కోర్టు వద్దకు తరలివచ్చిన టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2022-08-20T05:19:14+05:30 IST

రిమాండులో ఉన్న టీడీపీ నేతలను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు శుక్రవారం చిత్తూరు కోర్టు ఆవరణకు తరలివచ్చారు.

కోర్టు వద్దకు తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
చిత్తూరు కోర్టు ఆవరణకు తరలివచ్చారు.

చిత్తూరు లీగల్‌, ఆగస్టు 19: రిమాండులో ఉన్న టీడీపీ నేతలను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు శుక్రవారం చిత్తూరు కోర్టు ఆవరణకు తరలివచ్చారు. వీరితో కోర్టు ప్రాంగణం కిక్కిరిసింది. పూతలపట్టు మండలం వేపనపల్లి గ్రామంలో ఈ నెల 4వ తేదిన ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు గడపడపకు కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో వేపనపల్లికి చెందిన జశ్వంత్‌.. తనకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పడలేదని ఎమ్మెల్యేను అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అనుచరులు జశ్వంత్‌పై దాడిచేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళుతుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత హేమాద్రి మరికొందరు పోలీసు వాహనాన్ని ఆపి ప్రశ్నించారు. అక్కడ వైసీపీ నేతలు టీడీపీ నేత హేమాద్రిపై దాడి చేశారు. దీంతో పాలీసులు హేమాద్రితో పాటు మరో 9 మందిపై పలు కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసు గురువారం ఆరవ అదనపు జిల్లా కోర్టులో వాయిదాకు రాగా న్యాయమూర్తి వచ్చే నెల ఒకటో తేదికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా పోలీసు స్టేషన్‌ వద్ద అదే రోజు రాత్రి టీడీపీ నాయకులు తన వాహనాన్ని ధ్వంసం చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పులివర్తి నాని, సప్తగిరి ప్రసాద్‌, వెంకటేశ్వరచౌదరి, వడ్లమూడి గిరిదర్‌, గుణశేఖర్‌నాయుడు, నరసింహులు, వెంటకరమణ, దొరబాబుచౌదరి, చంద్రమౌళి, గోపాల్‌నాయుడు, దయాసాగర్‌పై మండల వైసీపీ కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నాయకులపైనా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిలో దొరబాబుచౌదరి, చంద్రమౌళి, గోపాల్‌, దయను అదే రోజు రాత్రి అరెస్టు చేసి 5వ తేదిన రిమాండుకు తరలించారు. ఈ కేసు శుక్రవారం మూడవ కోర్టులో వాయిదా ఉండగా న్యాయమూర్తి 30వ తేదికి వాయిదా వేశారు. దొరబబాబుచౌదరి, చంద్రమౌళి, గోపాల్‌, దయలకు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయవాదులు చంద్రశేఖర్‌నాయుడు, రామక్రిష్ణనాయుడు, మునస్వామినాయుడు ఆరవ అదనపు జిల్లా కోర్టులో వాదనలు వినిపంచారు. బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి శాంతి తెలిపారు. ఈ కేసు సందర్భంగా టీడీపీ నేతలు కోర్టు వద్దకు భారీగా చేరుకున్నారు. ఓ దశలో వీరిని కట్టడి చేయడానికి పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

పులివర్తి నానికి హైకోర్టులో ఊరట

టీడీపీ నేత పులివర్తినానితో పాటు మరి కొందరికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో కొంత ఊరట కలిగింది. వైసీపీ నేత ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసిన కేసుపై పులివర్తి నాని, సప్తగిరిప్రసాద్‌, వెంకటేశ్వరచౌదరి, గిరిధర్‌బాబు, గుణశేఖర్‌నాయుడు, నరసింహులు, వెంకటరమణ తమకు బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వీరిని 15 రోజుల వరకు పోలీసులు అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. 


Updated Date - 2022-08-20T05:19:14+05:30 IST