వర్షం హర్షం

ABN , First Publish Date - 2022-07-05T06:11:53+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మూ డు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతన్నలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు అడపాదడపా వర్షాలు పడుతుండడంతో రైతులు నిరాశచెందారు.

వర్షం హర్షం
లింగంపేట పెద్దవాగు

జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల హర్షం

వాగులు, చెరువుల్లోకి చేరుతున్న వరద   

పోచారం ప్రాజెక్ట్‌లోకి కొత్త నీరు

జిల్లాలో 68.7 మి.మీ. వర్షపాతం నమోదు 

అత్యధికంగా కామారెడ్డిలో 112.4మి.మీ.

జిల్లా వ్యాప్తంగా సాధారణంకంటే ఎక్కువే వర్షపాతం నమోదు

పంటల సాగు పనుల్లో బీజీ అయిన రైతన్నలు

కామారెడ్డి, జూలై 4(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మూ డు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతన్నలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు అడపాదడపా వర్షాలు పడుతుండడంతో రైతులు నిరాశచెందారు. మూడురోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఇప్పటివరకు లక్ష ఎకరాలకు పైగా వివిధ పంటలు వేశారు. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 68.7 మి.మీ. వర్షపాతం నమోదు కాగా కామారెడ్డిలో 112.4 మి.మీ. వర్షం కురిసింది. ఈ వ ర్షాలకు జిల్లాలోని పలు చెరువులు, కుంటల్లో స్వల్పంగా నీరు వచ్చి చేరుతోంది. వాగులు నీటి ప్రవాహంతో కలకలాడుతున్నాయి. పోచారం ప్రాజెక్ట్‌లోకి వరద వస్తుండడంతో ప్రాజెక్ట్‌ నిండుతోంది. 

68.7మి.మీ. వర్షపాతం.. 

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఆదివారం సాయం త్రం నుంచి ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అంతకు ముందు రెండురోజులు జిల్లాలోని అన్ని మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఇలా జిల్లాలో 68.7మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామారెడ్డిలో 112.4 మి.మీ. వర్షం కురిసింది. మాచారెడ్డి మండలంలో 52.4, రామా రెడ్డిలో 59.8,దోమకొండ 86.6, గాంఽ దారిలో 85.4, సదాశివనగర్‌లో 49.2, రాజంపేట్‌లో 50.6, భిక్కనూరులో 42.0, లింగం పేట్‌లో 77.8, తాడ్వా యిలో 87.2, ఎల్లారెడ్డిలో 60.8, నాగిరెడ్డి పేట్‌లో 56.2, నిజాంసాగర్‌లో 80.6, పిట్లంలో 84.4, బిచ్కుందలో 47.6, పెద్దకొ డప్‌గల్‌లో 93.6, మద్నూర్‌లో 42.0, బాన్సువాడలో 97.6, బీర్కూర్‌లో 40.4, నస్రూల్లాబాద్‌లో 49.2 మి.మీ., జుక్కల్‌ 56.4 మి.మీ. వర్షపాత నమోదైంది. జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తుడడంతో పలు చెరువులు, కుంటల్లోకి వరుదనీరు వచ్చి చేరుతోంది. పలు వాగులు, వంకల్లో వరద ఉరకలేస్తోంది. 

సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం నమోదైంది. జూన్‌లో అడపాదడపా వర్షాలు పడుతూ వచ్చాయి. కొన్ని మండలాల్లోనే కాకుండా జిల్లావ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతూవచ్చింది. మూడురోజులుగా భారీ వర్షాలు కురవడంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌ మొదటి నుంచి ఇప్పటివరకు 183.4 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 1029.0 మి.మీ. వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నస్రూళ్లబాద్‌ మండలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకాగా రామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. మిగతా మండలాల్లో సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం నమోదయింది.

విస్తారంగా సాగవుతున్న పంటలు

ఈ వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 5.36లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితేజూన్‌లో ఆశించిన మేర వర్షాలు కురువలేదు. దీంతో రైతులు ఆరుతడి పంటలను వేశారు. ప్రధానంగా మొక్కజొన్న, సోయాబిన్‌, పత్తి, కందులు, మినుములు, పెసర్లలాంటి ఆరుతడి పంటలను విస్తారంగా సాగుచేస్తున్నారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడం నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌ల నుంచి సాగునీటిని విడుదల చేయడంతో ప్రాజెక్ట్‌ల కాలువల క్రింద వరినాట్లు మొదలయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 6142 ఎకరాల్లో వరినాట్లు పడగా 28,475ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. సోయాబీన్‌ 42,878 ఎకరాలలో, పత్తి 16256 ఎకరాలలో, కందులు 7654 ఎకరాలలో, పెసర్లు 3124 ఎకరాలలో, మినుములు 3684 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వరినాట్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.


Updated Date - 2022-07-05T06:11:53+05:30 IST