ఇంత విలయంలోనూ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థల్ని మెరుగుపరుస్తామని కానీ, నాణ్యతతో కూడిన వైద్య సేవల్ని ప్రజలకు అందిస్తామని కానీ మన నేతలు ఇప్పటివరకూ ప్రకటించలేదు! ఏ ప్యాకేజీలోనూ ఆరోగ్య సేవల గురించి నిర్దిష్టమైన, స్పష్టమైన ప్రణాళికలను వెల్లడించలేదు. మృత్యువాకిలిలో ఉన్నప్పటికీ రాజకీయాలను మరిచిపోకపోవడం, ప్రజల శ్రేయస్సు గురించి చిత్త శుద్ధి చూపకపోవడం మన దేశంలోనే జరుగుతుంది.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2020-06-10T05:46:14+05:30 IST