నిర్ణయించిన ఫీజులే తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-07T07:26:01+05:30 IST

ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు తరగతులవారీగా జీవోలో పొందుపరచిన ఫీజులే వసూలు చేయాలని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్యులు ప్రొఫెసర్‌ నారాయణరెడ్డి, ఈశ్వరయ్య పేర్కొన్నారు.

నిర్ణయించిన ఫీజులే తీసుకోవాలి
మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ నారాయణరెడ్డి, ఈశ్వరయ్య

పాఠశాలవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్యుల స్పష్టీకరణ 

తిరుపతిలో 14విద్యాసంస్థల తనిఖీ 


తిరుపతి(విద్య),డిసెంబరు 6: ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు తరగతులవారీగా జీవోలో పొందుపరచిన ఫీజులే వసూలు చేయాలని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్యులు ప్రొఫెసర్‌ నారాయణరెడ్డి, ఈశ్వరయ్య పేర్కొన్నారు. తిరుపతిలోని ఆర్‌ఐవో కార్యాలయంలో సోమవారం వీరు మీడియాతో మాట్లాడారు. అధికఫీజులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం జీవో 53(స్కూళ్లలో), 54(జూనియర్‌ కాలేజీల్లో)లను తీసుకొచ్చిందన్నారు. వీటిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఎలాంటి తీర్పుగానీ, స్టే గానీ ఇవ్వలేదని గుర్తు చేశారు. దీంతో ఆ జీవోలు అమల్లో ఉన్నట్లేనని చెప్పారు. కోర్టులో కేసు నడుస్తున్నా ప్రైవేట్‌లలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు కమిషన్‌కు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.  క్రమంలో సోమవారం తిరుపతిలో విద్యాశాఖ బృందాల (కమిటీలు) నేతృత్వంలో 14 విద్యాసంస్థలను(స్కూళ్లు, కాలేజీలు) తనిఖీ చేశామన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల నుంచి వివరాలు సేకరించామన్నారు. ఈ నివేదిక ఆధారంగా ఆ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల్లో ఏవైనా సమస్యలుంటే తమదృష్టికి తెస్తే.. సౌకర్యాలు పరిశీలించి వెసులుబాటుకు అవకాశం ఇస్తామన్నారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా అనధికారికంగా ఎక్కువఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మఒడి పఽథకానికి విద్యార్థుల హాజరు తప్పకుండా ఉండేలా చూడాలని తెలిపారు. డీవీఈవో శ్రీనివాసులురెడ్డి, ఆర్‌ఐవో బాలకృష్ణమూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T07:26:01+05:30 IST