Ukraine-returned medical students: ఉక్రెయిన్‌ విద్యార్ధుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ.. తాజా పరిణామం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-26T18:56:03+05:30 IST

ఉక్రెయిన్‌ విద్యార్ధుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన విద్యార్ధులు తమ వైద్య విద్యను దేశంలో కొనసాగించే అంశంపై..

Ukraine-returned medical students: ఉక్రెయిన్‌ విద్యార్ధుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ.. తాజా పరిణామం ఏంటంటే..

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ విద్యార్ధుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన విద్యార్ధులు తమ వైద్య విద్యను దేశంలో కొనసాగించే అంశంపై దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ విక్రంనాథ్‌ ఈ అంశానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టారు. కేంద్రం, జాతీయ మెడికల్‌ కమిషన్‌ సహా 4 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 5లోపు సమాధానం చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.



ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. రష్యాతో యుద్ధం కారణంగా అర్ధంతరంగా భారత్‌కు వచ్చిన విద్యార్థులను ఆ దేశం మళ్లీ రమ్మని పిలుస్తోంది. తదుపరి సెమిస్టర్‌ క్లాసులను సెపెంబరు 1న ప్రారంభించనున్నామని మెడికల్‌ యూనివర్సిటీలు తెలిపాయి. అయితే తరగతులకు హాజరు విషయంలో పలు ఆప్షన్లు కూడా ఇచ్చాయి. రిస్క్‌కు సిద్ధపడి క్యాంపస్‌కు రావడం, తాత్కాలికంగా ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కావడం, ఇతర దేశాల్లోని వర్సిటీల్లో చేరడం అనే ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలని పేర్కొంది. అయితే, రష్యా బాంబుదాడుల్లో సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్న యూనివర్సిటీలు మాత్రం చివరి ఆప్షన్‌నే ప్రధానంగా సూచించాయి.



ఇందుకోసం యూరప్‌లోని జార్జియా, పోలండ్‌ వంటి దేశాల్లోని మెడికల్‌ యూనివర్సిటీలతో అవగాహన కుదుర్చుకున్నట్లు తెలిపాయి. కాగా, భారత విద్యార్థులకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా తాము జాతీయ వైద్య మండలి(ఎన్‌సీఎం)కి, ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయానికి లేఖ రాశామని, కానీ.. తమకు తిరిగి ఎటువంటి సమాధానం రాలేదని పలు యూనివర్సిటీలు తెలిపాయి. ఈ మేరకు ఆయా విద్యార్థులకు సమాచారం అందించాయి.

Updated Date - 2022-08-26T18:56:03+05:30 IST