సీఎం జగన్‌ మాట తప్పారు

ABN , First Publish Date - 2022-08-18T09:40:09+05:30 IST

వేతన సంఘం సిఫారసుల అమలుపై ఉద్యోగ సంఘాల సమావేశంలో ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి మాట తప్పారని ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు.

సీఎం జగన్‌ మాట తప్పారు

  • ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
  • కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి
  • సీపీఎస్‌ రద్దుకే మొగ్గు.. జీపీఎ్‌సకు అంగీకరించం
  • మొండిగా ఉంటే పోరుబాటే: బొప్పరాజు

విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): వేతన సంఘం సిఫారసుల అమలుపై ఉద్యోగ సంఘాల సమావేశంలో ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి మాట తప్పారని ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. విశాఖ రెవెన్యూ సంఘం అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు రావలసిన బకాయిలు ఏప్రిల్‌ నెలాఖరులోగా చెల్లిస్తామని, పీఆర్‌సీ మేరకు ఉద్యోగుల షెడ్యూళ్లను ఆయా శాఖలకు పంపుతామని ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారన్నారు. వాటి సంగతి ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ఆర్థిక శాఖలో ఒక అధికారి ఏకపక్షంగా ఉంటూ ఉద్యోగుల బకాయిల గురించి మాట్లాడడానికి ఇష్టపడడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో సమస్యల సాధనకు పోరుబాట పట్టాల్సిందేనని బొప్పరాజు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంతో ఘర్షణ పడాలన్నది తమ ఉద్దేశం కాదని, అన్ని జిల్లాల ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకుని అవసరమైతే త్వరలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


ఇంతవరకు షెడ్యూళ్లు పంపలేదు..

వేతన సంఘం సిఫారసుల మేరకు పే స్కేల్‌ షెడ్యూల్స్‌ను ప్రతి శాఖకు కేడర్‌ వారీగా పంపడం సంప్రదాయమని, దాని ప్రకారం పాత వేతనం.. సవరణ తరువాత వచ్చే వేతనం ఎంత అనేది ప్రతి ఒక్కరికీ తెలుస్తుందని చెప్పారు. అయితే ఇంతవరకు ఆ షెడ్యూళ్లు పంపలేదన్నారు. కరోనా కాలంలో చనిపోయిన ఉద్యోగుల్లో కేవలం ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు తప్ప మిగిలిన శాఖల్లో కారుణ్య నియామకాలు చేపట్టలేదన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు చేపడతామని ప్రభుత్వం చెప్పడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని బొప్పరాజు డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గల పలు కార్పొరేషన్లలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. 


నిబంధనల మేరకు నగరంలో నెలకు రూ.14 వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.12 వేల ఆదాయం కలిగినవారు రేషన్‌ కార్డుకు అర్హులైనప్పటికీ తక్కువ పింఛను పొందుతున్న రిటైర్డు ఉద్యోగుల కార్డులు రద్దు చేయడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో 2018 జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు అన్ని రకాలు కలిపి రూ.20 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని బొప్పరాజు అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించడం లేదన్నారు. ఈ ఏడాది జనవరి, జూలైలో కేంద్రం డీఏ ప్రకటించగా, రాష్ట్రంలో ఆ ఊసే లేదన్నా రు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం విషయంలో ప్రభుత్వంతో ఘర్షణకు దిగే ఆలోచన లేదని.. ఒకవేళ ఇలాగే మొండివైఖరితో ఉంటే మాత్రం రోడ్డెక్కడం ఖాయమని హెచ్చరించారు. సీపీఎస్‌ రద్దుపై ఇప్పటికీ ఉద్యోగ సంఘాలు ఒకే మాటపై ఉన్నాయని, కొత్తగా జీపీఎస్‌ అమలు చేస్తామంటే అంగీకరించబోమని చెప్పారు. సమావేశంలో రెవెన్యూ సంఘ నేతలు సత్తి నాగేశ్వరరెడ్డి, ఈర్లె శ్రీరామ్మూర్తి, వర్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T09:40:09+05:30 IST