కోటి విత్తన బంతులు

ABN , First Publish Date - 2020-07-06T11:27:51+05:30 IST

జిల్లాలో కోటి విత్తన బంతులను చల్లాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 82 లక్షల సీడ్‌ బాల్స్‌ తయారు చేయగా

కోటి విత్తన బంతులు

మహబూబ్‌నగర్‌ జిల్లా అడవుల్లో చల్లేందుకు నిర్ణయం

ప్రతి మండలానికి 8 లక్షలు టార్గెట్‌

ఈ నెల 13న కార్యక్రమం ప్రారంభం

హరితహారంలో 80 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం

ఇప్పటికే నాటినవి 23 లక్షలు


మహబూబ్‌నగర్‌ :

జిల్లాలో కోటి విత్తన బంతులను చల్లాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 82 లక్షల సీడ్‌ బాల్స్‌ తయారు చేయగా, మిగతావి ఒకటిరెండు రోజుల్లో పూర్తి చేస్తామని చెబుతున్నారు. మొక్కలు నాటడం కంటే వీటి తయారీకి ఖర్చు తక్కువని, కోటి బంతుల్లో 10 శాతం బతికినా లక్ష్యం నెరవేరినట్లేనని అంటున్నారు. ఈ నెల 13న బంతులు చల్లే అవకాశం ఉందని, దానిని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ నిర్ణయిస్తారని పేర్కొంటున్నారు.


అడవులను పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏటా చేపడుతోంది. ఓ వైపు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతూనే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరేలా విత్తన బంతులను కూడా తయారు చేస్తోంది. మూడేళ్లుగా జిల్లాలో విత్తన బంతులను తయారు చేసి, వర్షాలు కురిసే సమయంలో అడవుల్లో వెదజల్లుతున్నారు. ఈ ఏడాది కోటి విత్తన బంతులు తయారు చేయాలని నిర్ణయించారు. 


తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం

విత్తన బంతుల తయారీకి ఖర్చు తక్కువగా ఉంటుంది. వీటి తయారీ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించారు. వెయ్యి మహిళా సంఘాలకు చెందిన లక్ష మంది సీడ్‌ బాల్స్‌ను తయారు చేస్తున్నారు. జిల్లాలోని 14 మండలాలకు గాను ఒక్కో మండలానికి 8 లక్షల సీడ్‌ బాల్స్‌ తయారు చేసేందుకు టార్గెట్‌ ఇచ్చారు. గత నెల 27 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 82 లక్షల బంతులను తయారు చేశారు. మరో రెండు మూడ్రోజుల్లో కోటి బంతులను తయారు చేయనున్నారు. అందుకోసం రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు.


తయారీ ఇలా..

ఎర్ర మట్టిని తెచ్చి జల్లెడ పడతారు. అందులో పశువుల ఎరువు కలిపి, విత్తనాలు పెట్టి మట్టి ముద్దలను తయారు చేస్తారు. రాగి, జువ్వి, మర్రి, నేల, నల్లతుమ్మ, చింత, మేడి, వేప విత్తనాల బాల్స్‌ను రూపొందిస్తున్నారు. వీటిని వర్షాలు పడే సమయంలో వెదజల్లుతారు. వర్షం కురిసినప్పుడు మట్టి కరిగిపోయి అందులోంచి విత్తనం మొల కెత్తుతుంది. 10 శాతం మొక్కలు బతికినా లక్ష్యం నెరవేరినట్లేనని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 13న కొండలు, అటవీ ప్రాం తాల్లో సీడ్‌ బాల్స్‌ను వెదజల్లనున్నారు. హెలికాప్టర్‌ ద్వారా బంతులను వెదజల్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కార్యక్రమం ఎప్పుడనేది మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, మంత్రి కేటీఆర్‌ వచ్చే అవకాశాలు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. 


హరితహారంలో ఇప్పటివరకు 23 లక్షలు

హరితహారం ద్వారా జిల్లాలో ఈ ఏడాది 62 లక్షల మొక్కలు నా టాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించగా, జిల్లా యంత్రాంగం మాత్రం 80 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటి వరకు 23 లక్షల మొక్కలు నాటారు. జిల్లాలో ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉంది.

 

విత్తన బంతుల తయారీ దాదాపు పూర్తి

విత్తన బంతులు తయారు చేసే ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. రెండు మూడ్రోజుల్లో కోటి బంతులు తయారు చేసి, కార్యక్రమానికి సిద్ధంగా ఉంచుతాం. వర్షాలు పడుతున్నందున హరితహారం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.

- వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ పీడీ 

Updated Date - 2020-07-06T11:27:51+05:30 IST