ప్రకాశం నేతల పనితీరు ఆదర్శనీయం

ABN , First Publish Date - 2021-10-09T06:15:06+05:30 IST

ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల పనితీరు ఆదర్శనీయమని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొనియాడారు.

ప్రకాశం నేతల పనితీరు ఆదర్శనీయం
టీడీపీలో చేరిన బీఎంసీ తదితరులద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు, పక్కన ఉగ్ర, ఎమ్మెల్యేలు స్వామి, సాంబశివరావు

కనిగిరికి కాబోయే ఎమ్మెల్యే  డాక్టర్‌ ఉగ్ర

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

వైసీపీ నుంచి బీఎంసీతోపాటు పలువురు టీడీపీలో చేరిక 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల పనితీరు ఆదర్శనీయమని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే కనిగిరిలో డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఎమ్మెల్యే కావటం ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కనిగిరి నియోజకవర్గం పామూరు నుంచి వెళ్లిన వైసీపీ నేత బి.మాల్యాద్రి చౌదరితోపాటు అన్ని గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మండలం నుంచి సుమారు 500 మంది అక్కడికి తరలిపోగా ఆయా గ్రామాలకు చెందిన 50మందికిపైగా నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులకు చంద్రబాబునాయుడు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు సమన్వ యంతో పనిచేస్తున్న తీరు అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంతో పాటు, పార్టీ నిర్మాణ వ్యవహారాల్లోనూ వారు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారని తెలిపారు. కనిగిరిలో డాక్టరు ఉగ్ర పార్టీ కేడర్‌కు అండగా ముందుకు నడుస్తున్నారన్నారు. ప్రభుత్వ పాలనపై అసంతృప్తితో ఉన్న వారు టీడీపీ వైపు దృష్టిసారించారనేందుకు కనిగిరి నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో టీడీపీలోకి వస్తున్న వైసీపీ శ్రేణులే నిదర్శనమన్నారు. కనిగిరి నుంచి డాక్టరు ఉగ్రనరసింహారెడ్డే వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారని, ఆయనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. పామూరు మండలంలో వివిధ రూపాలలో ప్రజాసంబంధాలు ఉన్న బీఎంసీ, అతని ఆధ్వర్యంలో ఆయా గ్రామాల నుంచి వచ్చిన కిందిస్థాయి నాయకులు పార్టీలో చేరగా సుమారు 500మంది పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో ముస్లింలు, బలహీనవర్గాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఉగ్రతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, స్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, కందుల నారాయణ రెడ్డి, ఎం.అశోక్‌రెడ్డి, దర్శి ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ కూడా పాల్గొన్నారు. వారంతా టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులకు స్వాగతం పలికారు. 


Updated Date - 2021-10-09T06:15:06+05:30 IST