ప్రశ్నే అతని ఆయుధం

ABN , First Publish Date - 2021-07-14T05:53:20+05:30 IST

పులుల బోనులాంటి ఆధిపత్యాల సమాజం మనది. ఇందులో బలహీనులు, బ్యాక్‌గ్రౌండ్‌ లేనివారు రాణించాలంటే ఎంతో యుద్ధం చేయాలి....

ప్రశ్నే అతని ఆయుధం

పులుల బోనులాంటి ఆధిపత్యాల సమాజం మనది. ఇందులో బలహీనులు, బ్యాక్‌గ్రౌండ్‌ లేనివారు రాణించాలంటే ఎంతో యుద్ధం చేయాలి. అలా చేస్తే తప్ప, తమ కలలు సాకారం కావడం సాధ్యం కాదు. అట్లా ఆధిపత్యాలకు పెట్టని కోటలుగా ఉన్న సినీ, రాజకీయరంగాల్లో అనతికాలంలో తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్న అలుపెరుగని పోరాటకారుడు కత్తి మహేష్‌. ఆయన అకాల మరణం తెలుగు సమాజానికి తీరని లోటు. అటు సినీరంగంతో పాటు, ఇటు సామాజికరంగంలో కూడా ఆయన లేని లోటు పూడ్చలేనిదంటే అతిశయోక్తి కాదు. 


కత్తి మహేష్‌ పేరు వింటే ఆయన మిత్రుల మనసులు ఎంతగా పులకరిస్తాయో అతని శత్రువుల గుండెలు సైతం అంతే రగిలిపోతాయి. అందుకు కారణం అతని నిబద్ధత, నిజాయితీతో పాటు నిత్యం బాధిత సమూహాల పక్షాన గొంతెత్తడం అతని ప్రవృత్తిగా మారడమే. మహేష్‌ను దగ్గరగా చూసిన వారికి అతనిలోని తెగింపు, మడమ తిప్పనితనం విపరీతంగా నచ్చుతాయి. తాను అనుకున్న లైన్‌ ఎట్లా సరైందో విడమరచి చెప్పేవాడు. అవతలి వారి ఆలోచనలోని తప్పుడు ధోరణుల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టేవాడు. ఈ నిఖార్సయిన తిరుగుబాటుతనమే తనకు మిత్రులతో పాటు శత్రువులను కూడా సంపాదించి పెట్టింది. అతని శత్రువులకు కత్తిలోని స్నేహశీలి, పోరాటాల తిరుగుబాటుదారుడు అంతగా తెలిసే అవకాశం లేదు. అంతే కాదు, కత్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ క్రిటిక్‌గా, దర్శకునిగా, నటునిగా, వ్యాఖ్యాతగా, సామాజిక ఉద్యమకారునిగా, ఔత్సాహిక రాజకీయవేత్తగా ఆయన చేసిన కృషి అసామాన్యమైనది. కేవలం నాలుగున్నర పదుల వయసులోనే ఇన్ని రకాలైన పనులు చేయడం బహుశా కత్తికే సాధ్యమైంది. అది ఆయన జీవన నేపథ్యం నేర్పిన పాఠమైంది.


చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని పీలేరు అనే ఒక చిన్న గ్రామం నుండి కత్తి ప్రస్థానం మొదలైంది. చిన్ననాటి నుంచి చదువులో ముందుండే కత్తి, తన భవిష్యత్తును చదువులోనే చూసుకున్నాడు. అట్లా ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చేరుకున్నాడు. అక్కడ మాస్‌ కమ్యూనికేషన్స్‌ కోర్సులో చేరి తన ఆలోచనా ప్రపంచాన్ని మరింత విశాలం చేసుకున్నాడు. సినిమాల పట్ల తనకున్న అభిలాషను మరింత పరిశోధనాత్మక పద్ధతిలో పెంపొందించుకున్నాడు. ప్రపంచ సినిమాను, ఇండియన్‌ సినిమాను పోల్చి అనేక విశ్లేషణలు చేశాడు. అదే కత్తిని మంచి సినీ విమర్శకుణ్ణి చేసింది. అనేకమంది అభిమానుల్ని అక్కున చేర్చింది. 


ఏ మహేష్‌ అంటే ఫిల్మ్‌ క్రిటిక్‌ కత్తి మహేష్‌ అనే పేరు అనతికాలంలోనే బాగా పాపులర్‌ అయింది. దీంతో రకరకాల టీవీ ఛానళ్లు కత్తి రివ్యూల కోసం స్పేస్‌ను కేటాయించాయి. ఆయన విశ్లేషణలకు ఆదరణ ఎంత వరకు వెళ్లిందంటే, కత్తి రివ్యూ చూశాకే కొత్త సినిమా చూడాలి అనే వరకు చేరింది. అట్లా నిర్మొహమాటంగా సినిమాలను సమీక్షించేవాడు. నిష్పక్షపాతంగా రేటింగులు ఇచ్చేవాడు. సినిమాలోని లోపాలను చెప్పినంత నిర్భయంగా వాటిలోని మంచి విషయాలను కూడా అంతే జాగ్రత్తగా చెప్పేవాడు. ఇదే కత్తిని కత్తిలా నిలబెట్టింది. అక్కడి నుండి రివ్వున గాలిలో ఎగిరినట్టు కత్తి పేరు, రూపమూ వెండితెర మీద కూడా కనిపించడం మొదలైంది. తనలోని నటుణ్ణి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మెప్పించాడు. అంతటితోటే సంతోష పడకుండా సినిమాలను డైరెక్ట్ చేసే స్థాయికి వెళ్లాడు. అట్లా రెండు మూడు సినిమాలకు డైరక్షన్‌ చేసి చూపించాడు. గాఢ్‌ఫాదర్‌లు ఉంటే తప్ప రాణించలేని సినిమా ఇండస్ట్రీలో ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే తనకంటూ ఒక గుర్తింపును, గౌరవాన్ని సంపాదించుకోగలిగాడు. 


ఈ నేపథ్యంలోనే ఒక అగ్రహీరో సినిమాల మీద తాను చేసిన విశ్లేషణల వల్ల అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. నిత్యం కొన్ని నెలలపాటు వేధింపులు ఎదురైనా సరే ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నాడు. వేలాది ఫోన్‌కాల్స్‌, ప్రత్యక్ష బెదిరింపులకు సైతం జడవకుండా తన మాట మీదే నిలబడడం కత్తికి మరింత మంది అభిమానులను తెచ్చిపెట్టింది. అలా కత్తి మహేష్‌ అంటే ఒక తిరుగుబాటు, ఒక ధిక్కారం, ఒక తెగింపు అనే విషయం మన సమాజానికి తెలిసి వచ్చింది. ఇంతటితోటే ఆగిపోయి ఉంటే కత్తి మహేష్‌ కేవలం సినిమా మనిషి అయ్యేవాడు. కానీ, కత్తిలో ఒక సామాజిక ఆలోచనాపరుడు కూడా ఉన్నాడు. అందుకే ఆయన రాజకీయాల మీద కూడా దృష్టి సారించాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వస్తున్న మార్పులను నిత్యం సమీక్షించుకుంటూ, ఎవరు ప్రజలకు మేలు చేస్తారనే ఆలోచనలను సామాజిక మాధ్యమాల మీదుగా పంచుకునేవాడు. అట్లా కత్తి మాట్లాడేటప్పుడు తప్పకుండా రేపు భవిష్యత్తులో ఒక మంచి నేతగా ఎదిగి వస్తాడనే ఆశలు కల్పించాడు.


ఇక కత్తిలో చాలామందికి నచ్చే అంశం అతడిలోని సామాజిక ఉద్యమకారునితనం. ఈ సమాజంలో కుల, మత బాధితుల పక్షం వహించాలనే ప్రజాస్వామికతనం తనను కుదురుగా ఉండనిచ్చేది కాదు. అందుకే ఎక్కడ దళితుల మీద దాడి జరిగినా రెక్కలు కట్టుకు వాలిపోయేవాడు. అది రోహిత్‌ వేముల పోరాటమైనా, మరొకటి అయినా బాధితులకు అండగా నిలబడడం అనేది తన జీవనవిధానంగా మార్చుకున్నాడు. సాధారణంగా సినీ పాపులారిటీ వచ్చిన వాళ్లు తమ కార్ల నల్లటి అద్దాలు దాటి బయటి ప్రపంచాన్ని చూడడానికి అంతగా ఇష్టాన్ని చూపించరు. కానీ, కత్తి వారికి భిన్నంగా ఈ సమాజంలో ఒక విద్యావంతునిగా, ఆలోచనాపరునిగా, సామాజిక చింతనాపరునిగా నిత్యం బాధితుల కోసం పని చేస్తూనే ముందుకు సాగాడు. ఇందుకోసం ఆయన బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఐడియాలజీని ఆశ్రయించాడు. బహుజన మహనీయుల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని సూచించాడు. దళిత, బహుజనుల సకల సమస్యలకు రాజ్యాధికారమే మార్గమని నమ్మాడు. 


మరోవైపు కత్తిలో మంచి పాఠకుడు కూడా ఉన్నాడు. నిత్యం సాహిత్యాన్ని చదువుతూ, తరచుగా సాహిత్యసభలకు హాజరయ్యేవాడు. వక్తగా సాహిత్యసభల్లో మాట్లాడే సమయంలో కూడా ఏ వర్తమాన విమర్శకునికి తీసిపోని విధంగా తనదైన అధ్యయన అవగాహనతో సాహిత్యాన్ని విశ్లేషించేవాడు. సాహిత్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అధునాతనమైన ప్రాపంచిక దృక్పథంతో విడమరిచి చెప్పేవాడు. అట్లా ఎంతోమంది సాహితీమిత్రులను కూడా సంపాదించుకున్నాడు. ఇన్ని రంగాల్లో సమానమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం అందరికీ సాధ్యం కాదు. 


ఇట్లా ఎంతోమంది అభిమానులను, మిత్రులను సంపాదించుకున్న ఒక కలం, గళం అకాల మరణం పాలు కావడం ఎవ్వరూ ఊహించని పరిణామం. అత్యంత విషాదకరం. రేపటి అనేక పరిణామాలకు, మార్పులకు మూలస్తంభంగా నిలుస్తాడని ఆశించిన వారందరినీ తీవ్ర దు‍‍‌ఃఖంలో ముంచి కత్తి మహేష్‌ వెళ్లిపోవడం బాధాకరం. అతనితో చాలా సన్నిహితంగా మెలిగిన నాలాంటి వారికి ఇదొక చీకటి రోజు. ప్రమాదకరమైన పరిస్థితులను ఎదురించి పోరాడి గెలిచిన కత్తిని, రోడ్డు ప్రమాదం మాత్రం ఓడించింది. ఈ సమాజం మేలు కోసం నిరంతరం పని చేసే ఒక సామాజిక గొంతును అకాల మరణం మూగబోయేలా చేసింది. ఆ మరపురాని మనిషికి కడసారి కన్నీటి జోహార్లు!!

డా.పసునూరి రవీందర్‌

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ

Updated Date - 2021-07-14T05:53:20+05:30 IST