పదవులూ మీకే.. కాంట్రాక్టులూ మీకేనా...!

ABN , First Publish Date - 2022-07-07T06:52:22+05:30 IST

మదనపల్లెలో బుధవారం జరిగిన మినీ మహానాడులో చంద్రబాబు పాల్గొన్నారు. అధికారంతో మీరు చేసిన జిల్లాల విభజనలో జరిగిన లోపాలను తాను అధికారంలోకి రాగానే సరిదిద్ది జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ న్యాయం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు.

పదవులూ మీకే.. కాంట్రాక్టులూ మీకేనా...!
మినీ మహానాడులో మాట్లాడుతున్న చంద్రబాబు

మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిలపై చంద్రబాబు ఆగ్రహం


‘విభజన’ లోపాలను సరిచేస్తానంటూ హామీ


మదనపల్లె, జూలై 6: అధికారంతో మీరు చేసిన జిల్లాల విభజనలో జరిగిన లోపాలను తాను అధికారంలోకి రాగానే సరిదిద్ది జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ న్యాయం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. మదనపల్లెలో బుధవారం జరిగిన మినీ మహానాడులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాల ప్రకటన అశాస్ర్తీయంగా జరిగిందని చెప్పే ప్రయత్నంలో జిల్లా కేంద్రం మధ్యలో ఉండాలని, అన్నమయ్య జిల్లా విషయంలో రాజంపేటలో ఉండాలన్నారు. పుంగనూరును తీసుకెళ్లి చిత్తూరులో ఎందుకు పెట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రశ్నించారు. చారిత్రక కేంద్రమైన మదనపల్లెకు, రాజంపేటకు భవిష్యత్తులో న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పుంగనూరును తిరిగి మదనపల్లెకు తీసుకొస్తానని అధినేత స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం చేసిన అన్యాయాన్ని టీడీపీ అధికారంలోకి రాగానే సరిదిద్ది న్యాయం చేస్తామన్న విషయాన్ని వైసీపీ గుర్తుంచుకోవాలని సూచించారు. 


పదవులూ మీకే..కాంట్రాక్టులూ మీకేనా

జిల్లాలో పదవులూ, అన్ని కాంట్రాక్టు పనులు మీకేనా అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో దాడులు, దౌర్జన్యాలు, రౌడీయిజం చేస్తున్నారంటూ పెద్దిరెడ్డి కుటుంబంపై నిప్పులు చెరిగారు. రాజంపేట ఏమైనా మీ తాత జాగీరా? ఖబడ్దార్‌..జాగ్రత్తగా ఉండాలంటూ మంత్రితో పాటు ఎంపీ మిథున్‌రెడ్డిని హెచ్చరించారు. దాడి, దౌర్జన్యాలు చేయడం మీకే తెలుసా..మాకు రాదా అంటూ ప్రశ్నించారు.  మీ అరాచకాలు తిరిగీ మీకే ఇచ్చే రోజులు దగ్గర పడుతున్నాయంటూ వార్నింగ్‌ ఇచ్చారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ టీడీపీ ప్రభుత్వం చేపడితే, తాను చేపట్టిన హంద్రీ-నీవాతో మూడేళ్లలో జిల్లాకు చుక్కనీరు కూడా ఇవ్వలేదన్నారు. కనీసం హంద్రీ-నీవాను పూర్తి చేయలేదని విమర్శించారు. పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె వద్ద రూ.18 కోట్లతో నిర్మిస్తున్న రిజర్వాయర్‌కు కాంట్రాక్టర్‌ ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు టెండర్లు వేసే కాంట్రాక్టర్లే లేరా మీరేనా మగాళ్లు అంటూ ప్రశ్నించారు. తాము చేపట్టిన హంద్రీ-నీవాను ఆపేసి రూ.4600 కోట్లతో గాలేరు-నగరి నుంచి పైపులైన్‌ ద్వారా నీళ్లు తెస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పనులు చేస్తున్నది ప్రజల కోసమా..మీ కోసమా అంటూ పెద్దిరెడ్డి కుటుంబాన్ని ప్రశ్నించారు. మదనపల్లెలో కీలకమైన బీటీ కళాశాలకు చెందిన రూ.500-1000 కోట్ల వందెకరాల ఆస్తిని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రఖ్యాత క్షయవ్యాధి ఆస్పత్రి శానిటోరియాన్ని కూడా స్వాహా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రేపు మదనపల్లె జిల్లా అయితే బీటీ కళాశాల భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. జిల్లా స్థాయిలో మదనపల్లెలో ఎక్కువగా ఉన్న చేనేతలను ఆదుకుంటామని నేతన్నలకు హామీ ఇచ్చారు. దివంగత ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న మినీ మహానాడు మదనపల్లెలో నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఒకప్పుడు మీరంతా చిత్తూరులో ఉండగా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్నా మీరంతా పార్టీ కార్యకర్తలేనని అధినేత సూచించారు. మనమంతా ఎన్టీఆర్‌ వారసులమేనని గుర్తు చేశారు. మినీ మహానాడుకు వస్తున్న మనవాళ్లను పుంగనూరు పెద్దలు ఆంక్షలు పెట్టి కేసులు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. నేను కన్నెర్ర చేస్తే ఇంట్లో నుంచి బయటకు రారంటూ పెద్దిరెడ్డి కుటుంబాన్ని హెచ్చరించారు.


మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎన్‌.అమరనాథరెడ్డిలు మాట్లాడుతూ పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్‌ తరువాత గుద్దులు గుద్దుతున్నాడంటూ, మాట తప్పడు, మడమ తిప్పడు అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. మన హయంలో వేసిన రోడ్లన్నీ వైసీపీ వేసినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కుప్పం వరకు పారించిన కృష్ణాజలాల స్థానంలో హంద్రీ-నీవా కాలువల్లో ప్రస్తుతం కంపచెట్లు మొలిచాయని ఇదే వీరి పాలనలో చేసిన ఘనత అంటూ విమర్శించారు. తన హయాంలో వేసిన రోడ్లకు పడిన గతుకులను కూడా పూడ్చేస్థితిలో లేరని విమర్శించారు. మూడేళ్లలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదీ చేయకపోయినా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొట్టేస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. పార్లమెంట్‌ టీడీపీ నేత గంటా నరహరి మాట్లాడుతూ మినీమహానాడును రాజంపేట పరిధిలో నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ దుర్మార్గ పాలనతో ఏపీ అతలాకుతలం అవుతోందన్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న వీరి పాలనను ఏమంటారో మీరే చెప్పాలంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు. రివర్స్‌ టెండర్ల పేరుతో అభివృద్ధి కూడా రివర్స్‌ అయిందని, కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపారు. రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని, రానున్న ఎన్నికల్లో రాజంపేట ఓటర్లు తనను ఆశీర్వదించాలని కోరారు. జాతీయ ప్రఽధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ను రాయలసీమలో ఓడిస్తాం..చిత్తూరులో నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట జిల్లాకు తాను వ్యతిరేకం కాదని అయితే మదనపల్లెకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు వడ్డీతో సహా తీర్చుకుంటామని ప్రకటించారు. చేతగాని మంత్రి, ఎంపీ పనికిరాని ఎమ్మెల్యేలతో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, తరువాత ప్రతీకారం తీర్చుకుంటామని కిశోర్‌ హెచ్చరించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీరాంచినబాబు మాట్లాడుతూ ధ్రుతరాష్ట్ర పాలనకు చరమగీతం పాడాలనీ, ఎన్నికలు ఎప్పుడొచ్చినా చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా యువత అహర్నిశలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేశ్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారం చేపట్టిన 17 రోజులకే ప్రజావేదిక కూల్చి, విధ్వంసానికి నాందీ పలికిందని గుర్తు చేశారు. నిండుసభలో అధినేత చంద్రబాబును వ్యక్తిగత దూషణలతో కంటతడి పెట్టించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్‌ మాట్లాడుతూ దాడులు, దౌర్జన్యాలు తూటాలకే భయపడని మనం వర్షానికి భయపడమని చెప్పారు. మినీమహానాడులో నేతల ప్రసంగం ప్రారంభం కాగానే వర్షం మొదలు కావడంతో లేచి నిలబడిన కార్యకర్తలు, పార్టీ అభిమానులను ఉత్తేజపరిచే వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రమే్‌షకుమార్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబు, చమర్తి జగన్‌మోహన్‌రాజు, ఎం.రాంప్రసాద్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. వ్యాఖ్యాతగా మద్దిపట్ల సూర్యప్రకాష్‌ వ్యవహరించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శ్రీరామజయరామనాయుడు, బోడిపాటి శ్రీనివాస్‌, రాటకొండ బాబురెడ్డి, మార్పూరి సుధాకర్‌నాయుడు, నరసింహాయాదవ్‌, చల్లా బాబురెడ్డి, ఎన్‌.శ్రీనాథరెడ్డి, ఎస్‌.కె.రమణారెడ్డి, పులివర్తి నాని, మైనార్టీ నేతలు ఎస్‌.ఏ.మస్తాన్‌, గాజుల ఖాదర్‌బాషా, ఎస్‌.ఎం.పర్వీన్‌తాజ్‌, సత్యప్రసాద్‌, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, డీఆర్‌ తులసీప్రసాద్‌, భవానీప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.


సరిహద్దులో చంద్రబాబుకు ఘనస్వాగతం


మదనపల్లె మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన చీకలబయలులో పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా టీడీపీ నేత శ్రీరామజయరానాయుడు తాటికల్లు క్రాస్‌ వద్ద  యాపిల్‌ పండ్ల హారంతో క్రేన్‌ సాయంతో ఘన స్వాగతం పలికారు. చీకలబయలు వద్ద పార్టీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామచినబాబులు వేర్వేరుగా అధినేత క్రేన్లతో భారీ గజమాలలు వేసి స్వాగతం పలికారు. వేంపల్లె క్రాస్‌లో టీడీపీ నేత గంగారపు బాబురెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో, నక్కలదిన్నె వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరో గజమాలతో వేర్వేరుగా స్వాగతం పలికారు. అంతకుముందు శ్రీరామచినబాబు మదనపల్లె పట్టణంలో 2 వేల మందితో స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇదే స్కూటర్‌ ర్యాలీ చీకలబయలుకు వెళ్లి అధినేతకు స్వాగతం పలికింది. అలాగే కర్ణాటకలోని తాటికల్లు క్రాస్‌ నుంచి శ్రీరామజయరామనాయుడు చీకలబయలు వరకు భారీ స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు మదనపల్లె సరిహద్దుకు చేరుకున్న చంద్రబాబు మదనపల్లె సభా వేదిక వద్దకు వచ్చేందుకు 2.30 గంటల సమయం పట్టింది. అడుగడుగునా ప్రజలు, కార్యకర్తలు చంద్రబాబుకు నీరాజనం పలికారు. 


Updated Date - 2022-07-07T06:52:22+05:30 IST