కర్ణాటక మంత్రి జార్కిహొళి రాసకేళి!

ABN , First Publish Date - 2021-03-03T07:19:46+05:30 IST

ఉప ఎన్నికల ముంగిట కర్ణాటకలో శృంగార సీడీ బాంబు పేలింది. జలవనరులశాఖ మంత్రి రమేశ్‌ జార్కిహొళికి సంబంధించిన ఓ వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి రమేశ్‌ జార్కిహొళి ఓ యువతితో

కర్ణాటక మంత్రి జార్కిహొళి రాసకేళి!

  • ప్రకంపనలు సృష్టిస్తున్న రమేశ్‌ వ్యవహారం
  • సోషల్‌ మీడియాలో శృంగార సీడీ వైరల్‌
  • రాష్ట్రంలో బీజేపీ సర్కారుని తెచ్చిన నేత
  • కాంగ్రెస్‌ అసమ్మతి సమీకరణలో కీలకం
  • రేపటి నుంచి శాసనసభ సమావేశాలు
  • విరుచుకుపడేందుకు విపక్షాలు సిద్ధం
  • ఈ లోపే వేటువేసే యోచనలో అధిష్ఠానం
  • సంకటంలో సీఎం యడియూరప్ప


బెంగళూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నికల ముంగిట కర్ణాటకలో శృంగార సీడీ బాంబు పేలింది.  జలవనరులశాఖ మంత్రి రమేశ్‌ జార్కిహొళికి సంబంధించిన ఓ వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.  మంత్రి రమేశ్‌ జార్కిహొళి ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను దినేశ్‌ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు మీడియాకు విడుదల చేశారు. కేపీటీసీఎల్‌లో (కర్ణాటక పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన యువతిని లొంగదీసుకున్న మంత్రి రమేశ్‌జార్కిహొళి ఆమెతో రాసలీలలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను ఎక్కడ, ఎవరు తీశారనేది స్పష్టత లేదు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆనక మోసం చేసినందుకు ప్రతీకారంగా బాధితురాలేపక్కా ప్రణాళికతోనే వీడియో తీయించి ఉంటుందని భావిస్తున్నారు.


మరో కథనం ప్రకారం షార్ట్‌ ఫిల్మ్‌ తీసేందుకు మం త్రితో ఆమె సాన్నిహిత్యం పెంచుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని దినేశ్‌ కల్లహళ్లి బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కాగా, కర్ణాటక శాసనసభ సమావేశాలు మరో రెండు రోజుల్లో మొదలవుతున్నాయి. అలాగే, రమేశ్‌ జార్కిహోళి అ డ్డా బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్నాయి. ఈ తరుణంలో లీక్‌ అయిన శృంగార సీడీ వ్యవహారం రాజకీయరంగు పులుముకొంటోంది. మంత్రి రాసలీలల వ్యవహారం ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. సభలో ఈ వ్యవహారంపై సర్కారును ఇరుకునపెట్టడానికి అవి సిద్ధమవుతున్నాయి. 


కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో రమేశ్‌ జార్కిహొళి అత్యంత కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలను సమీకరించి వారితో తిరుగుబావుటా లేవనెత్తించి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించిన సమయంలో రమేశ్‌ జార్కిహొళి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈయన ఒకనాడు కాంగ్రె్‌సకు చెందిన సీనియర్‌ నేత. కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక శాఖ నేతలతో విభేదించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడానికి పక్కాగా పావులు కదిపారు. అలాంటి నేత వివాదంలో చిక్కుకోవడం ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేసింది. మరోవైపు శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు ఈ అంశం అస్త్రం గా మారకముందే ఆయనతో రాజీనామా చేయించే అంశాన్ని బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే తన పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని బెంగళూరులో మంత్రి జార్కిహొళి స్పష్టం చేశారు. ‘వీడియోను విడుదల చేసిన సామాజిక కార్యకర్త ఎవరో తెలియదు. వీడియోలో కనిపించిన యువతి ఎవరో కూడా తెలియదు. తప్పు చేసిన ట్టు రుజువైతే ఉరిశిక్షకూ సిద్ధమే’ అని మంత్రి ప్రకటించారు.

Updated Date - 2021-03-03T07:19:46+05:30 IST