తొమ్మిదేళ్లలో ఔషధ పరిశ్రమ మూడింతలు

ABN , First Publish Date - 2021-07-25T06:07:29+05:30 IST

దేశీయ ఔషధ పరిశ్రమ 2030 నాటికి 13,000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.9.36 లక్షల కోట్లు)కు చేరగలదని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ కే సతీశ్‌ రెడ్డి అన్నారు.

తొమ్మిదేళ్లలో ఔషధ పరిశ్రమ మూడింతలు

  • 2030 నాటికి రూ.9.36 లక్షల కోట్లకు  
  • డాక్టర్‌ రెడ్డీస్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి అంచనా


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయ ఔషధ పరిశ్రమ 2030 నాటికి 13,000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.9.36 లక్షల కోట్లు)కు చేరగలదని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ కే సతీశ్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఔషధ పరిశ్రమ విలువ 4,200 కోట్ల డాలర్లు ఉంది. ఇందులో సగం దేశీయ అమ్మకాలు కాగా.. మిగిలిన సగం ఎగుమతులు. 2030 నాటికి దాదాపు మూడింతలై 120-130 బిలియన్‌ డాలర్లకు చేరగలదని తెలిపారు. నైపర్‌, హైదరాబాద్‌ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైపర్‌), హైదరాబాద్‌ గవర్నర్స్‌ బోర్డుకు సతీశ్‌ రెడ్డి చైర్మన్‌. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ విధానాలు, సంస్కరణలు, ప్రోత్సాహకాలు పరిశ్రమను ముందుకు నడిపించనున్నాయని.. వినూత్నత దిశగా పరిశ్రమ అడుగులు వేయడానికి దోహదపడుతున్నాయని వివరించారు. కరోనా వైరస్‌ రెండో దశ సమయంలో దేశీయ ఔషధ పరిశ్రమ నిరంతరాయంగా పని చేసి ప్రాణ రక్షక ఔషధాలను అందించటంతో పాటు వెంటనే స్పందించి ఉత్పతిని పెంచాయని అన్నారు. ప్రభుత్వ జోక్యం, ప్రోత్సాహం ఔషధాల ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో దేశీయ ఔషధ పరిశ్రమ.. ఔషధాల పరిశోధన, అభివృద్ధి, వినూత్న ఔషఽధాల ఉత్పత్తిపై తన సామర్థ్యాలను పెంచుకోనుందని సతీశ్‌ రెడ్డి అన్నారు. ఇప్పటికే పరిశ్రమకు ఇటువంటి సామర్థ్యాలు ఉన్నప్పటికీ.. అవి మరింత బలోపేతం అవుతాయని, భారత్‌లోని ప్రత్యేక  వ్యాధులకు పరిశ్రమ ఔషధాలను అభివృద్ధి చేయగలదని చెప్పారు.


డిజిటల్‌తోపెద్ద మార్పు..

మొత్తం హెల్త్‌కేర్‌ రంగంలోనే డిజిటల్‌ టెక్నాలజీలు భారీ మార్పును తీసుకువస్తున్నాయి. రోగుల చికిత్స, ఔషధాల పంపిణీ అన్నీ మారుతున్నాయి. తయారీలోనూ ఆటోమేషన్‌ ప్రధాన భూమిక పోషిస్తోందని సతీశ్‌ రెడ్డి అన్నారు.

Updated Date - 2021-07-25T06:07:29+05:30 IST