మౌనాన్ని ధ్వంసం చేసే కవి

Jul 26 2021 @ 00:59AM

ఆ  నది ఒక్కోసారి మౌనంగా ప్రవహిస్తుంటుంది, మరో సారి పరవళ్లు తొక్కుతుంది. ఒక సారి పసిపిల్లల పాదాలు తడుముతుంది. ఇంకొక సారి నెత్తుటిని మోసుకుంటూ వస్తుంది. పచ్చని చేలను తడిమే ఆ నది నీళ్లలో ఎన్నో జీవన గాథలు ఉన్నాయి. ఎన్నో త్యాగాల గీతాలూ ఉన్నాయి. ఎన్నో పోరాటాల నినాదాల ప్రతిధ్వనులూ ఉన్నాయి. ఆ నది మానేరు. ఆ నది గలగలల్లో ఒక గొంతు కొన్ని దశాబ్దాలుగా వినపడుతోంది. అది వేనవేల గొంతుల్ని ఇముడ్చుకుని ఆ నీరు తడిపిన మట్టి వాసనను మనకు అందిస్తుంది. ఆ గొంతు ఎవరిదో కాదు మన జూకంటి జగన్నాథంది.


‘‘ఎవరి మట్టి మీద వాళ్లు స్మృతి గీతం ఆలపించడమంటే ఎవరి అన్నం మెతుకుపైన వాళ్ల ఆత్మను ఆవిష్కరించుకోవడం’’ అని నినదించే జూకంటి తనతో పాటు చరిత్రను మోసుకు వచ్చాడు.  అది ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసిన చరిత్ర. ఎందరి బతుకుల్నో ప్రశార్థకం చేసిన చరిత్ర. కాని ఈ రగిలిన మంటల్లో, ఈ ప్రశ్నల్లో కొన్ని అస్తిత్వ సంఘర్షణలు ఉన్నాయి. కొన్ని రైతాంగ పోరాటాలు ఉన్నాయి. కొన్ని దురాక్రమణ పర్వాలు ఉన్నాయి. కొన్ని ఆదీవాసీ ప్రతిఘటనలు ఉన్నాయి, కొన్ని ఆత్మగౌరవ ప్రతీకలూ ఉన్నాయి. కొన్ని ఎమర్జెన్సీ చీకటి రోజుల దుర్మార్గాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య దగ్ధమైన జీవితాలు నెరవేర్చుకోలేని స్వప్నాలూ ఉన్నాయి. మానేరు చుట్టూ తిరిగిన జీవితాలు అవి కేవలం ప్రాంతీయ జీవితాలు కాదు. అవి తెలంగాణలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో ప్రతి నది చుట్టూ, పరిభ్రమించిన జీవితాలు.


‘‘సమూహం కాని వాడు శాపగ్రస్తుడే. ప్రపంచం కాని ప్రతి వాడు నిలవనీరే’’ అన్న నిశ్చితాభిప్రాయం కల జూకంటి కవిత్వం చదివితే ప్రజల జీవన సంఘర్షణలో మమేకమైన ప్రతి గొప్ప కవి ఇలాగే రాస్తారా అనిపిస్తుంది. ఆయన సిరిసిల్ల కవి కాదు. సిరిసిల్ల నుంచి ఆయన వినిపించింది ప్రాంతీయ గొంతుక కాదు. అది చరిత్ర నిర్మాతల గొంతు. అది జైత్రయాత్రల స్వరం. ప్రజల పద ధ్వనుల్లో జనించిన గానం. ప్రపంచీకరణ బలిపీఠంపై సిరిసిల్లను చూసిన విలాపం.


నువ్వుల నుంచి నూనె తీసే విద్య తెలిసిన జూకంటి, పెరిగిన నాగరికత కనపడకుండా చేసిన గుండె గాయాలకు కులవృత్తే ఓదార్పుగా జీవించిన జూకంటి, తల్లి కట్టిన ఇస్తరాకుల కట్టలను నెత్తిమీద పెట్టుకుని ఇల్లిల్లూ తిరిగి అమ్మిన జూకంటి, గానుగకూ, కనెంకూ మధ్య అసిరి నడిపి తమ్ముని వేలు నలిగి రక్తంతో తడిసిన నువ్వుల పిండిని మరిచిపోని జూకంటి ప్రజల జీవిత సంఘర్షణను తన జీవిత సంఘర్షణతో మమేకం చేసి కవిత్వం అనే తైలంతో అక్షర దీపాల్ని వెలిగిస్తున్న ప్రజా కవి. తెలంగాణలో చరిత్ర అనేక మలుపులు తిరుగుతున్నా, ఆరున్నర దశాబ్దాలుగా ప్రతి మలుపులోనూ ఉండి, ఆ మలుపుకు కేంద్ర బిందువైన నేలను వదులుకోకుండా అక్కడి నుంచి ప్రపంచాన్ని దర్శిస్తున్న ఒక మహావృక్షం జూకంటి జగన్నాథం.


హరికథలు, పటం కథలు, భాగోతాలు, టీచర్ల పాఠాలు, దోస్తానాలు, గానుగ తిప్పుళ్లు, కూలి పనులు, బావులు తవ్వుడులు, వరికోతలు, కాల్వలు తీయడాలనుంచి వచ్చిన కవి మాత్రమే కాదు; కళ్ల ముందు ఊళ్లు ఖాళీ కావడాలు, మనుషులు శవాలుగా మారడాలు, దుబాయ్‌కో బొంబాయికో పారిపోయిన జీవితాలు, మార్కెట్‌ సృష్టించిన భీభత్సాల నుంచి వచ్చిన కవి కూడా ఆయన. కాలేజీ మెట్లను ఎక్కని ఎండకాలం చదువైతేనేం, ఆయన సిరిసిల్ల గాంధీ చౌక్‌లో బెదిరిన మనుషుల ముఖాలపై లిపిని కూడబలుక్కునే కవి. మానేరు వంతెనైనప్పుడు ఊరంతా సిరిసిల్లకు బతుకమ్మలా కదిలె అన్న జూకంటి, క్షణ క్షణమూ ఇరుకవుతున్న బతుకు రహదారిపై ఒంటరి ప్రయాణీకుడిని మోస్తున్న బోసి బస్టాండ్‌ అయిపోతాడు ఒకోసారి. ఆ పాన్‌ డబ్బా చాటునో ఆ మార్కెట్‌ మూలమీదో లక్ష్మీ విలాస్‌ స్తంభం పాటు టేబుల్‌ పక్కనో కవిత్వం చదువుకుని చాయ్‌ తాగి వెళ్లిపో యిన కరస్పర్శల్ని ఆయన మరిచిపోలేడు. ఎన్ని జీవితాలు భీవండి బస్సులై పోయాయో ఆయన మనసుకు తెలుసు. నిశ్చలమైన చెరువు రాళ్లలో రాయి విసిరినట్లు ఎన్ని డీజిల్‌ జీపులు జనం జీవితాల్లో కల్లోలం సృష్టిస్తూ చప్పుడు చేసుకుంటూ వెళ్లిపోయాయో ఆయనకు తెలుసు. ఎంత దుఃఖించినా కనిపించని అశ్రువులు ఆయన గుండెల్ని చెరువు చేస్తుంటాయి. ఎన్నడూ పేజి తిప్పని ఎడ్డిబాగుల జీవితాలు దిక్కుతోచని లోతు చూపులు ఆయనను తాకుతుంటాయి. ‘‘రోజూ మధ్యాహ్నం బస్సు పోయి వచ్చినంత వేగంలో కనీసం ఆవగింజంతయనా ఇక్కడి మనుషులు జీవితం ముందుకు కదిలినా బాగుండేది అనుకుంటాడు’’ ఆయన ప్రతి రోజూ. జూకంటి కళ్లలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు తగులబడి పోతున్న దేశం దహన కాండ జ్వాలలు మెరుస్తుంటాయి. శవంపై పేలాలు ఏరుక్కునే వ్యవస్థపై ఆయన నిత్యం దహించుకుపోతుంటాడు. ‘‘మనిషినైనందుకు నాకు నేనే సిగ్గుతో కుమిలిపోతున్నాను కవినైనందుకు రాజ్యాన్ని ద్వేషిస్తున్నాను’’ అని ధైర్యంగా చెప్పగల నిజమైన కవి జూకంటి.


‘‘బతుకు అంగడై పోయింది’’ అని ఒక్క మాటలో ఆయన మనను మనం అమ్ముకుంటున్న వర్తమాన పరిస్థితిని చిత్రించారు. ‘‘మనిషిని మనిషే మార్కెట్‌ చేసుకుంటున్నప్పుడు అతడిని ఎవరూ చనిపొమ్మని అనలేదు. ప్రశ్నను పారేసుకుని అతడే మరణ వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటున్నాడు’’ అని మార్కెట్‌ శవంలా మార్చిన మనిషి గురించి అద్భుతంగా రాసిన జూకంటి ‘‘నన్నెవ్వరో నా ఇంటిముందు పందిరి గుంజకు కట్టేసి కట్టిరిగెటట్లు కొడుతున్నారు.. ఇంటిలాంటి దేశమందు చెట్టుమొదలుకు బహుళ జాతి సంస్థలు కన్నేసి కట్టేసి కొరి ప్రాణం ఉంచుతూనే నన్ను ఇయ్యర మయ్యర కట్టిరిగెటట్లు చంపుతున్నారు’’ అని ఘోషిస్తాడు. మార్కెట్‌ విశ్వరూపాన్ని ఆయన సిరిసిల్ల నుంచి చూశాడు. ‘‘ఇప్పుడు గ్రామం విపణి చేతిలో చిక్కిన అభిమన్యు సంగ్రామం. రానురానూ భూగోళం ఒక నిరర్థక ఆస్తిలా మిగిలిపోతుంది’’ అని చెప్పిన జూకంటే, ‘‘మీరేం చేయ గలరు, నిరసన చేసే ప్రజలకు బుదుగరిచ్చి చేతిల పుట్నాలను పెట్టగలరు కాదంటే చచ్చేలా చేసి చావు డప్పు కొట్టగలరు’’ అని నేతలను ప్రశ్నించగలడు. ‘‘రైతు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా మారిండు’’ అని వాపోయే జూకంటి ముంపు గ్రామాల జనం ఘోషను వర్ణిస్తూ ‘‘ఊపిరి ఆడడం లేదు, ఊరి మీద తీపి చావడం లేదు. తండ్రీ మునిగితిమి. నిండా మునిగితిమి’’ అని గురించి ఆక్రోశించగలడు. స్వంత ఇంటికి కిరాయి బోర్డు పెట్టాల్సి వచ్చిన వేదనను చిత్రించ గలడు. ఇల్లు దుర్మార్గంగా దుకాణమై కూర్చున్న వేళ కనపడని కుట్రలను అర్థం చేసుకోగల జూకంటి జగన్నాథంకు జరుగుతున్న యుద్ధం స్పష్టంగా కనిపిస్తుంది. కాని అది సాధారణంగా పైకి కనపడని యుద్ధం. ‘‘శత్రుత్వం ఎక్కడా కనిపించదు, యుద్ధం కొనసాగుతుంటుంది ఆయుధం నీడలు ఎక్కడా అగుపించవు. యుద్ధం కొనసాగుతూ ఉంటుంది కాని చేతులకు ఎక్కడా రక్తం అంటదు..’’ అని ఆయనే చెప్పగలడు.


రాజకీయాలు మనకెందుకు? అని ప్రశ్నించే అమాయకుల ముందు జూకంటి అజ్ఞాన తిమిరాన్ని తొలగించేందుకు ప్రతి రోజూ మనను తాకే తొలి సూర్య కిరణంలా ప్రత్యక్షమవుతాడు. రాజకీయం కాకుంటే మా తరిభూములు ఎందుకు బంజర్లు అయినవి? రాజకీయం చేయకుంటే కాలువ పారిన ప్రతి దగ్గరా మీ జాగలు ఎట్లయినవి? అని అడుగుతాడు. మన ఆత్మగౌరవ మంతా అక్కరకు రాని పాత సామాను అయినప్పుడు, ఎవరి గొంతులకు వారే వంతుల వారి ఉరిత్రాళ్లు బిగించుకుంటున్న కాలం వచ్చినప్పుడు, రండి రండి వామనుడి మూడో పాదం మోపండి అని నిర్వేదంగా పలికే జూకంటి జగన్నాథంకు తప్ప రాజకీయాల ప్రాధాన్యత ఎవరికి తెలుస్తుంది?  


జూకంటి కవిత్వం ఎలా ఉంటుంది? చనిపోయిన వారికన్నా బతికున్న వారికోసం ఏడువడమే పెద్ద గుండె కోత అయిన చోట ఆయన కవిత్వం క్రిమిసంహారక డబ్బా మీద వణికిన చేతివేళ్లలా ఉంటుంది, ఆయన కవిత్వం తెల్లకాగితం మీద చితిని పేర్చుకుని నేను స్వచ్ఛందంగా అగ్ని ప్రవేశం చేస్తుంటుంది. ఆయన కవిత్వం నేల దాచుకున్న నీటి ఊటల మూటల్లా ఉంటుంది. ఆయన కవిత్వం ఎల్లప్పుడూ కడుపులో పుట్టెడు దుఃఖం దాచుకునే ఆడబిడ్డల్లా ఉంటుంది, ఆయన కవిత్వం తమలపాకు చేతుల ‘అఆ’లు దిద్దే పలకల్లా ఉంటుంది. అవ్వా, నాయినలకూ, చెల్లే బావలకు, చేనూ చెలకకూ, వాగూ, ఊరగుట్టకూ నిత్యం వీడ్కోలు చెబుతూ, కన్ననేల కొంగు నీడకు దండం పెడుతూ వెళ్లే సోపతి గాళ్లను చూసి జూకంటి పద్యం స్వచ్ఛందంగా శిరచ్ఛేదనం చేసుకుంటుంది.


జూకంటి అద్దమే సౌందర్యం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన అద్దానికి ఆవల వైపున్న సౌందర్యాన్ని చూస్తాడు. అబద్ధంఅంతరాత్మలోనున్న నిజాన్ని దర్శిస్తాడు. ఎంత కల కన్నామో కులం అంత వాస్తవం అని స్పష్టంగా ధైర్యంగా చెప్పగల కవి జూకంటి. బహుజనులు ఏకం కానంతవరకూ వారి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని అంబేద్కర్‌ చెప్పిన వాస్తవాన్ని పదే పదే చెప్పిన జూకంటి ‘‘బహుజనులంతా ఒక్కటి కానంతవరకూ చిల్లులు పడ్డ బతుకులు మనయే’’ అని ఎన్నో సార్లు అక్షరీకరిస్తాడు.  


‘‘నా మీద నేను స్మృతిగీతం రాసుకుంటే తప్ప నాకు నిష్కృతి లేదు. నా శవయాత్రను నేనే చప్పుళ్లతో మహాద్భుతంగా ఊరేగించాలని ఉన్నది’’ అని రాసిన జూకంటి ప్రతి అక్షరంలోనూ మన వ్యవస్థల శవయాత్రల ఊరేగింపులు కనపడతాయి. జూకంటి వాక్యాల్లో చెప్పాలంటే పక్షి రెక్క విప్పని వేళ, ఆకుస్వేచ్ఛ గాలిగా అల్లాడని వేళ కనిపించే దుర్భర మౌనాన్ని ఆయన భరించలేడు. ఆయన ఒక ఉదయాకాశం ఒక వరికంకి.. నేల గరిమనాభిని పెకిలించుకు వస్తున్న మహా సంగ్రామం!

(జూకంటి జగన్నాథం జులై 29న సి.నా.రె అవార్డు స్వీకరిస్తారు) 

కృష్ణుడు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.