పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కని ఏకైక గ్రామం

Published: Tue, 16 Aug 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కని ఏకైక గ్రామంర్యాగట్లపల్లి గ్రామం

- జిల్లాలోనే ఆదర్శంగా నిలిచిన ర్యాగట్లపల్లి గ్రామం

- చిన్నచిన్న తగదాలన్నీ గ్రామంలోనే పరిష్కారం

- గత కొన్ని సంవత్సరాలుగా ఒకే ఒక్క కేసు నమోదు

- ఆ కేసు కూడా ఇరువురి రాజీతో పరిష్కారం

- క్రైమ్‌ఫ్రీ గ్రామంగా ర్యాగట్లపల్లిని ప్రకటించిన జిల్లా జడ్జి


భిక్కనూర్‌, ఆగస్టు 16: రెండు అడుగుల స్థలం కోసమే కుటుంబీకుల మధ్య గొడవలు.. భర్త భార్యను కొట్టాడనో.. పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనో.. ఇలా రకరకాల సమస్యలతో పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కుతూ అటు సమయం వృథాతో పాటు ఇటు మానసిక క్షోభను అనుభవిస్తూ కక్షలను పెంచుకుంటూ జీవితాలను ఫణంగా పెడుతున్నా ప్రస్తుత సమాజంలో ఏళ్లుగా ఊరంతా ఒకే మాటమీద ఉంటూ అసలు పోలీసుస్టేషన్‌ అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారంటే నమ్మశక్యం కల్గుతుందా అట్లాంటి ఒక గ్రామం మన కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి ఉంది. తమ సమస్యలను ఊర్లోనే పరిష్కరించుకుంటూ జిల్లాలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ జిల్లాలోనే  ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది. ఒక కేసు లేని గ్రామంగా జిల్లా జడ్జి శ్రీదేవి సైతం ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులను అభినందించారంటే గ్రామస్థుల్లో ఉన్న సఖ్యత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

గుట్టల మధ్యలో ఉన్న చిన్నగ్రామం ర్యాగట్లపల్లి

మెదక్‌ జిల్లా బార్డర్‌ను ఆనుకొని గుట్ట మధ్యలో దాదాపు వెయ్యి జనాభా ఉన్న అందమైన చిన్న పల్లెటూరు ఈ ర్యాగట్లపల్లి గ్రామం. చుట్టూ వ్యవసాయ పొలాలు, అడవితల్లి ఒడిలో పూర్తిగా పచ్చనిహారంగా ఉండే ఈ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ర్యాగట్లపల్లిలో గ్రామస్థులందరూ ఐకమత్యంగా ముందుకు సాగుతున్నారు. ఎలాంటి గొడవైన, సమస్య అయినా గ్రామంలోనే పరిష్కరించుకుంటూ అన్నదమ్ముల్లా కలిసి పోతుంటారు. గ్రామంలోనే గ్రామపెద్దల సమక్షంలో ఇరువర్గాలు చర్చించుకుని సామరస్యంగా పరిష్కరించుకుంటూ తప్పుచేసిన వారు ఉంటే జరిమానాలు విధించుకుని అక్కడికక్కడే పరిష్కారం చేసుకుంటారే తప్ప ఎన్నడూ కూడా పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కిన దాఖలాలు లేవు.

పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం

ర్యాగట్లపల్లి గ్రామం వ్యవసాయంపైనే ఆధారపడిన గ్రామం. ఉదయం లేస్తే రాత్రి వరకు దాదాపు అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఎక్కువగా కూరగాయలు పండించే ఈ గ్రామస్థులు చుట్టు పక్కల ఉన్న అన్ని గ్రామాల మార్కెట్లలో కూరగాయలను విక్రయిస్తుంటారు. ఒకరికి ఒకరు ఆపదలో తోడుగా నిలవడంతో పాటు గ్రామాన్ని సైతం అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు.

కోర్టు చరిత్రలోనే మొదటి రాజీ కేసు

ఒక గ్రామానికి జిల్లా జడ్జి, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి, సీనియర్‌ న్యాయవాదులు వచ్చి రాజీకుదర్చి ఉన్న ఒక్క కేసును సైతం పరిష్కరించడం కోర్టు చరిత్రలోనే మొట్టమొదటిది కావడం గమనార్హం. చిన్నపాటి ప్రమాదం జరుగగా ఇరువర్గాలు రాజీమార్గం ఎంచుకోగా అప్పటికప్పుడు జడ్జి తన తీర్పును కోర్టులో కాకుండా గ్రామంలోనే చెప్పి కేసు క్లోజ్‌ చేయడం ఆశ్చర్యకరమైన విషయమేనని న్యాయవాదులు సైతం చెపుకుంటున్నారు. ఆ కేసుకు సంబంధించిన ప్రతిని సైతం ఇతర గ్రామస్థులకు ఆదర్శంగా ఉండేలా ప్రేమ్‌ కట్టించి కోర్టులో పెట్టనున్నట్లు వెల్లడించారు.


ఐకమత్యంతోనే నేర రహిత గ్రామంగా నిలిచింది

- శ్రీదేవి, జిల్లాజడ్జి, కామారెడ్డి

గ్రామస్థుల ఐకమత్యంతోనే ర్యాగట్లపల్లి గ్రామం నేర రహిత గ్రామంగా నిలిచింది. జిల్లాలోనే ఒక్క కేసు కూడా లేకుండా నేర రహిత గ్రామంగా ఆదర్శంగా నిలుస్తోంది. వ్యవసాయంపైనే ఆధారపడిన గ్రామస్థులు ప్రతి ఒక్కరూ మరింత ఆర్థికంగా ఎదిగి వారి పిల్లలను బాగా చదివించాలి.


ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి

- నంద రమేష్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

ఒక గ్రామానికి జిల్లా జడ్జి, అదనపు జిల్లా జడ్జి, సీనియర్‌ న్యాయవాదులు వచ్చి ఉన్న చిన్నపాటి కేసును కూడా పరిష్కారం ఇప్పటికప్పుడు చేయడం కామారెడ్డి కోర్టు చరిత్రలోనే ప్రథమం. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఎలాంటి కేసులు నమోదుకాకపోగా ఇటీవల జరిగిన చిన్న రోడ్డుప్రమాద కేసులో రాజీమార్గంలో ఇరువురు పరిష్కరించుకోవడం అభినందనీయం.


గ్రామస్థులు ఐకమత్యంగా ఉంటారు

- నాగన్నగారి అనసూయ, ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌

తమ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఐక్యమత్యం ఉంటాం. ఏదైన చిన్నచిన్న సమస్యలు, గొడవలు ఉంటే గ్రామంలోనే పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటాం. జిల్లాలోని ఈ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాని గ్రామంగా నిలవడం సంతోషంగా ఉంది. మున్ముందు సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తాం.


పోలీసుస్టేషన్‌కు రావడం చాలా అరుదు

- ఆనంద్‌గౌడ్‌, భిక్కనూర్‌ ఎస్‌ఐ

ర్యాగట్లపల్లి గ్రామస్థులు పోలీసుస్టేషన్‌కు రావడం చాలా అరుదు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉండడంతోనే గ్రామం ఆదర్శంగా నిలిచింది. చిన్నచిన్న గొడవలకే పోలీసుస్టేషన్‌, కోర్టు మెట్లు ఎక్కి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కానీ ర్యాగట్లపల్లి గ్రామస్థులు గ్రామంలోనే సమస్య పరిష్కరించుకోవడం అభినందనీయం.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.