కొవిడ్‌ నిబంధనలతోనే కౌంటింగ్‌ ప్రక్రియ

ABN , First Publish Date - 2021-04-23T08:09:58+05:30 IST

కొవిడ్‌ నిబంధనల మేరకే నిర్వహించాలని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు.

కొవిడ్‌ నిబంధనలతోనే కౌంటింగ్‌ ప్రక్రియ
సమావేశంలో ప్రసంగిస్తున్న చక్రధర్‌బాబు

ఆర్వో చక్రధర్‌బాబు


తిరుపతి(రవాణా), ఏప్రిల్‌ 22: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్‌ వచ్చేనెల రెండో తేదీన అసెంబ్లీ సెగ్మెంట్‌ వారీగా కొవిడ్‌ నిబంధనల మేరకే నిర్వహించాలని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్వో), నెల్లూరు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. గురువారం కౌంటింగ్‌ ప్రక్రియపై తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. కౌంటింగ్‌ సమాచారాన్ని బరిలో ఉన్న అభ్యర్థులకు నోటీసు ద్వారా తెలియజేయాలన్నారు. కొవిడ్‌ రీత్యా కౌంటింగ్‌ హాళ్లు పెంచడం వల్ల అసిస్టెంట్‌ ఆర్వోలను నియమించాలని చెప్పారు. ప్రతి టేబుల్‌ వద్ద మైక్రో అబ్జర్వర్‌ ఉండాలని, ప్రతి రౌండ్‌ ఫలితాల్లో ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది శిక్షణను త్వరగా పూర్తిచేయాలని కోరారు. అబ్జర్వర్‌ సమక్షంలో ర్యాండమైజేషన్‌ ద్వారా కౌంటింగ్‌ టేబుల్స్‌ అలాట్‌ చేస్తారని, సిబ్బందికి, ఏజెంట్లకు ఐడీకార్డులు తప్పనిసరని పేర్కొన్నారు. ప్రతి టేబుల్‌ వద్ద కౌంటింగ్‌ చేసే పోలింగ్‌ కేంద్రాల లిస్టు డిస్‌ప్లే ఉండాలని, సెల్‌ఫోన్స్‌ అనుమతి లేదన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ నెల్లూరు కేంద్రంగా జరుగుతుందని తెలిపారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ మాట్లాడుతూ.. మూమెంట్‌ ప్లాన్‌ పక్కాగా ఉండాలన్నారు. కొవిడ్‌ కారణంగా తిరుపతిలో నాలుగు రూమ్‌ల్లో 28 టేబుల్స్‌, శ్రీకాళహస్తి, సత్యవేడుల్లో మూడు చొప్పున రూమ్‌లు, 21టేబుల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఇప్పటికే రూట్‌ ప్లాన్‌ సిద్ధం చేశామని, మరోసారి ఏఆర్వోల సమన్వయంతో పరిశీలించి, తెలియజేస్తామన్నారు. క్రౌడ్‌ కంట్రోల్‌ మానిటర్‌, పార్కింగ్‌ స్థలం వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఏఆర్వోలు చంద్రమౌళీశ్వరరెడ్డి (తిరుపతి), శ్రీనివాసులు (శ్రీకాళహస్తి), చంద్రశేఖర్‌ (సత్యవేడు), తహసీల్దార్లు ఉదయ్‌సంతోష్‌, దస్తగిరయ్య, జయరాములు తదితరులు పాల్గొన్నారు. 


స్ట్రాంగ్‌ రూమ్‌ల తనిఖీ

తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌లను ఆర్వో చక్రధర్‌బాబు పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఆయనవెంట కలెక్టర్‌, అర్బన్‌ ఎస్పీ తదితరులున్నారు.  

Updated Date - 2021-04-23T08:09:58+05:30 IST