ఊరూ వాడా కదిలింది!

ABN , First Publish Date - 2021-11-07T07:22:45+05:30 IST

ఊరూవాడా కదిలింది. జై అమరావతి అని నినదించింది. మీకు మేమున్నామంటూ రోడ్డు వెంట నిలిచి పూలజల్లు కురిపిస్తూ పాదయాత్ర చేస్తున్న అమరావతి పరిరక్షణ సమితి సభ్యులకు మద్దతు పలికింది.

ఊరూ వాడా కదిలింది!
చిననందిపాడు వద్ద సాగుతున్న పాదయాత్ర

మహా పాదయాత్రకు  పెద్దఎత్తున  మద్దతు పలికిన ప్రజలు 

మోహరించిన పోలీసులు, గూఢచార శాఖ

కట్టడి వ్యూహంలో భాగంగా వీడియో చిత్రీకరణ 

మలిరోజు కోసం పర్చూరు  చేరుకుంటున్న పోలీసు బలగాలు 

ఇంకోవైపు అధికారపార్టీ ర్యాలీలకు మాత్రం పచ్చజెండా 

అక్కడ కనిపించని ట్రాఫిక్‌, కొవిడ్‌ నిబంధనలు

ఊరూవాడా కదిలింది. జై అమరావతి అని నినదించింది. మీకు మేమున్నామంటూ రోడ్డు వెంట నిలిచి పూలజల్లు కురిపిస్తూ పాదయాత్ర చేస్తున్న అమరావతి పరిరక్షణ సమితి సభ్యులకు మద్దతు పలికింది. జిల్లాలోకి ప్రవేశించిన తొలిరోజే లభించిన అనూహ్య స్పందనతో పాదయాత్ర చేస్తున్న 157మందితో పాటు, వారికి చేదోడువాదోడుగా వచ్చిన వారంతా పులకించిపోయారు. మద్దతు తెలుపుతున్న వారికి చేతులతో నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ప్రజాప్రతినిధులు, నేతలు, ఆయా వర్గాలకు చెందిన ప్రముఖులు కలిసి రావటంతో పాటు ఎవరికి తోచిన విరాళం వారు అందజేశారు. మరోవైపు పోలీసు యంత్రాంగం భారీగా మోహరించింది.  వారికి అవసరమైన వీడియోల చిత్రీకరణ కోసం అడపాదడపా వారే పరిస్థితులను సృష్టించారు. నిర్వాహ కులు కానీ, మద్దతు తెలిపిన వారు కానీ ఎక్కడా ప్రసంగించకుండా జై అమరావతి అనే నినాదానికే పరిమితమైనప్పటికీ లౌడ్‌స్పీకర్ల సమస్యను తెరపైకి తెచ్చారు. మద్దతు తెలిపేందుకు నాయకులు రావడాన్ని లేవనెత్తుతూ పాదయాత్ర కట్టడి వ్యూహంలో ముందడుగు వేశారు. ఆగమేఘాలపై పరిరక్షణ  సమితికి  నోటీసులు జారీ చేశారు. ఆదివారం ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సూచనలు అందుతాయోనన్న అనుమానంతో రాత్రికి రాత్రే పోలీసులను భారీగా పర్చూరుకి తరలించేశారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ తుళ్లూరు నుంచి తిరుమల వరకు ప్రారంభమైన మహా పాదయాత్ర శనివారం మధ్యాహ్నం జిల్లాలోకి ప్రవేశించింది. అమరావతి పరిరక్షణ  సమితి ఆధ్వర్యంలో న్యాయస్థానం నిబంధనలకు అనుగుణంగా ఆరంభమైన పాదయాత్రకు జిల్లా ప్రారంభంలో ఘనస్వాగతం లభించింది. అధికార వైసీపీ మినహా ఇతర ముఖ్యపార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘాల వారు ఎదురొచ్చి స్వాగతం పలికారు. కొంతసేపు ముందుభాగాన నడిచి మద్దతు తెలిపారు. అయితే దారిపొడవునా ఆయా ప్రజాసంఘాలు, గ్రామాల నుం చి కదిలొచ్చిన ప్రజలు మా త్రం మీకు అండగా మే మున్నామంటూ పాద యాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర అగ్రభాగాన ఉన్న తిరుమల వెంకటేశ్వరస్వామి నిలువెత్తు విగ్రహంతో సాగుతున్న రథం ముందు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టి హారతులిచ్చి స్వామీ అమరావతిని కాపాడండంటూ వేడుకున్నారు. ఈ  పరిస్థితి జిల్లాలో చిననందిపాడు వద్ద ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం 6గంటలకు పర్చూరులోని కల్యాణ మండపం వరకూ కొనసాగింది. 


పర్చూరులో భారీ స్వాగతం

 సాయంత్రానికి పర్చూరు చేరిన పాదయాత్ర బృందానికి వై జంక్షన్‌ నుంచి ఆరంభమైన స్వాగత కార్యక్రమం బొమ్మల సెంటర్‌కి వచ్చేసరికి రెట్టింపైంది. ఈ స్వాగత కార్యక్రమంలో యద్దనపూడి మండలం నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు పాల్గొనటం కనిపించింది. పర్చూరులో అయితే ఎక్కడ చూసినా ఈ అంశంపైనే చర్చ సాగింది. పర్చూరు, నాగులపాలెం నుంచి కూడా ప్రజలు, ముఖ్యంగా మహిళలు రోడ్డుపైకి వచ్చి పాదయాత్రను తిలకించారు. అయితే న్యాయస్థానం ఉత్తర్వులకు అనుగుణంగా చివర్లో పాదయాత్ర వేగంగా వెళ్లి 6గంటలకే కొల్లావారి కల్యాణ మండపానికి  చేరిపోయింది.


జన నీరాజనం

జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించినప్పటి నుంచి మధ్యాహ్నం భోజనానికి ఆగిన అడుసుమల్లి శివారు ప్రాంతం వరకు పాదయాత్రీకులకు స్వాగతం పలికేందుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలంతా రావటం కనిపించింది. పర్చూరుకి ఉత్తరం వైపున ఉన్న చెరుకూరు, వీరన్నపాలెంతో పాటు అనేక గ్రామాల వారు స్వచ్ఛందంగా తరలివచ్చి స్వాగతం పలికారు. పలువురు మహిళలు, వృద్ధులు, చిన్నారులైతే అల్లంత దూరంలోనే ఉండి చేతులూపుతూ సంఘీభావం ప్రకటించటం కనిపించింది. అడుసుమల్లిలో కూడా ఆసక్తికరమైన పరిస్థితులు కనిపించాయి.  వైసీపీ పర్చూరు ఇన్‌చార్జ్‌ స్వగ్రామమైన అడుసుమల్లిలో రాజకీయాలకతీతంగా ముందుకొచ్చిన వారంతా కలిసి భారీఏర్పాట్లు చేయటం కనిపించింది. రూ.4లక్షల వరకు వ్యయమయ్యే ఆహార సామగ్రిని పాదయాత్ర చేసేవారికి సమకూర్చారు.  విచిత్రమేమిటంటే ఈ కార్యక్రమాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్న వైసీపీకి చెందిన నేతలు లేక ఆ జెండాలు కట్టిన గృహాల్లోంచి కూడా ప్రజలు బయటకొచ్చి కార్యక్రమాన్ని తిలకించటం కనిపించింది. 


 ప్రసంగాలకు దూరంగా.. 

ఎక్కడా అటు పరిరక్షణ సమితి నాయకులు కానీ, మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా రంగాల ప్రముఖులు కానీ ప్రసంగించిన దాఖలాలు లేవు. హ్యాండ్‌ మైకులో నిర్వాహకులు ఇచ్చే జై అమరావతి, జైజై అమరావతి అన్న నినాదాలకు అనుగుణ ంగా చూపరులు స్పందించటం తప్ప ఎక్కడా ప్రసంగాలకు వేదికలు ఏర్పాటు చేయటం కానీ, ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వటం కానీ జరగలేదు. 


చేయూతనిచ్చిన ఏలూరి 

విపక్ష టీడీపీ నాయకులు స్వాగతం పలికి తమ మద్దతు తెలిపి వెళ్లిపోవటానికే పరిమితమయ్యారు. అలాగే ఇతర పార్టీల నాయకులు అందుకే పరిమితమయ్యారు. అయితే సీపీఐ, సీపీఎం, జనసంఘ్‌, బీజేపీ లాంటి పార్టీల వారు వారి జెండాలను కూడా ప్రదర్శించారు. తెలుగుదేశానికి చెందిన నేతలు మాత్రం మెడలో అమరావతి జేఏసీ ఇచ్చిన కండువాలతోనే వచ్చి మద్దతు తెలిపి వెళ్లిపోయారు.  కమ్యూనిస్టులు, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాత్రం ఎక్కువసేపు పాదయాత్రికులతో కలిసి ముందుభాగాన నడిచారు. జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిరక్షణ సమితి జేఏసీ బృందం అడుసుమల్లి వద్ద ప్రత్యేకంగా స్వాగతం పలికి వారికి అండగా ముందుకు సాగింది. ఇక తెలం గాణ లోని కోదాడ, గుంటూరు జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట తదితర ప్రాంతాల నుంచి కూడా కొందరు వచ్చి పాదయాత్రకు మద్దతు తెలిపారు. నరసరావుపేట నుంచి డాక్టరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 20మందికిపైగా డాక్టర్ల బృందంగా వచ్చి సంఘీభావం తెలిపింది. తెలంగాణలోని కోదాడ నుంచి వచ్చిన ఒక బృందం వారు మద్దతు తెలపటంతో పాటు రూ.లక్ష విరాళాన్ని కూడా ఇచ్చి వెళ్లారు. హేతువాదసంఘం అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య కూడా వచ్చి మద్దతుని ప్రకటించారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి మొత్తం కార్యక్రమం సజావుగా జరిగేందుకు రూపకల్పన చేయటంతో పాటు అన్నివిధాలా వారికి అండదండగా నిలిచారు. ఆయన పిలుపుమేరకు జిల్లాలోని పార్టీ ముఖ్య నాయకులంతా కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.


మోహరించిన పోలీసులు 

ఆరంభం నుంచి కార్యక్రమం వద్ద పోలీసులు మోహరించారు. జిల్లాలో ఉన్న స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ అధికారులంతా అక్కడే ఉన్నారు. వారికి తోడు ఏఎస్పీ రవిచంద్ర పర్యవేక్షణలో చీరాల డీఎస్పీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. అణువణువూ వీడియో చిత్రీకరించటం, ఫొటోలు తీయటానికి ప్రాధాన్యం ఇచ్చారు. కొందరు సివిల్‌ డ్రస్‌లలో ఉండి వ్యవహారాన్ని నిర్వహించారు. వచ్చిన వారి పేర్లను గుర్తించి నమోదు చేసి ఉన్నతాధికారులకు తెలియజేయటంలో వారంతా పోటీపడ్డారంటే అతిశయోక్తి కాదు. అయితే మధ్యాహ్నం వరకు ఎక్కడా నిర్వాహకులు కానీ, ప్రజలను కానీ ధూషించటమో, బెదిరించటమో చేయలేదు. సాయంత్రానికి మాత్రం పర్చూరు పరిసరాల్లో రోడ్డుపై వాహనాలను అడ్డుపెట్టి ట్రాఫిక్‌ స్తంభించేటట్లు చేసి ఆ సన్నివేశాలను వీడియోలు, ఫొటోలు తీశారు. మధ్యాహ్నం వరకూ ప్రశాంతంగా ఉన్న పోలీసులు సాయంత్రం ఒక్కసారిగా దూకుడు పెంచారు. 


నోటీసుల జారీతో హెచ్చరిక 

నిర్వాహకులకు శనివారం సాయంత్రానికి  నోటీసులు ఇవ్వటంతో పాదయాత్ర నిర్వహణ  కట్టడికి తాము సిద్ధంగా ఉన్నామనే హెచ్చరిక జారీ చేశారు. ఒకవైపు నిబంధనలు అతిక్రమించారంటూ హెచ్చరించటమే గాక మద్దతు తెలిపేందుకు వచ్చిన వాహనాలకు భారీ జరిమానాలు విధించారు. ఆ మేరకు శనివారం రాత్రికే పలువురికి జరిమానా విధిస్తూ మెసేజ్‌లు వచ్చినట్లు తెలిసింది. అదంతా మున్ముందు వాహనాలలో తరలి వచ్చేవారిని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నంలో భాగమని భావిస్తున్నారు. అమరావతి పరిరక్షణ  సమితి నాయకులు కూడా పకడ్బందీ ఏర్పాట్లతోనే ఉన్నారు.  పాదయాత్రలో పాల్గొనే 157 మందికి సంబంధించి చుట్టూ తాడుతో బారికేడ్లు ఏర్పాటు చేయటంతోపాటు అనునిత్యం వారు నిర్వహించే పాదయాత్రను వీడియో రికార్డు కూడా చేశారు. దూరంగా ఉండి పూలు జల్లడమో, చేతులూపుతూ మద్దతు తెలపటమో తప్ప వారిని కలిసే అవకాశం వేరెవరికీ ఇవ్వలేదు. దీంతో పోలీసులు పాదయాత్రలో పాల్గొన్న బృందాన్ని వదిలేసి చూసేందుకు, మద్దతు తెలిపేందుకు వచ్చిన వారిపై కత్తిదూసి అదే సాకుగా పాదయా త్రను అడ్డుకునే కుతంత్రంలో భాగంగా నోటీసుల వ్యవహారం సాగినట్లు భావిస్తున్నారు. దీనికి తోడు శనివారం రాత్రికి జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల నుంచి పోలీసు బలగాలను పర్చూరుకు తరలించారు. ఒకవైపు పోలీసుల నోటీసులకు న్యాయవాదుల సమక్షంలో ఏడు రోజుల్లో సమాధానం ఇస్తామంటూ పరిరక్షణ  సమితి నాయకులు లిఖితపూర్వకంగా తెలియజేసినప్పటికీ అదనపు పోలీసు బలగాల రాకతో జిల్లాలో మలిరోజు పాదయాత్ర సందర్భంగా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది. రాత్రికి పాదయాత్రలో ఉన్న దేవుడి వాహనం నిబంధనలకు విరుద్ధమని పోలీసులు బలవంతంగా సీజ్‌ చేసినట్లు తెలిసింది. మరోవైపు అధికార పార్టీ నేతల ర్యాలీలకు పచ్చ జెండా ఊపూరు. అక్కడ ట్రాఫిక్‌, కొవిడ్‌ నిబంధనలు మాత్రం కనిపించలేదు. 


పాదయాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు 

 అమరావతి రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 7వతేదీ ఉదయం పర్చూరులో బయల్దేరి మధ్యాహ్నం భోజనానికి నూతలపాడుకు, రాత్రికి దగ్గుబాడు చేరేలా రూపొందించారు. ప్రస్తుతం ఆ షెడ్యూల్‌లో మార్పు చేశారు. పర్చూరు నుంచి ఆదివారం ఉదయం బయల్దేరి మధ్యాహ్న భోజనం వంకాయలపాడు వద్ద చేసి రాత్రికి ఇంకొల్లుకు యాత్ర బృందం చేరనుంది. సోమవారం పాదయాత్ర ఆపి ఇంకొల్లులోనే విశ్రాంతి తీసుకొని తిరిగి మంగళవారం కొనసాగించనున్నారు. 










Updated Date - 2021-11-07T07:22:45+05:30 IST