కొనేదెలా? తినేదెలా?

ABN , First Publish Date - 2022-05-21T04:57:34+05:30 IST

టమాట కిలో ధర వందకు చేరి సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందనంటోంది.

కొనేదెలా? తినేదెలా?
చిత్తూరు జిల్లా మదనపల్లి నుండి దిగుమతి చేసుకున్న టమాటాలు

- కిలో రూ.100కు చేరిన టమాటా ధర 

- స్థానికంగా దిగుబడి లేకపోవడమే కారణం

- మిగతా కూరగాయల ధరలకూ రెక్కలు

అయిజ, మే 20 : టమాట కిలో ధర వందకు చేరి సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందనంటోంది. స్థానికంగా టమాట దిగుబడి తగ్గిపోవడమే ధర పెరుగు దలకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ఎండలు అధికంగా ఉండటంతో పూత రాలి పోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో అయిజ పట్టణంలో శుక్రవారం టమాట ధర రూ.100కు చేరింది. అలంపూర్‌ మండలంలో 57 ఎకరాలలో టమాట పంట సాగుచేశారు. ఇంతలా ధరలు పెరిగితే కొనేదెలా? తినేదెలా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వారం క్రితం రూ.30

టమాటా కిలో ధర వారం రోజుల క్రితం రూ.30 నుంచి రూ.35 వరకు ఉండింది. అంతకుముందు రంజాన్‌ పండగ సమయంలో కిలో ధర రూ.50 నుంచి రూ.60 వరకు కొనసాగింది. ప్రస్తుతం అమాంతం పెరిగి  వంద రూపాయలకు చేరింది. గతంలో 25 కిలోల టమాట బాక్స్‌ ధర రూ.1200 నుంచి రూ.1400 పలికింది. ప్రస్తుతం అదే బాక్స్‌ ధర రూ.2,000 నుంచి రూ. 2,200 వరకు పలుకుతోంది. దీనితో వ్యాపారులు మార్కెట్‌లో రూ.100 నుంచి 110 వరకు విక్రయిస్తున్నారు. స్థానికంగా దిగుబడి తగ్గిపోవడంతో స్థానిక వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. ధర పెరగడానికి ఇది కూడా ఒక కారణమని వ్యాపారులు చెప్తున్నారు. టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా బాగా పెరిగాయి. పచ్చి మిరపకాయల ధర కిలో రూ.50 పలుకుతోంది. క్యారెట్‌, బీట్‌రూట్‌ ధరలు రూ.60కి పైగా ఉన్నాయి. నిమ్మకాయలు పది రూపా యలకు రెండు చొప్పున అమ్ముతున్నారు. 


ఎవరూ కొనడం లేదు

నారాయణ, కూరగాయల వ్యాపారి : ధర తక్కువగా ఉంటేనే లాభాలు వస్తాయి. ఎందుకంటే ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తారు. ధర ఎక్కువగా ఉండటంతో కొనటానికి ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో లాభం కూడా రావటం లేదు. చిత్తూరు నుంచి వచ్చే టమాటా బాక్స్‌లను దక్కించుకునేందుకు ఉదయం మార్కెట్‌లో వేలం పాటలో పోటీ పడాల్సి వస్తోంది. 

Updated Date - 2022-05-21T04:57:34+05:30 IST