విచారణ ప్రక్రియే పెద్ద శిక్ష: సీజేఐ రమణ

ABN , First Publish Date - 2022-07-17T01:02:26+05:30 IST

ఎన్వీ రమణ ప్రసంగానికి ముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగిస్తూ దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్లకు చేరనుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీజేఐ స్పందిస్తూ న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని అన్నారు..

విచారణ ప్రక్రియే పెద్ద శిక్ష: సీజేఐ రమణ

జైపూర్: దేశంలోని కోర్టుల్లో విచారణ ప్రక్రియే పెద్ద శిక్షగా మారిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Chief Justice of India NV Ramana) అన్నారు. శనివారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన ‘18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ’  అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 27 ఏళ్లలో దేశంలోని 1,378 జైళ్లలో 6.1 లక్షల మంది ఖైదీలు ఉన్నారని, అందులో 80 శాతం మందిపై కేసులు విచారణ దశలోనే ఉన్నాయని ఆయన అన్నారు. విచక్షణా రహితంగా అరెస్ట్‌లు చేసి, పెద్ద పెద్ద నేరాలు మోపి బెయిలు అంత సులువుగా అందకుండా పరిస్థితులు మారిపోయాయని, దీనిపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.


ఎన్వీ రమణ ప్రసంగానికి ముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగిస్తూ దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్లకు చేరనుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీజేఐ స్పందిస్తూ న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘శాసన వ్యవస్థ పనితీరులో నాణ్యత క్షీణిస్తోంది. రాజకీయ విభేదాలు శత్రుత్వంగా మారకూడదు. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతాలు కాదు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పరస్పరం గౌరవం ఉండేది. అధికార, ప్రతిపక్షాల మధ్య దూరం పెరగడం దురదృష్టకరం. భారతదేశం ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని మనం గమనించాలి. భారతదేశం 'పార్లమెంటరీ ప్రభుత్వం' కాదు. మన బహుళత్వాన్ని కాపాడుకోవడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక మార్గం’’ అని అన్నారు.

Updated Date - 2022-07-17T01:02:26+05:30 IST