Advertisement

పేట్రేగుతున్న మత్స్య మాఫియా

Jan 24 2021 @ 21:42PM
చీమలతిప్ప వద్ద ఆంధ్ర జాలర్లు ఏర్పాటు చేసుకున్న ఆవాసాలు

నాగర్‌కర్నూల్‌(ఆంధ్రజ్యోతి)/కొల్లాపూర్‌ రూరల్‌, జనవరి 24: కృష్ణా నదిలో మత్స్య సంపద మాయమవుతోంది. మత్స్య మాఫి యా ఆగడాలు రోజు రోజుకు పెరిగి పో తున్నాయి. మత్స్య మాఫియాకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో మత్స్య సంపద పునరుత్పత్తి ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. 20 సంవత్సరాల నుంచి కృష్ణానదిపై యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతోంది. చేపల వేటను జీవనాధారంగా చేసుకొని బతుకుతున్న సాంప్రదాయ మత్స్యకారులకు గడ్డుం కాలం నెలకొంది. తాజాగా తెలంగాణ నుంచి ఏటి ద్వారా చేప పిల్లలను రాయలసీమకు తరలించి అక్కడి నుంచి వాహనంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా అక్కడి స్థానిక ఎస్‌ఐ ఏపీ శ్రీనివాసులు అడ్డుకున్నారు. వాహనం వదలి పెట్టాలని రాజకీయ ఒత్తిడి వచ్చినా ఎస్‌ఐ మాత్రం సీజ్‌ చేయడంతో పాటు కేసు నమోదు చేసి, చేప పిల్లలను స్వాఽధీనం చేసుకున్నారు. ఎండు చేపలో రాజకీయ, ఆర్థిక లాభాలు ఇమిడి ఉన్నాయనే విషయం అర్థం అవుతోంది. స్వయంగా జిల్లా కలెక్టర్‌ అచ్చంపేట, కొల్లాపూర్‌ ఆర్డీవోల ద్వారా అలివి వలలపై దాడులు చేయించి, వాటి ద్వారా చేపల వేటను నివారించాలని చెప్పినా ఆ కోశాన ఎవరూ పాటించకపోవడం గమనార్హం. 


కుదేలవుతున్న మత్స్యకారులు

ప్రభుత్వం మత్స్య సంపదను పెంచేందుకు కృషి చేస్తుంటే మరో పక్క మత్స్య మాఫియా చేప పిల్లలను వదలి నెలలు గడవక ముందే మత్స్య సంపదను అలివి వలలతో కొల్లగొడుతున్నారు. అలివి వలలతో ఇంచు సైజు కంటే తక్కువగా ఉన్న చేప పిల్లలను సైతం బయటకు తీస్తున్నారు. పెద్ద సైజులో ఉన్న చేప పిల్లల కంటే చిన్న సైజులో ఉన్న చేప పిలల్లకు మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో చేపల వేట మత్స్య మాఫియా చేతుల్లోకి వెళ్లింది. సహజ సంపద అయిన కృష్ణానది తీరం సమీప గ్రామాల్లోని ఒక్కరు, ఇద్దరిని లోబర్చుకొని కృష్ణానదిలో హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు వెచ్చించి మత్స్య మాఫియా హద్దులను కొనుగోలు చేసి చిన్న సైజు చేప పిల్లలను అలివి వలల ద్వారా పడుతున్నారు. దీంతో  వేలాది సాంప్రదాయ మత్స్యకారుల కుటుంబాలు చేపల వేటకు పోలేక పస్తులు ఉంటున్నారు. అమరగిరి ప్రాంతంలోనే 20కి పైగా అలవి వలలు ఉన్నాయి. అంతే కాదు అక్కడ మత్స్య మాఫియా వారి అనుచర వర్గం చేపల వేటకు వెళ్లే చెంచులపై బెదిరింపులకు దిగుతున్నారు. చేపల వేట తప్ప మరో వృతి తెలియని చెంచులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని లోతట్టు ఫారెస్టు లోకి వెళ్లి రోజుల తరబడి ఉంటున్నారు.  స్థానిక, ఉన్నత అధికారులకు చెంచులు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదంటే పరిస్థితి అర్థం అవుతోంది. 


ఏరు దాటుతున్న అక్రమ దందా

కృష్ణానది తీరం వెంట మత్స్య మాఫియా అలివి వలలను దించింది. గుమ్మడం, జటప్రోల్‌, మల్లేశ్వరం, మంచాలకట్ట, సోమశిల, అమరగిరి, చీమలతిప్ప, జానాల గుడెం, సంగమేశ్వరం తదితర పాంతాల్లో అలివి వలల ద్వారా సన్న చేప పిల్లలు పడుతున్నారు. పట్టిన చేప పిల్లలను రాయలసీమ వైపు తరలిస్తున్నారు.  ఒక్క అమరగిరి ప్రాంతంలోనే 30కి పైగ అలివి వలలు ఉన్నాయి. ప్రతి ఒక వల ద్వారా రెండు పట్టులు తీస్తున్నారు. ప్రతి పట్టుకు రూ.20 లక్షల నుంచి, 25 లక్షల వరకు షికారి జరుగుతోంది. టన్నుల కొద్ది చేప పిల్లలు బయటకు తీస్తున్నారు. చేప పిల్లలను ఎండబెట్టి బోట్ల ద్వారా రాయలసీమలోని తీరం వెంట గ్రామాలకు తరలించించి అక్కడి నుంచి వాహనాల్లో వైజాగ్‌, విజయవాడ, హైదరాబాద్‌ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్య మాఫియా వైజాగ్‌ నుంచి జాలర్లను రప్పించి  స్థానిక రాజకీయ పలుకుబడితో కృష్ణానదిని కొల్లగొడుతున్నారు. రెండు రోజుల క్రితం రాజకీయ ఒత్తిళ్లు లెక్కచేయకుండా ముచ్చుమర్రి ఎస్‌ఐ చేప పిల్లలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకొవడంతో పాటు సీజ్‌ చేయడం జరిగింది.  ఇదిలా ఉంటే, రేంజర్‌ స్థాయిలో మత్స్య మాఫియాకు, దళారులకు ఆర్థిక, మద్యపాన సంబంధాలు ఉండటంతోనే అక్రమ దందా సాగుతోందని చెంచులు ఆరోపిస్తున్నారు. 


 అలివి వలల ద్వారా చేపల వేట నిషేధం 

కృష్ణానదిలో నిషేధిత అలివి వలల ద్వారా చేపల వేట కొనసాగిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవు. అలివి వలలపై ఫిర్యాదులు వస్తే కచ్చితంగా దాడులు చేస్తాం. మత్స్య సంపద కాపాడాల్సిన బాధ్యత అందరిది. 

- ఎస్‌ఐ మురళీ గౌడ్‌ 


అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాం

తెలంగాణ ప్రాంతంలో అలివి వలల ద్వారా చేప పిల్లలను పట్టి అక్రమంగా ఏరు దాటివస్తున్న వారిపై దృష్టి పెట్టడం జరిగింది. మత్స్య సంపదను కొల్లగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 

- ఏపీ శ్రీనివాసులు,  ఎస్‌ఐ, ముచ్చుమర్రి, పడిగ్యాల మండలం

Follow Us on:
Advertisement